చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డను ఆవహించాడు
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులపిచ్చితో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని, ఎస్ఈసీ పదవికి ఆయన అనర్హుడని అన్నారు. ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని, చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ, కుల రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. గతంలో కరోనా వ్యాప్తిని కారణంగా చూపి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిలిపివేశారని అన్నారు. ఇప్పుడు కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, మరి నిమ్మగడ్డ ఎందుకంత తొందరపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి చంద్రబాబుతో లాలూచీ పడి ఇలాంటి పనులకు పాల్పడడం దురదృష్టకరమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుకు అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని విజయసాయి ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులుండవని గుర్తుచేసిన ఆయన.. మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రతి ఒక్క అధికారిపైనా, ప్రభుత్వంపైనా చర్యలు తీసుకునేందుకు తహతహలాడే నిమ్మగడ్డ.. చంద్రబాబును ఎందుకు ఉపేక్షిస్తున్నారని అన్నారు. శరీరం మాత్రమే నిమ్మగడ్డదని, చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డను ఆవహించాడని విమర్శించారు. నిమ్మగడ్డ మానసికంగా గాడి తప్పిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఎస్ఈసీ పదవిలో కూర్చోబెట్టడం ఏంటని అన్నారు. నిమ్మగడ్డ మానసిక ఆరోగ్యంపై మెడికల్ బోర్డుకు సిఫారసు చేయాలని విజయసాయి ఎద్దేవా చేశారు.
మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడానిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'తక్షణమే జగన్ ని ముఖ్యమంత్రిగా తొలగించి, ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్ కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి. పిచ్చిముదిరింది' అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ అధికారపార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఈసీ పై విమర్శలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని కూడా అంటున్నారు.