జులై 18న ఎన్డీయే పక్షాల మీటింగ్.. ఓటమి భయంతో దిగొచ్చిన మోడీ సర్కార్
posted on Jul 7, 2023 @ 12:57PM
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరౌతున్న కొద్దీ బీజేపీలో కంగారు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. 2014 ఎన్నికలలో విజయంపై విశ్వాసం అంతంత మాత్రంగానే ఉన్న బీజేపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు పెద్ద పీట వేసింది. ఆ పార్టీల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించింది. రాష్ట్రల ప్రయోజనాలను పరిరక్షిస్తూ దేశ ప్రగతిలో వాటినీ భాగస్వామ్యం చేస్తామని నమ్మబలికింది.
అయితే ఆ ఎన్నికలలో ఎన్డీయే కూటమి పక్షాల అవసరం లేకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం రావడంతో బీజేపీ ధోరణిలో మార్పు వచ్చింది. అయినా మోడీ తొలి కేబినెట్ లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి నుంచే భాగస్వామ్య పక్షాలను బలహీనం చేయడం అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం వంటి బలమైన ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయడం అది కుదరకపోతే ఎన్డీయేలోంచి పొమ్మనకుండానే పొగపెట్టి.. అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో విపక్షాలు బలపడేందుకు అన్ని విధాలుగా దోహదపడటం వంటి చర్యలకు పాల్పడింది. 2019 ఎన్నికల సమయం వచ్చే సరికి ఎన్డీయే అనేది పేరుకు మాత్రమే అన్నట్లుగా మిగిలింది.
ఆ ఎన్నికలలోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవరి మీదా ఆధారపడకుండానే సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఇక అక్కడి నుంచీ బీజేపీ విస్తరణ కాంక్ష పెచ్చరిల్లింది. రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకునే రాజకీయానికి తెరతీసింది. బలమైన ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వాటికి ఆర్థిక చీకాకులు కలిగేలా వ్యూహాలు రచించి అమలు చేసింది. ఫెడరల్ స్ఫూర్తిని తుంగలోకి తొక్కి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేందుకు కూడా వెరవకుండా ముందుకు సాగింది. ఇక ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ గత తొమ్మిదేళ్లకు పైగా ఉన్న మోడీ సర్కార్ పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను గుర్తించిన బీజేపీ హై కమాండ్.. మోడీ హ్యాట్రిక్ విజయానికి ఎన్డీయే పటిష్టంగా ఉండటం వినా మరో మార్గం లేదని గ్రహించింది. అందుకే ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 18న జరగనున్న ఈ సమావేశానికి పాత మిత్రులకు కూడా ఆహ్వానాలు పంపిందని అంటున్నారు. అందులో భాగంగానే ఎబీజేపీతో విభేదించి గత ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసిన తెలుగుదేశంకి సైతం ఆహ్వానం పంపింది.
మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేయలేదు. ఎన్నికల వేళ తన అవసరాల కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ కాక కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం.. దానికి తోడు బీజేపీయేతర పక్షాలన్నీ మోడీ సర్కార్ ను గద్దె దింపడమే లక్ష్యం ఐక్యతారాగం ఆలపించడంతో వచ్చే ఎన్నికలలో గెలవాలంటే సొంత బలం చాలదన్న గ్రహింపునకు బీజేపీ వచ్చిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా ఉన్న పార్టీలతో పాటు పాత మిత్రులకూ, కొత్త మిత్రులకూ కూడా ఈ నెల 18న నిర్వహించనున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది