పొంగులేటికి రియల్ బాస్ ఎవరంటే?
posted on Jul 7, 2023 @ 1:12PM
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా తయారయ్యాయి. అలాంటి ఊహించని వాటిలో ఒకటే ఈ మధ్యనే అట్టహాసంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖమ్మం సీనియర్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన పొంగులేటి సీఎంతో భేటీ అయ్యారు. నిన్న కాక మొన్న కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి.. కాంగ్రెస్ ను విభేదించి వేరు కుంపటి పెట్టుకున్న ఏపీ సీఎంతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవైపు జగన్ సోదరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని.. ఇప్పటికే చర్చలు సంప్రదింపు కూడా అయిపోయాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి జగన్ తో భేటీ కావడం సహజంగానే ఆసక్తి కలిగిస్తున్నది.
అసలు పొంగులేటి విషయానికి వస్తే తొలుత జగన్ వైసీపీ. వైసీపీ ఆంధ్రాకి పరిమితం అయ్యాక టీఆర్ఎస్. ఆ తరువాత కేసీఆర్ తో విభేదాల కారణంగా పార్టీ నుంచి బహిష్కృతుడైన అనంతరం సుదీర్ఘ కాలం పాటు బీజేపీయా, కాంగ్రెస్సా అన్న ఊగిసలాటలో ఉన్న పొంగులేటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే తొలి నుండి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న పొంగులేటి రాష్ట్ర విభజన అనంతరం కూడా వైసీపీ నుండే ఎంపీగా గెలిచి సత్తా చాటారు. అయితే, ఆ తర్వాత పరిస్థితులలో వైసీపీ ఆంధ్రాకి పరిమితం అయిపోవడంతో అప్పటికి జగన్ తో సఖ్యత, సత్సంబంధాలు ఉన్న కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్) లో చేరిపోయారు. అక్కడ ఇమడలేక ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వైఎస్ కుటుంబంతో సంబంధాలతోనే ఈ మధ్య పొంగులేటి షర్మిల, విజయమ్మలతో కూడా చర్చించారు. ఇప్పుడు అదే వరసలో సీఎం జగన్ తో కూడా భేటీ అయ్యారు.
అయితే, జగన్ తో పొంగులేటి భేటీ కావడంతో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు కూడా పొంగులేటి జగన్ ను కలిశారు. కానీ తాజా భేటీ మాత్రం రాజకీయాలలో పెను చర్చకు దారితీసింది. వీరిద్దరి చర్చల్లో కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు సిద్ధమైన జగన్ సోదరి షర్మిల టాపిక్కే కీలకమని తెలుస్తోంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. కేవీపీ లాంటి ఆ కుటుంబంతో దగ్గరగా ఉండే నేతలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ క్రమంలోనే సోదరి షర్మిల విషయంపైనే జగన్ ను పొంగులేటి కలిసినట్లుగా ఓ వర్గంలో రాజకీయ చర్చలు సాగుతున్నాయి.
కాగా, షర్మిల ఇప్పటికిప్పుడు తెలంగాణను వదిలి ఏపీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం ఉంది. షర్మిల కూడా సోషల్ మీడియా లో ఇదే విషయాన్ని పంచుకున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిలను ఏపీకి పంపితేనే ప్రయోజనం ఉంటుందని అధిష్టానానికి చెబుతున్నారు. ఇటు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల రాకతో తమకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుందనే లెక్కల్లో ఉన్నారు.
ఈ క్రమంలోనే షర్మిల తరపునే పొంగులేటి జగన్ వద్దకు వెళ్లారనే చర్చ కూడా జరుగుతుంది. మరోవైపు పొంగులేటికి అసలు బాస్ జగన్ మోహన్ రెడ్డేనని.. ప్రస్తుతం తెలంగాణలో వైసీపీ లేనందున పొంగులేటి కాంగ్రెస్ లో చేరారని, వ్యాపార లావాదేవీలతో పాటు రాజకీయంగా కూడా పొంగులేటిని నడిపించేది జగన్ మోహన్ రెడ్డేనని మరోవైపు చర్చలు సాగుతున్నాయి. ఇందులో ఏది నిజం అనేది ఎలా ఉన్నా.. ఈ భేటీ మాత్రం కాస్త తెలుగు రాజకీయాలలో కొత్త చర్చకు దారితీసింది.