హై సెక్యూరిటీ జోన్ లోనూ రక్షణ లేదు! ఏపీలో గుండాల రాజ్యమన్న చంద్రబాబు
posted on Feb 2, 2021 @ 11:22AM
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఏకగ్రీవ ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరి తెగించిందనే ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడలో మంత్రులు, జడ్జీలు నివాసం ఉండే అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరగడం దుమారం రేపుతోంది. వైసీపీ తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.
పట్టాభిపై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. 15మంది చుట్టుముట్టి ఇనుపరాడ్లతో, బండరాళ్లతో కారు ధ్వంసం చేసి పట్టాభిని గాయపర్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పట్టపగలు పట్టాభిపై దాడి చేయడం వైసీపీ గుండాల రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు చంద్రబాబు. సీఎం జగన్‌రెడ్డి అండతోనే వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి పట్టాభిపై దాడి ఘటనే సాక్ష్యమన్నారు. గతంలో పట్టాభి కారు ధ్వంసం చేసినవాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. పోలీసుల ఉదాసీనతతో వైసీపీ గుండాల దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయని బాబు ధ్వజమెత్తారు. పట్టాభిపై దాడిచేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, పట్టాభికి పూర్తి భద్రత కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.