కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా?
posted on Jul 5, 2023 @ 4:36PM
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసేశారా? అందుకే బుధవారం (జులై 5) కేంద్ర కేబినెట్ భేటీకి ఆయన హాజరు కాలేదా? అన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హై కమాండ్ సంస్థాగత మార్పులు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించింది.
కొందరిని జాతీయ కార్యవర్గంలోనికి తీసుకుంది. కొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చింది. అందులో భాగంగానే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింంది. దీంతో ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే ఇప్పటికే కిషన్ రెడ్డి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసేశారనీ, అందుకే కేంద్ర మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదని అంటున్నారు. అయితే ఆయన రాజీనామా విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటనా లేకపోవడంతో కేబినెట్ భేటీకి ఆయన డుమ్మాకు కారణాలేమిటన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. బీజేపీ తెలంగాణ పగ్గాలు చేపట్టడం ఇష్టం లేని కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనై తన నిరసనను వ్యక్తం చేయడం కోసం కేబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టారని పొలిటికల్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవతుండగా, పార్టీ వర్గాలు మాత్రం అనారోగ్యం కారణంగా ఆయన కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నారని చెబుతున్నాయి.
అయితే కిషన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనీ, అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యాకా ఇంత వరకూ ఆయన మీడియా ముఖంగా మాట్లాడలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలోనే ఉండి కూడా కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టడం కూడా అందులో భాగమేనని చెబుతున్నారు.