రుషికొండ బీచ్ కు ఎంట్రీ ఫీ.. వైసీపీ యూటర్న్!
posted on Jul 10, 2023 @ 10:58AM
అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నది సామెత. జగన్ సర్కార్ కు చాలా విషయాలలో ఈ సామెత అస్సలు వర్తించది. ఇక తప్పదనుకున్నప్పుడో, మరో గత్యంతరం లేని సందర్బంలో మాత్రమే తాను చేసిన తప్పును దిద్దుకుంటున్నట్లుగా కలర్ ఇస్తుంది. జగన్ సర్కార్. జగన్ సర్కార్ అంటే అదేదో కేబినెట్ సమష్టిగా చేసే పాలన అనుకుంటే ఎవరైనా సరే తప్పులో కాలేసినట్లే అవుతుంది.
జగన్ సర్కార్ లో మంత్రులంతా తమ అధినేత, ముఖ్యమంత్రి ఏం అనుకుంటే అదే చేస్తారు. ఆయన మనసు గ్రహించి మసులు కుంటారు. ఇక ప్రభుత్వాధికారుల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా.. జగన్ చెప్పిందే వారికి వేదం. అందుకే రుషి కొండకు గుండు కొట్టేసినా, హోటల్ పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించమన్నా.. నిబంధనలు అంగీకరించవనీ, పర్యావరణ సమస్యలు వస్తాయనీ అన్న విషయాన్ని కనీసం జగన్ దృష్టికి తీసుకువెళ్లే ధైర్యమైనా చేయరు.
రుషికొండ పనైపోయింది. ఇప్పుడిక ఆ రుషికొండ బీచ్ ను కూడా పూర్తిగా ఒక ప్రైవేటు బీచ్ గా మార్చేసుకుంటున్నారు. బీచ్ లోకి ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. మంగళవారం నుంచి ఆ ఫీజులు వసూలు చేయాలని కూడా నిర్ణయించేశారు. విశాఖలో ఇప్పటివరకు ఇలా ఎక్కడా బీచ్‌లలో ప్రవేశానికి టిక్కెట్లు పెట్టిన దాఖలాలు లేవు. ఆ పుణ్యం కట్టుకోవాలని జగన్ సర్కార్ గట్టిగా నిర్ణయించేసుకుంది. రుషికొండను కేంద్ర ప్రభుత్వం ‘బ్లూ ఫ్లాగ్ బీచ్’గా గుర్తించడంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. వాటికి ఖర్చులు అవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి కేంద్రమే భ్లూ ఫాగ్ బీచ్‌లకు నిధులు ఇస్తోంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం రుషికొండ బీచ్ కు ఎంట్రీ ఫీజు నిర్ణయించి దోపిడీకి తెరలేపిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా రుషికొండ పై కట్టిన నివాసం నుంచి బీచ్ లోకి వెళ్లి సేదదీరేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేుకుంటున్నారని గతంలో అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం తారస్థాయికి చేరిందన్న సంగతిని గ్రహించిన ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలకు తెరలేపింది. తూచ్ రిషికొండ బీచ్ లోకి ఎంట్రీ ఫీజ్ అంతా ఉత్తిదేనని మంత్రి అమర్నాథ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పారు.
నిజానికి మంగళవారం (జూలై 11) నుంచి రుషికొండ బీచ్ లోకి ఎంట్రీ ఫీజు అమలు చేయడానికి సర్వ సిద్ధమైపోయింది. ఎవరికీ తెలియకుండా అమలు చేసేద్దామని భావించారు. కానీ అసలు విషయం ముందుగానే వెల్లడి అయిపోయిన నేపథ్యంలో మంత్రి అమర్నాథ్ స్పందించి బీచ్ లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని, బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.