వీఐపీ జోన్ లోనే పట్టాభిపై దాడి! మంత్రి కొడాలి హస్తం ఉందన్న టీడీపీ
posted on Feb 2, 2021 @ 10:48AM
ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో బీహార్ ను తలదన్నేలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. అటు నిమ్మాడలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు జరగగా.. ఇటు విజయవాడలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరిగింది. ఆయన ఇంటి దగ్గరే దుండగులు దాడి చేశారు. కారును చుట్టుముట్టి రాడ్‌తో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సెల్‌ఫోన్ కూడా ధ్వసమైంది. మంత్రులు, హైకోర్టులు జడ్జ్‌లు, ప్రముఖులు ఉండే ప్రాంతంలోనే పట్టాభి ఉంటారు. వీఐపీ జోన్ లోనే మారుణాయుధాలతో దాడి చేశారంటే... ఏపీలో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో ఊహించవచ్చు.
ఉదయం కార్యాలయానికి వెళుతున్న సమయంలో దాదాపు 10 మంది కాపుగాసి, ఒక్కసారిగా కారును చుట్టుముట్టి రాడ్లు, కర్రలు, బండరాళ్లతో తనపై దాడి చేశారని పట్టాభి తెలిపారు. డ్రైవర్‌పై కూడా దాడి చేసినట్లు చెప్పారు. గతంలో కూడా తన వాహనాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని పట్టాభి గుర్తుచేశారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదని, వాస్తవాలను బయటపెట్టేందుకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్నందుకే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. గత పదిరోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయన్నాయి పట్టాభి. తనకు రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
తనపై జరిగిన దాడి వెనుక మంత్రి కొడాలి నాని పాత్ర ఉందని పట్టాభి ఆరోపించారు. రాష్ట్రంలో రౌడీయిజం చేస్తూ వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీని అణచివేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు పధకం ప్రకారమే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. పోలీస్ కమిషనర్ లేదా డీజీపీ వచ్చి దాడిపై సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు.. సీఎం జగన్ అని పట్టాభి తెలిపారు.పట్టాభిపై దుండగులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వర్‌రావు అక్కడకు చేరుకుని పట్టాభిని పరామర్శించారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి సరెండర్ అయిపోయిందని,ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగున్నా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.