చిన్నమ్మ నెగ్గుకొచ్చేనా?
posted on Jul 5, 2023 @ 1:28PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా దుగ్గుబాటి పురేందేశ్వరిని నియమిస్తూ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగిస్తారంటూ ఏడాదిగా ప్రచారం జరిగినా.. ఆయన్ని ఇలా తొలగించి.. ఆ పదవిని అలా పురేందేశ్వరికి కట్టబెట్టడం చకచకా జరిగిపోయాయి. అయితే చిన్నమ్మ.. ఆ పార్టీ పగ్గాలు చేపట్టి.. ఆ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలుగుతారా? అలాగే అధికార వైసీపీ వై నాట్ 175 కోసం సాగిస్తున్న సోషల్ మీడియా దాడి.. పురేందేశ్వరీని సైతం లక్ష్యంగా చేసుకొంటుందా? ఇప్పటికే.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సామాజిక మాధ్యమంలో దుష్ప్ర చారానికి జగన్ పార్టీ తెర తీసింది. ఆ జాబితాలో దుగ్గుబాటి పురేందేశ్వరిని సైతం చేరుస్తారా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉన్నా.. జగన్ పాలన పగ్గాలు చేపట్టి నాలుగున్నరేళ్లు అయింది. ఈ సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయి. ఇంకా ఎన్ని అమలు కావాల్సి ఉంది. అలాగే మూడు రాజధానులు అంశం అశం, ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి ప్రత్యేక ప్యాకేజీలపై పురందేశ్వరి ప్రజలను ఎలా సమాధాన పరుస్తారన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నమౌతున్నాయి.
అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయిందా అంటే చెప్పే నాథుడే లేరు. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల ఆందోళనలు, ధర్నాలు పాదయాత్రలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందే తప్ప జగన్ ప్రభుత్వాన్ని అదిలించి.. ప్రశ్నించింది లేదన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె.. విశాఖపట్నం నుంచి వరుసుగా రెండు సార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికై.. నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన సమయంలో హస్తం పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీ గుటికి చేరి.. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నుంచి లోక్ సభ సభ్యురాలిగా బరిలోకి దిగి.. ఓటమి పాలవుతూ వస్తున్నారు. అలాంటి వేళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోన్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి.. ఈ చిన్నమ్మ నెట్టుకొస్తారా? లేదా అనే ఓ ప్రశ్న అయితే పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.