జగన్ నిర్వాకం..ఏపీలో విద్యావ్యవస్థకు గ్రహణం!
posted on Jul 11, 2023 7:59AM
మనదేశంలో విద్యావ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా వ్యవస్థలదే పైచేయి. అనాది నుండి మహాముహులు చదివిన స్కూళ్ళు, కాలేజీలు ఇప్పుడు వెనకబడిపోయాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ఇప్పుడు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. ఒక పద్ధతి ప్రకారం చొచ్చుకొచ్చిన కార్పొరేట్ విద్యాసంస్థలు పిల్లల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తూ కొత్త సంస్కరణలు రాసుకొచ్చాయి. ప్రభుత్వాల హెచ్చరికలను వారు ఖాతరు చేయరు.. ప్రభుత్వ సంస్కరణలనూ వాళ్ళు లెక్కచేయరు. దీంతో ఇప్పుడు పేదవాడికి విద్య దూరమవుతుంది. కొనగలిగిన వారికే సరస్వతీ చేరువవుతుంది. అందుకే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలను పునరిద్ధరుస్తున్నారు. సరికొత్త చట్టాలను తీసుకొచ్చి మరీ విద్యావ్యవస్థను బలీయం చేస్తున్నాయి.
తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పుడు కార్పొరేట్ విద్యకు చెక్ పెట్టేలా కొత్త విధానాలను అవలంభిస్తూ మళ్ళీ ప్రభుత్వ విద్యాసంస్థలకు పూర్వ కళ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ముందు చూపు లేని విధానాలు, మొండిపట్టు జీవోలు ఇప్పుడు పేద పిల్లల పాలిట శాపంగా మారాయి. ఎలాంటి ప్రణాళికలు లేకుండా మూర్ఖత్వపు నిర్ణయాలు ప్రభుత్వ విద్యావ్యవస్థ నాశనానికి బాటలు వేశాయి. నాలుగేళ్ళలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు పేరిట చేసిన మార్పులు, భారీగా టీచర్ల కొరత ఉన్నా నియామకాలు చేపట్టకపోవడం, ఉన్న టీచర్లు, లెక్చరర్లకు జీతాల కొరత, పాఠశాలల విలీనం, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ కు పేరుకుపోయిన బకాయిలు, ప్రభుత్వ కళాశాలలకు కేటాయించని నిధులు.. ఇలా చెప్పుకుంటూపోతే నాలుగేళ్ళ పాలనలో విద్యావ్యవస్థ నాశనానికి అనేక కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి.
గత నాలుగేళ్ళ వైసీపీ పాలనలో కొత్తగా ఉపాధ్యాయ, లెక్చరర్ల నియామకాలు లేవు. ఉన్నవారిని కుదించి సర్దుబాటు చేస్తున్నారు. ఉన్న వారికి న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు అందడం లేదు. వచ్చే ఆ జీతాలు కూడా సమాయానికి అందడం లేదు. దీంతో వారు రోడ్డెక్కాల్సిన దుస్థితి. దీనికి తోడు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా తీసుకొచ్చిన 172, 117 రెండు జీవోలు ఏపీ విద్యావ్యవస్థను సర్వనాశనం చేశాయి. పాఠశాలల విలీనం పేరుతో అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసిన జగన్ సర్కార్.. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలించేశారు. దశాబ్దాలుగా గ్రామంలో పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన బడులను సైతం మూసేసి.. కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. అది కూడా మాతృభాష ఊసు లేకుండా ఒక్క ఇంగ్లీష్ మీడియంను ఉంచారు.
ఇంగ్లీష్ మీడియం తెచ్చినా.. అందుకు తగిన ప్రొఫెషనల్ టీచర్లు లేకపోవడంతో అది అక్కరకురాని మీడియం మారిపోయింది. ఇక కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు లేకపోగా టీచర్, స్టూడెంట్స్ నిష్పత్తిని తెరపైకి తెచ్చారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడ్ని నియమించారు. అదే ప్రాథమికోన్నత పాఠశాలకు అయితే ప్రతీ 53 మంది విద్యార్థులకు, ఉన్నత పాఠశాలలో ప్రతీ 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు మార్చారు. మరి అంత మంది విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు విద్యాబోధన ఎలా చేయగలరో.. వారిపై ఎంతవరకు టీచర్లు దృష్టి పెట్టగలరో అనే మేధావుల ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.
ఇక వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అట్టర్ ప్లాప్ కార్యక్రమాలలో నాడు నేడు కూడా ఒకటి. లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం.. ఫోటో ఫోజులకు తప్ప ఈ కార్యక్రమం ఎందుకు పనికిరాకుండా పోయింది. రూ.వేల కోట్లు ఖర్చు చేసి పాఠశాలల్లో బెంచీలు, కుర్చీలు వేశారు. మరికొన్ని పాఠశాలల్లో నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కొన్ని స్కూల్స్ లో పైపై మెరుగులు దిద్ది, రంగులేసి భారీగా నిధులను కొల్లగొట్టారు. అయితే, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రంగులు వేసుకొని ఆనందం పొందడమే తప్ప పాఠశాలలకు విద్యార్థులను రప్పించే ఏర్పాట్లు చేయలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం ఇకపై విద్యారులు ఇక్కడే చేరండని ఏపీ ప్రభుత్వం నమ్మకం కలిగించలేకపోవడంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది.