వరద నీటిలో కొట్టుకుపోయిన వంతెన
posted on Jul 10, 2023 @ 12:56PM
తెలుగు రాష్ట్రాలు వర్షాభావంతో అతలాకుతలమౌతుంటే.. ఉత్తరాది వర్ష బీభత్సంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు బ్రిడ్జిలు ధ్వంసం అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో వరదలకు ఓ వంతెన అమాంతం కొట్టుకుపోయింది.
అలా వంతెన కొట్టుకుపోతున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. బియాస్ నదీ తీరం కోతకు గురై, నది ఒడ్డున నిర్మించిన పలు ఇళ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మనాలిలో మెరుపు వరదల కారణంగా పలు దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి.
కులూ, కిన్నౌర్, ఛంబ ప్రాంతాలలో పొలాలు నీట మునిగాయి. కులూలో వరదలకు జాతీయ రహదారి కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారితో పాటు హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 765 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.