చిన్నమ్మకే చెల్లింది!
posted on Jul 6, 2023 8:07AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమితురాలైన దగ్గుబాటి పురందేశ్వరి ఆ పార్టీ గూటికి చేరి దశాబ్దం కాకున్నా.. ఆమె అధ్యక్ష పదవి చేపట్టడం పట్ల.. తెలుగు రాష్ట్రాల్లోని కమలం పార్టీలోని సీనియర్లు ఔరా.. అంటూ ముక్కన వేలేసుకొంటున్నారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ద్వయం చక్రం తిప్పినా? ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ వికసించేలా చేయడంలో ఈ చిన్నమ్మ సఫలీకృతులవుతారా? అనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.
2004 ఎన్నికలకు ముందు.. అంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా.. అదీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉండగా.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే టీడీపీ అధికారంలో ఉండగా.. దగ్గుబాటి పురందేశ్వరి ఇలా హస్తం పార్టీలో చేరి.. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి ఎంపీగా ఎన్నిక కావడమే కాదు.. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత అంటే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. విజయం సాధించి.. మళ్లీ మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.
అయితే 2009, సెప్టెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతి... ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. రాష్ట్ర విభజనకు ముహూర్తం సైతం ఖరారు చేశారు.
సోనియా నిర్ణయాన్ని ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. రాజకీయాలకు బై బై గుడ్ బై చేప్పేశారు. పురందేశ్వరి మాత్రం.. కాంగ్రెస పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఆ క్రమంలో ఆమె కడప జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయినా.. ఆమె బీజేపీ తరపున పలు సభలు, సమావేశాల్లో క్రియాశీలంగా పాల్గొంటూ వస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత తన వైద్య వృత్తిని వదిలి.. మామ వెంట నడిచారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్రియాశీలంగా వ్యవహరించారు. 1994లో మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం.. అనంతరం చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తెలుగుదేశంకు దూరం జరిగి.. సైలెంట్ అయిపోయారు. అలా తన భర్త సైలెంట్ కావడంతో.. అప్పటి వరకు దుగ్గుబాటి పురందేశ్వరి అనధికారికంగా పసుపు పార్టీలోనే ఉన్నట్లు లెక్క అనే వారు సైతం ఉన్నారు.
ఆ తర్వాత అంటే.. 2004లో పురందేశ్వరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ... కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ప్రజా ప్రతినిధిగా పలు పదవులు చేపట్టారు. అలా చిన్నమ్మ.. ఓ కుమార్తెగా, ఓ భార్యగా, ఓ తల్లిగా, ఉత్తమ పార్లమెంటరీయన్‌గా తాను చేపట్టిన పదవులకే వన్నె తెచ్చే విధంగా వ్యవహరించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆ పార్టీలో దశాబ్దాలుగా ఉంటున్న హేమాహేమీల పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. వారందరిని పక్కన పెట్టి దగ్గుబాటి పురందేశ్వరి వైపే కమలం పార్టీ అధిష్టానం మొగ్గుచూపిందంటే.. ఏ పార్టీలో ఉన్నా.. ఏ పదవి కట్టబెట్టినా.. ఏ పని అప్పగించినా.. అంకితభావంతో పని చేసే గుణం ఆమెలో ఉండటమే కారణమని పరిశీలకులు అంటున్నారు. అందుకే ఏ పార్టీలో ఉన్న ప్రత్యేక గుర్తింపు దక్కిచుకోవడం చిన్నమ్మకు చెల్లిందని చెబుతున్నారు.