మినీ జమిలి.. లోక్ సభతో పాటే 12 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు!
posted on Jul 10, 2023 @ 12:09PM
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీ పరస్పెక్టివ్ ను పూర్తిగా మార్చేసిందా? అంతకు ముందు వరకూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విజయంపై ఉన్న ధీమా ఒకింత తగ్గినట్టుగా కనిపిస్తోంది. అందుకే గత తొమ్మిదేళ్లుగా ఎన్నడూ లేని విధంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులకు స్థాన భ్రంశం కల్పించింది. త్వరలో మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకర చేయనున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికలలో విజయంపై ధీమా సన్నగిల్లడం వల్లనేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అంతే కాకుండా బీజేపీయేతర పార్టీల ఐక్యతా యత్నాలు కొలిక్కి వచ్చేలోగానే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంతో మోడీ సర్కార్ ముందుకు సాగుతోందని అంటున్నారు. అందుకే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలతో పాటే సార్వత్రిక ఎన్నికలకు కూడా నగారా మోగిస్తే ఎన్నికలలో లబ్ధి పొందే అవకాశాలు ఒకింత మెరుగ్గా ఉంటాయని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకే కాకుండా వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో మాటు జరిగే రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ముందస్తుగానే ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న యోచన చేస్తున్నదంటున్నారు.
ఏపీ వంటి రాష్ట్రాలు ముందస్తుకు రెఢీగా ఉన్నాయనీ, అలా రెడీగా లేని రాష్ట్రాలను కూడా ఒప్పించి ఏదో విధంగా ఈ ఏడాది చివరికే పలు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు కూడా జరిపించేస్తే.. విపక్షాలు ఐక్యతాయత్నాలు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం, ఎన్నికలకు అవి ఇంకా పూర్తిగా సంసిద్ధంగా లేకపోవడంతో అధికారంలో ఉన్న బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయన్నది మోడీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా దేశంలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే నరేంద్రమోడీ మినీ జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతున్నారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని అంటున్నారు. గతంలో నరేంద్రమోడీ జమిలి ఎన్నికల నిర్వహణ పై ఆసక్తి కనబరిచినా, అయితే అది అనుకున్నంత ఈజీ కాదని తేలిపోవడంతో అప్పటికి మిన్న కున్నారనీ,ఇప్పుడు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మినీ జనరల్ ఎలక్షన్ కు వెళితే.. అంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. గడువు ముగియడానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలనూ కలుపుకుని సార్వత్రిక ఎన్నికలకు వెడితే రాజకీయంగా తమ విజయానికి తిరుగుండదన్న భావన మోడీలో బంలంగా ఉందని చెబుతున్నారు.
డిసెంబర్ నెల లో ఐదురాష్ట్రాల ఎన్నికలు జరగాల్సుంది. అలాగే వచ్చే ఏడాది మే-జూన్ నెల లో మరో ఆరు రాష్ట్రాల కు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే జమ్మూ-కాశ్మీర్ ఎన్నికలు పెండింగు జరగాల్సి ఉంది. మొత్తం 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో జరగాల్సి ఉంది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలోనే జరగాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈ డిసెంబర్లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ను ఓ మూడునెలలు వాయిదా వేయడమో లేదా వచ్చే ఏడాది మే, జూన్ లలో జరగాల్సిన ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరపడమో చేస్తే శ్రమ, వ్యయం, సమయం అన్నీ కలిసి వస్తాయన్నది మోడీ ఆలోచనగా చెబుతున్నారు.
అయితే ఈ ఏడాది చివరిలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటే.. రాష్ట్రపతి ఆర్డినెన్స్ కావాలి. అలా కాకుండా వచ్చే ఏడాది మే, జూన్ లో జరగాల్సిన ఎన్నికలను ముందుకు జరపడం అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. దీంతో మోడీ రెండో ఆప్షన్ కే మొగ్గు చూపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.