కిషన్ రెడ్డి ఫస్ట్ టాస్క్ ఇదేనా?
posted on Jul 6, 2023 @ 2:20PM
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టేందుకు కొంత సమయం తీసుకుంకుంటున్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన తరువాత మాత్రమే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. ఇప్పటికే బండి సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. దీంతో మోడీ తెలంగాణ పర్యటన సమయంలో రాష్ట్ర పార్టీ నాయకుడులేని సైన్యంగా ఉండనుంది.
అయితే ఈ నెల 18న జరగనున్న ప్రధాని వరంగల్ సభను సక్సెస్ చేయడం తమ ముందున్న టాస్క్ అని కిషన్ రెడ్డి చెప్పారు.బాధ్యతలు ఇంకా చేపట్టకపోయినప్పటికీ ప్రధాని సభకు ముందునుంచీ పార్టీ చెబుతున్నవిధంగా పదిహేను లక్షల మందిని సమీకరించి సభను గ్రాండ్ సక్సెస్ చేయడంపైనే కిషన్ రెడ్డి సక్సెస్ ఆధారపడి ఉంటుందని రాజకీయ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. గత నాలుగేళ్లుగా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డికి రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణలో భాగస్వామి కావాల్సిన అవసరం పెద్దగా లేకుండా పోయింది. అయితే బండి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్ఠానం మెప్పు పొందేలా రాష్ట్రంలో బీజేపీ సభలను నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో బీజేపీ సభలను సక్సెస్ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై అలుపెరుగని పోరాటం చేశారు. రాష్ట్రంలో విడతల వారీగా పాదయాత్ర చేసిన బండి సంజయ్ ఆయా సందర్భాలలో ఏర్పాటు చేసిన ముగింపు సభలకు పార్టీ జాతీయ నాయకులను రప్పించి వాటిని గ్రాండ్ సక్సెస్ చేశారు.
బండి సంజయ్ పని తీరును స్వయంగా మోడీ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ప్రశంసించారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారాయి. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో బండి తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ సభ సక్సెస్ కోసం ఆయన పూర్తి స్థాయిలో పని చేస్తారన్న నమ్మకం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇక ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు ఏ మేరకు మోడీ సభ విజయవంతానికి పని చేస్తారన్న అనుమానాలూ ఉన్నాయి. మొత్తంగా బండి సంజయ్ మార్పుతో రాష్ట్ర బీజేపీలో ఒక్క సారిగా నిస్తేజ వాతావరణం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి మోడీ సభ సక్సెస్ కోసం ఒక్కడిగా, ఒంటరిగా కష్టపడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు.
అందుకే కిషన్ రెడ్డి రెండు రోజుల పాటు వరంగల్ లోనే మకాం వేయనున్నారు. అధిష్టానం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన అనంతరం తొలి సభ కావడంతో ప్రధాని మోడీ గుడ్ లుక్స్ లో పడేందుకు ఈ సభ సక్సెస్ విషయంలో కిషన్ రెడ్డి శక్తికి మించి కృషి చేయాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణ జిల్లాల అధ్యక్షుల నుంచి ఆశించిన విధంగా కిషన్ రెడ్డికి సహకారం అందే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయని చెబుతున్నారు.
గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఏడేళ్లుగా కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉండటంతో జిల్లాల అధ్యక్షులతో అంతగా సంబంధాలు లేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆ కారణంగానే సభ సక్సెస్ విషయంలో అనుమానాలు ఉండటం వల్లనే కిషన్ రెడ్డి మోడీ సభ అనంతరం మాత్రమే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపడతానని అంటున్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది.