కాంగ్రెస్ షర్మిల నామస్మరణ.. ఎందుకంటే?!
posted on Jul 10, 2023 @ 1:10PM
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫుల్ జోష్ మీదున్న సంగతి తెలిసిందే. బలమైన నేతలను అంతే బలంగా తమ వైపుకు లాగేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని భావిస్తున్నది. అందుకోసం ఎన్నో రకాల ప్రణాళికలు రచించుకుంటుంది. ఈ క్రమంలో చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ నేతగానే మరణించిన వైఎస్ రాజశేఖరరెడ్డి లెగసీని ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. వైఎస్ వారసులుగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల రాజకీయాలలో ఉండగా.. జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు దూరమై పూర్తిగా ఏపీ రాజకీయాలలోనే ఉన్నారు. ఇక షర్మిల అన్నతో విభేదించి తెలంగాణకు వచ్చేసి తండ్రి పేరిటనే కొత్త పార్టీ పెట్టారు. అయితే, వైఎస్ఆర్టీపీ ఆశించిన స్థాయిలో ప్రజాదరణకు నోచుకోవడం లేదు. దీంతో కాంగ్రెస్ షర్మిలను తనలో కలుపుకొని వైఎస్ఆర్ బ్రాండ్ దక్కించుకోవాలని చూస్తుంది.
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ఇప్పటికే షర్మిలతో సంప్రదింపులు జరపగా.. షర్మిల పార్టీ విలీనానికి సిద్దమైనట్లు రాజకీయ వర్గాలలో బలమైన సమాచారం ఉంది. మరోవైపు తాజాగా కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెల్లి షర్మిల కోసమే అన్న జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. తాజాగా వైఎస్ జయంతి రోజున రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ కు సైతం షర్మిల రీట్వీట్ చేసి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చారు. మీ హృదయంలో వైఎస్ఆర్ కు ఇంకా స్థానం ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ షర్మిల రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన రీట్వీట్ జరుగుతున్న రాజకీయ ప్రచారాలకు మరింత క్లారిటీ ఇచ్చింది. ఇక షర్మిల పార్టీ విలీనం తర్వాత ఏపీకి వెళ్తారా తెలంగాణలో ఉంటారా అన్నదానిపై కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే షర్మిల ఏపీ సీఎం జగన్ కు గట్టి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకోవడం ఖాయమంటున్నారు.
కాగా అసలు కాంగ్రెస్ పార్టీ షర్మిల కోసం ఇంత ఆరాటానికి కారణం ఏంటన్నది చూస్తే వైఎస్ఆర్ లెగసీ కోసమే అని చెప్పుకోవాలి. వైఎస్సార్ సర్కార్ పైఅవినీతి ఆరోపణలు, కక్ష్యపూరిత రాజకీయాలు ఎలా ఉన్నా ఆయన సంక్షేమ పథకాలతో ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేరు. తెలంగాణలో సైతం ఇప్పటికీ వైఎస్ఆర్ అభిమానులు, అనుచరులుగా ఎందరో నేతలు ఉన్నారు. ఇప్పుడు వారందరినీ మళ్ళీ కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు వైఎస్ బిడ్డగా షర్మిలను పార్టీలో చేర్చుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్. ఇప్పటికే ఎన్టీఆర్ లెగసీ కోసం బీజేపీ పురందేశ్వరిని ఏపీకి అధక్షురాలిని చేయగా.. కాంగ్రెస్ షర్మిల ద్వారా మళ్ళీ వైఎస్ఆర్ ను ప్రజలకు గుర్తు చేయాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. అదే జరిగితే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ కు ప్రయోజనం చేకూరుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు షర్మిలకు సైతం కాంగ్రెస్ లో ఇమిడిపోయేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నన్ని రోజులూ కాంగ్రెస్ తోనే ఆయన ప్రయాణం సాగింది. పైగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నదే తన అభిమతమని ఆయన అప్పట్లో ఎప్పుడూ చెప్పేవారు. సోనియాను ప్రధానిగా చూడాలని ఉన్నా ఆ అవకాశం రాలేదని.. కానీ రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఉందని వైఎస్ఆర్ చెప్పేవారు. ఇప్పుడు ఆయన కలను సాకారం చేసేందుకు.. ఆయన ప్రజా సంక్షేమ పాలనను ముందుకు తీసుకెళ్లేందుకు తాను కాంగ్రెస్ పార్టీలో మరో ప్రయాణం మొదలు పెట్టినట్లు చెప్పుకొనేందుకు షర్మిలకు అవకాశం ఉంది. మరి షర్మిల కాంగ్రెస్ చేరిక ఎప్పుడో ఇక వేచి చూడాలి.