దటీజ్ సీఐ స్వర్ణలత!
posted on Jul 10, 2023 @ 10:13AM
కనిపించే మూడు సింహాలు.. నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే.. కనిపించని నాలుగో సింహం పోలీస్. మరి కనిపించని ఆ నాలుగో సింహం పోలీసుల్లో కూడా కనిపించని అసలు సిసలు కోణాలు సైతం.. విశాఖ మహిళ ఆర్మీ రిజర్వుడ్ సీఐ స్వర్ణలత విషయంలో తాజా తాజాగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పలువురికి ఆదర్శంగా ఉంటూ.. బాధ్యత గల పోలీస్ శాఖలో ఉన్న సీఐ స్వర్ణలత.. 2 వేల రూపాయల నోట్ల మార్పిడి వ్యవహారంలో.. వ్యక్తులను బెదిరించి.. లక్షల్లో డబ్బులు గుంజిన కేసులో ఇలా అడ్డంగా దొరికిపోవడం.. ఆమెపై ఐపీసీ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు కావడం.. రాష్ట్రంలోనే కాదు.. పోలీస్ శాఖలో సైతం స్వర్ణలత వ్యవహారం సంచలనంగా మారింది.
అయితే ఈ కేసు నుంచి బయట పడేందుకు ఆమె.. అధికార జగన్ పార్టీకి చెందిన కీలక ప్రజా ప్రతినిధిని ఆశ్రయించి.. వారి ద్వారా ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకు వచ్చినా.. అప్పటికే జరగాల్సిన తతంగం అంతా జరిగిపోయిందని.. ఈ నేపథ్యంలో సదరు కీలక ప్రజాప్రతినిధి సైతం.. హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తిసినట్లు ఓ ప్రచారం వాడి వేడిగా ఉక్కు నగరంలో సాగుతోంది.
మరోవైపు స్వర్ణలత ఇలా అడ్డంగా బుక్ అయిపోవడంతో.. ఆమె గారి ముచ్చట్లు, మక్కువలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సీఐ స్వర్ణలతకి ఖాకీవనంలో విధులు నిర్వహించడం కంటే.. టాలీవుడ్‌లో నటించడంలోనే కిక్కు ఎక్కువని భావించి.. ఆ క్రమంలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో అదే జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు టాలీవుడ్‌తో మంచి సంబంధాలున్నాయని తెలుసుకొని.. సదరు ప్రజాప్రతినిధులతో పరిచయాలు పెంచుకున్నారు.. వారిని కలిసి తన మనస్సులోని మాట చెప్పగా.. త్వరలో తీయబోయే చిత్రంలో చాన్స్ ఇస్తానని.. కానీ ఆ పాత్రకు న్యాటం మాత్రం కంపల్సరీగా వచ్చి ఉండాలని కండిషన్ పెట్టడంతో.. సీఐ స్వర్ణలత ఓ కోరియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకొని మరీ డెడికేషన్‌తో స్పెషల్ కోచింగ్ సైతం తీసుకొని మరీ నృత్యం నేర్చుకున్నారు. అందులోభాగంగా కొన్ని సినిమా పాటలకు సీఐ స్వర్ణలత చేసిన డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వటిలో జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అబ్బనీ తీయ్యనీ దెబ్బ.. పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను చిరు ప్రయత్నం అంటూ సీఐ స్వర్ణలత సోషల్ మీడియాలోకి వదలడంతో... ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తున్నది. అంతేకాకుండా ఆమె నృత్య రీతులకు నెటిజనులు ఫిదా అయిపోయారనే చర్చ సైతం వాల్తేరులో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సీఐ స్వర్ణలత ఏపీ 31 అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నది. సదరు సినిమా నిర్మాణ వ్యవహారాల పర్యవేక్షణలో కూడా స్వర్ణలత భాగస్వామిగా ఉన్నారు. ఆ సినిమా కోసమే నోట్ల మార్పిడి వ్యవహారంలో పోలీస్ మార్క్ వ్యవహారం ఆమె నడిపించారనే ఓ ప్రచారం సైతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అదీకాక ఆమె ఎప్పుడు ఎక్కడ.. విధులు నిర్వహించినా అక్కడ తనదైన శైలిలో స్వర్ణలత మార్క్ చూపించేవారనే ఓ చర్చ సైతం కొనసాగుతోంది. మరోవైపు సీఐ స్వర్ణలత నటిస్తున్న ఏపీ 31 పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏదీ ఏమైనా పాపం పండాలన్నా.. మనలోని టాలెంట్ బయటకు రావాలన్నా.. దానికి ఓ టైమ్ రావాలి. అలా అయితేనే.. మనమేమిటో.. మన సత్తా ఏమిటో.. మన ప్రతిభా పాటవాలు ఏమిటో పది మందికి తెలుస్తాయి. అయినా పోలీస్ శాఖలో సీఐగా విధులు నిర్వహించినా.. నృత్య రీతులు నేర్చుకొని డ్యాన్సులు చేసినా.. రాని పేరు ప్రఖ్యాతలు.. ఒక్కసారిగా ఇలా నోట్లు మార్పిడి వ్యవహారంలో ఖాకీ పవర్‌తోపాటు లాఠీ పవర్ చూపించి మరీ పోలీస్ మార్క్ దందాలు చేస్తే.. పేరు ప్రఖ్యాతలు ఇలా తన్నుకు వస్తాయని సీఐ స్వర్ణలత ఊహించి ఉండరని అంటున్నారు. ఈ అలోచన ఉంటే 2016లో నోట్ల రద్దు అప్పుడే ఈ వ్యవహారం నడిపి ఉండేవారనే చర్చ సైతం రేపో మాపో కార్యనిర్వహాక రాజధానిగా కాబోతున్న విశాఖ నగరంలో వీర విహారం చేస్తోంది.