పోలియో చుక్కలకు బదులుగా శానిటైజర్! సిబ్బంది నిర్వాకంతో చిన్నారులకు గండం
posted on Feb 2, 2021 @ 9:45AM
"నిండు జీవితానికి రెండు చుక్కలు" అనే నినాదంతో మనదేశం నుండి పోలియోను తరిమి వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఆదివారం నాడు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం ముక్కు పచ్చలారని చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. పోలియో చుక్కలను పసిపిల్లలకు ఇవ్వాల్సిన సిబ్బంది దానికి బదులుగా హ్యాండ్ శానిటైజర్ వేయడంతో 12 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా కప్పికోప్రి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కొద్దిసేపటికి తమ పొరపాటు గ్రహించిన ఆ సిబ్బంది ఆ పిల్లలను మళ్లీ వెనక్కు రప్పించి.. పోలియో చుక్కలు వేశారు. అయితే అప్పటికే శానిటైజర్ డ్రాప్స్ వేయడంతో.. ఆ చిన్నారులకు వాంతులు అయ్యాయి. తీవ్ర అసౌకర్యానికి గురికావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యవత్మాల్ జిల్లా పరిషత్ సీఈవో శ్రీకృష్ణ పంచాల్ తెలిపారు.
పోలియో డ్రాప్స్ వేసిన సమయంలో పీహెచ్‌సీ వద్ద ఒక వైద్యుడు, అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా వలంటీర్ ఉన్నారని అయన తెలిపారు. ఈ ఘటనపై తాము విచారణ చేపట్టినట్టు అయన చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పల్స్ పోలియో సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు.