భార్య భర్తను చంపినా.. ఆమెకు ఫించన్ ఇచ్చి తీరాల్సిందే.. హైకోర్టు సంచలన తీర్పు
posted on Feb 1, 2021 @ 9:56AM
సాక్షాత్తు కట్టుకున్న భర్తను హత్య చేసినా.. లేక భర్త మరణానంతరం ఆమె రెండో వివాహం చేసుకున్నా.. ఆ భార్య ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే అవుతుంది అని పంజాబ్, హరియాణా హైకోర్టు ఒక సంచలన తీర్పు చెప్పింది. హర్యానాలోని అంబాలా తర్సెమ్ సింగ్, బల్జీత్ కౌర్ దంపతులు సొంత ఊరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తర్సెమ్ సింగ్ 2008లో మృతిచెందారు. అయితే ఆయనను భార్య బల్జీత్ కౌర్ చంపారంటూ 2009లో ఆమెపై కేసు నమోదైంది. అంతేకాకుండా 2011లో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. మరోపక్క భర్త మృతిచెందినప్పటి నుండి 2011 వరకు బల్జీత్ కౌర్ ఫ్యామిలీ పెన్షన్‌ను పొందారు. అయితే భర్తను హత్యచేసిందని కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం వెంటనే ఆమెకు ఇస్తున్న పెన్షన్‌ను నిలిపివేసింది.
దీంతో ఈ వ్యవహారంపై ఆమె పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జనవరి 25న విచారించిన ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. "భర్తను హత్యచేసిందనే కారణంతో ఫ్యామిలీ పెన్షన్‌కు భార్యను దూరం చేయరాదు. ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమే ఫ్యామిలీ పెన్షన్. అందువల్ల భార్య క్రిమినల్ కేసులో దోషిగా తేలినా సరే ఫ్యామిలీ పెన్షన్‌కు ఆమె అర్హురాలే అవుతుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా బల్జీత్ కౌర్ కు ఫ్యామిలీ పెన్షన్‌ను నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును కోర్టు కొట్టివేసింది. ఆమెకు 2011 నుండి రావాల్సిన బకాయిలను రెండు నెలల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భర్త మరణానంతరం ఫ్యామిలీ ఫించన్ కు భార్యే హక్కుదారంటూ 1972 నాటి ఫించన్ చట్టం ప్రకారం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.