రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ! తొలిసారి రూ. 1.20 లక్షల కోట్ల మార్క్
కరోనాతో కుదైలేన దేశ ఆర్థిక రంగం మళ్లీ గాడిలో పడుతోంది. జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. లాక్ డౌన్ తరువాత జనవరిలో వస్తువు సేవల పన్ను జీఎస్టీ (గూడ్స్ సర్వీస్ టాక్స్) వసూల్ రికార్డ్ స్థాయిలో పెరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం గత డిసెంబర్ లో వసూలైన 1.15 లక్షల కోట్ల రికార్డును అధిగమించి, జనవరిలో 1.19 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూల్ దాటింది. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత తొలిసారిగా పన్ను వసూలు దాదాపు 1.20 లక్షల కోట్ల మార్క్ ను తాకిందని ఆర్థిక శాఖ ప్రకటించింది.
జనవరి 31, సాయంత్రం 6 గంటల వరకూ స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,19,847 కోట్లు కాగా. ఇందులో సీజీఎస్టీ రూ. 21,923 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 29,014 కోట్లు. ఇదే సమయంలో ఐజీఎస్టీ రూ. 60,288 కోట్లుగా ఉందని, ఇతర పన్నుల రూపంలో రూ. 8,622 కోట్లు వసూలైందని కేంద్రం వెల్లడించింది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ శ్రీహరి కోట రాకెట్ లా దూసుకుపోతుందని , అందుకు పెరిగిన పన్ను వసూళ్లే నిదర్శనమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కరోనా లాక్ డౌన్ సడలింపు తరువాత అక్టోబర్ లో లక్ష కోట్లను తాకిన జీఎస్టీ వసూళ్లు, నవంబర్, డిసెంబర్ లతో పాటు జనవరిలోనూ అదే ఊపును కొనసాగించింది . దీంతో వరుసగా నాలుగు నెలల పాటు లక్ష కోట్లకు పైగా పన్ను వసూళ్లు జరిగినట్లయింది.