తెలుగు వీర.. లేవరా?
posted on Jul 7, 2023 7:14AM
ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ ప్రభుత్వంలో సలహాదారులు లెక్కకు మిక్కలిగానే ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ముఖ్య సలహదారుడు కూడా ఉన్నారు. మరి ఆ సలహాదారులే మరిచిపోయారో లేక ఆ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడే మరిచిపోయారో.. అదీ ఇదీ కాకుంటే.. వారంత కలిసికట్టుగా చెప్పినా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎవరి మాటలు వినిపించుకోకుండా.. జులై 4న ఛలో చిత్తూరు అంటూ విమానం ఎక్కి వెళ్లి పోయారో ఏమిటో అంటూ ఓ చర్చ అయితే వైసీపీ లోని ఓ వర్గంలో ఊపందుకొంది.
జులై 4 మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి. బతుకు తెరువుకి దేశానికి వచ్చి.. భారతీయులను బానిసలుగా చేసిన ఆంగ్లేయులపై విప్లవ శంఖం పూరించిన అగ్గి పిడుగు అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు.. అదీ ఆయన పుట్టిన గడ్డెపై.. ప్రభుత్వ వర్గాలు ఎంత అట్టహసంగా జరపాలి. కానీ ఆ జాడ.. రాష్ట్రంలో ఎక్కడా.. కనిపించక పోవడంతో ప్రపంచంలోని తెలుగు వారిలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
ఇక పక్క రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరై అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించడమే కాకుండా.. ఆయనలోని దేశభక్తి, పోరాట పటిమ..స్ఫూర్తిగా తీసుకోవాలంటూ భవిష్యత్ తరాలకు పిలుపునిచ్చారు. మరి పక్క రాష్ట్రంలో అలా జరిగితే.. ఆయన పుట్టినగడ్డపై ఇంకా ఎంత ఘనంగా నిర్వహించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల నుంచే గట్టిగా వినిపిస్తున్నాయి.
అదీకాక గత ఏడాది అంటే 2022, జూలై 4వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఇదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అప్పటి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, మంత్రి మంత్రులు రోజాతో హాజరయ్యారు. మరి అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ప్రారంభానికి హాజరైన.. ఈ ముఖ్యమంత్రివర్యులు.. జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని వైసీపీ శ్రేణుల్లోనే అనుమానాలు, అసంతృప్తి వ్యక్తమౌతోంది.
మరోవైపు అల్లూరి సీతారామారాజు జయంతి ఉత్సవాల వేడుకలు జరపకపోవడానికి జగన్ పార్టీలోని రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి కారణమని.. ఆయనపై ఆగ్రహంతోనే జగన్ ప్రభుత్వం.. మన్యం వీరుడి జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించలేదంటూ మీడియాలో, సామాజిక మాధ్యమంలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇలా ఒకరిపై కోపాన్ని భారత జాతి కోసం నిప్పు కణంలా మండిన అల్లూరి సీతారామరాజుపై చూపడం సరికాదనే అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మహానేత పేరుతో విగ్రహాలు, జయంతిలు, వర్దంతిలు, సభలు, సమావేశాలు, ప్లీనరీలు నిర్వహించే ఈ ప్రభుత్వం మన్యం వీరుడి 125వ జయంతి ఉత్సవాలు ముగింపు వేడుకలు.. అదీ ఆయన పుట్టిన గడ్డపై జరపకపోవడం.. కడు శోచనీయమని ప్రజాస్వామిక వాదులు సైతం తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.