టార్గెట్ కాంగ్రెస్.. బీజేపీ-బీఆర్ఎస్ తెరవెనక స్నేహం?
posted on Jul 6, 2023 @ 4:56PM
తెలంగాణలో బీఆర్ఎస్ ,బీజేపీల మధ్య స్నేహం ఉందా? వైరం ఉందా? అసలు ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇదే చాలా కాలంగా తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తున్న ప్రశ్న. తెలంగాణ ప్రజలలో కూడా జరుగుతున్న చర్చ. ఈ రెండు పార్టీల నేతలు రాష్ట్రంలో ఉప్పూ నిప్పులా ఉంటారు. రోజూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుంటారు. ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలను టార్గెట్ చేసి అరెస్టులు చేయిస్తే.. ఢిల్లీలో బీజేపీ.. బీఆర్ఎస్ నేతలను కేసులతో పరుగులు పెట్టిస్తుంటుంది. బీజేపీ తెలంగాణలో జెండా పాతాలని చూస్తుంటే.. బీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నది. అయితే ఇదంతా నిజమా? నిజంగానే ఈ రెండు పార్టీలూ ప్రత్యర్థులేనా అంటే ఏమో ఇది కూడా ఒకరకమైన రాజకీయమే అని చెప్పుకోక తప్పదు.
గల్లీలో కొట్టుకుంటారు.. ఢిల్లీలో కలుసుకుంటారని కాంగ్రెస్ నేతలు అప్పుడప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఆరోపిస్తుంటారు. ఏమో అది కూడా నిజం ఎందుకు కాకూడదు అని ఇప్పటి రాజకీయాలను చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ మాత్రమే. అసలు బీజేపీ నినాదమే కాంగ్రెస్ ముక్త భారత్. అందుకే బీజేపీ తలపడినా, పోటీపడినా కాంగ్రెస్ తోనే. కనుక బీజేపీ టార్గెట్ కాంగ్రెస్ మాత్రమే. పోనీ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ శత్రువే కదా అనుకున్నా.. అది బీఆర్ఎస్ అధికారాన్ని బీజేపీ లాక్కొనే స్థాయి శత్రుత్వం కాదు. ఆ మాట కొస్తే తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కాలంటే ఆషామాషీ కాదు. అది బీజేపీ పెద్దలకు సైతం తెలుసు. ఇక తెలంగాణలో ఏదైనా అవకాశం ఉందంటే అది కాంగ్రెస్ కు మాత్రమే. రాష్ట్రాన్ని ప్రసాదించిన పార్టీగా.. గల్లీ నుండి నిర్మాణాత్మకమైన క్యాడర్ ఉన్న పార్టీగా కాంగ్రెస్ కు ఆ అవకాశం ఉంది. ఉంటుంది కూడా. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ను బీఆర్ఎస్, బీజేపీకి ఉమ్మడి శత్రువును చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ బలపడితే అటు కేంద్రంలో బీజేపీకి.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ముప్పు. ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలో చేరిన కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా కాంగ్రెస్ వశమైతే బీజేపీకి అది తట్టుకోలేని ఎదురు దెబ్బగా మారుతుంది. దేశ వ్యాప్తంగా ఇది బీజేపీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక, తెలంగాణలో బీజేపీకి అధికారం ఎలాగూ దక్కదు.. కనుక తాను బలపడకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని పరిశీలకులు ఇటీవలి పరిణామాలను ఉటంకిస్తూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు తెరవెనక మిత్రులుగా మారారన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. పైకి బీజేపీ వెర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా కనిపిస్తూ కాంగ్రెస్ ను తగ్గించడం అన్నదే ఈ రెండు పార్టీల వ్యూహంగా చెబుతున్నారు.
ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటలను అద్యక్షుడిని చేస్తారని ప్రచారం జరిగినా అది నిజం కాలేదు. దీనికి కారణం ఈటల బీఆర్ఎస్ పార్టీకి శత్రువు కావడమే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహం ఈటల అధ్యక్షుడిగా ఉంటే సాగదు. అందుకే సౌమ్యుడు, తొలి నుండి బీజేపీ అధిష్టానికి చేరువగా ఉండే కిషన్ రెడ్డిని ఈ ప్రణాళిక కోసం ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును గంప గుత్తగా కాంగ్రెస్ కు పడకుండా అడ్డుకుంటూనే.. మరోవైపు బీఆర్ఎస్ విజయానికి బాటలు పరచడమే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ప్లాన్ గా కనిపిస్తున్నదని.. మరోవైపు అదే మాదిరిగా దేశంలో కూడా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు పడకుండా చీల్చే పని బీఆర్ఎస్ తలకెత్తుకున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.