స్పీడ్ న్యూస్ 1
posted on Jul 6, 2023 @ 3:59PM
1.శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్‌ను ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడో తొలగించామని, ఆయన స్థానంలో తనను చీఫ్‌గా ఎన్నుకున్నారని పేర్కొన్నారు.
2.తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
3. రాజధాని అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్5జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందా? లేక ఇళ్ల పట్టాల పంపిణీ వరకే అనుమతించిందా? ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
4.ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు ఖాయమని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీతో ఇదే విషయం చర్చించినట్టు తెలిపారు.
5. అమెరికా పౌరసత్వం పొందడం ఇకపై మరింత కఠినతరం కానుంది. విదేశీయులకు పౌరసత్వం ఇచ్చేందుకు నిర్వహించే నేచురలైజేషన్ పరీక్షలో అమెరికా కీలక మార్పులు చేయనుంది.
6.టీడీపీ యువనేత మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 147వ రోజు కోవూరు నియోజకవర్గంలో జనసందోహం నడుమ ఉత్సాహంగా సాగింది. లోకేశ్‌ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
7.ఈ వారాంతం నుండి భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
8.తమకు ముందస్తు ఆలోచన లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బుధవారం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ముందస్తు గురించి ప్రశ్నించారు.
9.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, ఇద్దరం కలిసి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ.. పార్టీ పదవి అనేది బాధ్యతతో కూడుకున్నదన్నారు.
10. వారాహి మొదటి విడత విజయవంతంగా పూర్తి అయినందున పవన్ దంపతులు తమ ఇంట్లో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పవన్ - అనా దంపతుల ఫొటోను జనసేన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తద్వారా విడిపోతున్నారనే వార్తలు అసత్య ప్రచారంగా తేల్చి చెప్పారు.
11.మెటా సీఈవో, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్ లో అడుగుపెట్టారు. ఈ ఉదయం ట్విట్లర్ లోకి లాగిన్ అయ్యాడు.
12.హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ గాయకురాలు, పాటల రచయిత, నటి కోకో లీ ఆత్మహత్య చేసుకున్నారు. 48 సంవత్సరాల కోకోలి ఆత్మహత్యను లీ తోబుట్టువులు కరోల్, నాన్సీ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు.
13. దేశంలోని అష్ట దరిద్రాలకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఉమ్మడి పౌరస్మృతిని లా కమిషన్ తిరస్కరించిన తర్వాత కూడా పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావించడం సరికాదని అన్నారు.
14. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని తినేసిన ఎలుకలు వారు జైలు పాలు కాకుండా రక్షించాయి. గంజాయిని ఎలుకలు పూర్తిగా తినేశాయని, కాబట్టి కోర్టులో చూపించలేమని పోలీసులు పేర్కొనడంతో సాక్ష్యాలు లేని కారణంగా తమిళనాడుకు చెందిన ఇద్దరు గంజాయి నిందితులను కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది.
15.తెలంగాణకు చెందిన ఓ ఘరానా దొంగను కేరళ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తరచూ విమానాల్లో కేరళకు వచ్చి చోరీలు చేసి వెళుతుంటాడని చెప్పారు.
16. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఎయిరిండియా విమానం శుక్రవారం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ నుండి విశాఖపట్నం వస్తున్న ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
17. మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలో ఇటీవల గిరిజన కార్మికుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ప్రభుత్వ అదేశాలతో అధికారులు అతడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు.
18.ఉత్తర ప్రదేశ్ దుద్వాన్ నేషనల్ పార్క్ లో అడవి ఏనుగులతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులకు ఊహించని అనుభవం ఎదురైంది. తిక్కరేగిన ఏనుగులు వారి వెంట పడటంతో వారు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు.
19.దేశంలో పెట్రోలు ధరలు తగ్గించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సృజనాత్మక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. దేశంలో రవాణా అవసరాలకు సగటున 60 శాతం ఇథనాల్, 40 శాతం విద్యుత్ వినియోగిస్తే పెట్రోలు లీటరు ధర రూ.15కు చేరుకుంటుందని, అంతిమంగా ఇది సామాన్యులకు లాభిస్తుందని చెప్పారు.
20.గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి, మునుగోడు ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
21. కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
22.ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వరంగల్ లో రూ. 6,100 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
23.మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న మూత్ర విసర్జన బాధితుడు, గిరిజన కూలీ దాస్మేష్ రావత్ పాదాలు కడిగి సత్కరించారు. జరిగిన ఘటనకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు.
24. భారతీయ రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. టికెట్ ధర కాస్త ఎక్కువైనా వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించే వీలుండడంతో వందే భారత్ లో ప్రయాణించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
25.తెలుగు రాష్ట్రాలతో పాటు ఏడు రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసింది. ఈమేరకు బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలిజీయం ఓ తీర్మానాన్ని పాస్ చేసింది.