సమృద్ధిగా వర్షాలు.. భవిష్యవాణి
posted on Jul 10, 2023 @ 11:28AM
ఎల్ నినో.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దాదాపుగా ముఖం చాటేసిన పరిస్థితి. జూలై రెండో వారంలోకి అడుగుపెట్టినా ఇప్పటి వరకూ మంచి వర్షాలు కురిసిన జాడ లేదు. ఈ తరుణంలో భవిష్యవాణి తెలంగాణ వాసులకు శుభవార్త తెలిపింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా ఉంటాయని చెప్పింది.
ఏపీలో ఫరవాలేదనిపించినా తెలంగాణలో వర్షాలు ఇప్పటికీ మబ్బుల చాటునే దాగున్నాయి. అయితే ఆషాఢం బోనాల సందర్భంగా జోగిని స్వర్ణ లత మాత్రం ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భవిష్యవాణి చెప్పింది.
లోపాలు లేకుండా తనకు పూజలు నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన భవిష్యవాణి.. గత ఏడాది ఇచ్చిన వాగ్దానం మరిచిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలలో భాగంగా స్వర్ణలత సోమవారం (జూలై 10) పచ్చిమట్టికుండపై నిలుచుని వినిపించిన భవిష్యవాణిలో ఆలస్యమైనా వర్షాలు సమృద్ధిగా కురిస్తాయన్ని చెప్పారు. ఎల్లవేళలా వెన్నంటి భక్తులను కాపాడుకుంటాననీ చెప్పిన భవిష్యవాణి, అగ్నిప్రమాదాల గురించి భయం వద్దన్నారు. స్వర్ణలత భవిష్యవాణి వినేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.