కూతురు నాలుకను పద్మజ తినేసిందా! మదనపల్లి ఘటనలో మరో షాకింగ్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన చిత్తూరు జిల్లా మదనపల్లి అక్కా చెల్లెల్ల హత్య ఘటనలో షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. ఆధ్యాత్మిక పిచ్చిలో పెద్దకూతురు అలేఖ్య , తల్లి పద్మజలు కిరాతకంగా వ్యవహరించారని తెలుస్తోంది. మూఢ భక్తితో కుమార్తెలను డంబెల్‌తో కొట్టి చంపేసిన తల్లి పద్మజ... ఆ తర్వాత చనిపోయిన పెద్ద కుమార్తె అలేఖ్య నాలుకను కోసి తినేసిందని ఆమె భర్త పురుషోత్తం నాయుడు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక కానీ ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు.
తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం వైద్యులకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలేఖ్య చెప్పేదని, తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండడంతో ఆమె మాటలు నమ్మామని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం. పద్మజ, పురుషోత్తం ఇద్దరిలోనూ మానసిక వ్యాధి లక్షణాలు ఉన్నట్లు రుయా వైద్యులు తెలిపారు. వాళ్ల రక్తసంబంధీకుల్లోనూ మానసిక సమస్యలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పద్మజ తండ్రి 20 ఏళ్లపాటు ఇలాంటి సమస్యలతోనే ఇబ్బంది పడినట్టు తేలింది. పద్మజ మేనమామలోనూ ఇలాంటి లక్షణాలే ఉన్నాయని, తండ్రి నుంచి పద్మజకు, ఆమె నుంచి ఆమె కుమార్తెలకు వంశపారంపర్యంగా ఇది సంక్రమించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.
మదనపల్లి హత్యాకాండ వ్యవహారంలో ఉన్నత చదువులు చదువుకున్న 27 ఏండ్ల పెద్ద కూతురు అలేఖ్యే ప్రధాన కారణమని తెలుస్తోంది. పోలీసుల నుంచి వస్తున్న వివరాల ప్రకారం చదువులో మెరిట్ స్టూడెంట్ అయిన అలేఖ్య.. చిన్నచిన్న మ్యాజిక్‌లు చేసి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసేది. కూతురు ప్రతిభకు తల్లిదండ్రులు మురిసిపోయేవారు. తమ కూతురికి నిజంగానే అతీత శక్తులు ఉన్నాయని నమ్మేవారు. అలా కొన్ని కొన్ని చేష్టలతో అలేఖ్యను తల్లిదండ్రులు పూర్తిగా నమ్మారు. తమ ఇద్దరు కూతుళ్లు సాక్షాత్తు శివుడు, పార్వతులని పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు మురిసిపోయేవారట. అదే విషయాన్ని వారు పోలీసులకు చెప్పారట. ఈ క్రమంలో రెండు వారాల క్రితం అలేఖ్య, తన చెల్లెలు సాయి దివ్య కలిసి తమ పెంపుడు కుక్కతో బయటకు షికారుకు వెళ్లారు. అప్పుడు చిన్నకూతురు సాయి దివ్య..బయట ముగ్గు మధ్యలో ఉన్న నిమ్మకాయ తొక్కినట్లు అనుమానపడింది. అదే విషయాన్ని అక్కకు, తల్లిదండ్రులకు చెప్పింది. ‘నేను చచ్చిపోతానేమోనని చాలా భయంగా ఉంది..అని తరచూ ఏడుస్తూ చెప్పేది. తరచూ భయపడిపోయేది.
చెల్లీ నువ్వు చచ్చిపోతే నేను నిన్ను బతికిస్తానుగా అంటూ దివ్య భయాలకు మరింత ఆజ్యం పోసింది అలేఖ్య. దీంతో దివ్యకు మరింతగా తాను నిజంగానే చచ్చిపోతాననే భయం పెరిగిపోయింది.
ఈ క్రమంలో గత శనివారం ఓ భూత వైద్యుడితో తల్లిదండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ దివ్యకు తాయెత్తులు కట్టించారు. అయినా దివ్యకు తాను చచ్చిపోతాననే భయం తగ్గలేదు. ఆనెల 24న మధ్యాహ్నం దివ్య తాను చనిపోతానంటూ ఏడుస్తూ ఇంట్లో మేడపైన ఉన్న తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు, అలేఖ్య కలిసి ఒంటి గంట సమయంలో గదిలోకి వెళ్లి దివ్యకు వేపాకులతో మంత్రాలు చేశారు. ఏవేవో మంత్రాలు జపించారు. అయినా దివ్యకు భయం తగ్గలేదు. గట్టి గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దీంతో అలేఖ్య చెల్లెలు దివ్యను చంపేయాలని.. తరువాత తాను బతికిస్తానని అలేఖ్య తల్లిదండ్రుల్ని బాగా నమ్మించింది. అలా సాయంత్రం 5 గంటల సమయంలో దివ్యను డంబెల్‌తో తలపై బలంగా కొట్టి చంపేశారు.తర్వాత పదునైనా శూలంతో పొడిచి.. ముఖాన్ని కూడా చెక్కేశారు. తరువాత అలేఖ్య చెల్లెలి ఆత్మను బంధించాను..ఇప్పుడు నన్ను కూడా మీరు చంపేయండి..చెల్లెలి ఆత్మను తీసుకొస్తాను..తరువాత ఇద్దరం కలిసి బతికి వస్తామని నమ్మించింది. తనను ఎలా చంపాలో కూడా చెప్పింది.
తాను పునర్జన్మలపై ప్రయోగాలు చేశానని.. గతంలో తాను కుక్కను ఇలాగే చంపేసి బతికించానని తల్లిదండ్రులకు అలేఖ్య చెప్పింది. కూతురు మాటల్ని వాళ్లు బాగా నమ్మారు. తర్వాత పూజ గదిలోకి వెళ్లి గుండు కొట్టుకుని, బట్టలన్నీ విప్పేసి.. ఒక పల్చటి చీర ధరించింది. అనంతరం నవ ధాన్యాలు పోసిన రాగి చెంబును నోట్లో పెట్టుకుని పూజ గదిలో కూర్చుంది. తర్వాత కొన్ని పూజలు చేసిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో అలేఖ్యను దివ్య చంపినట్లుగానే డంబెల్స్‌తో కొట్టి తల్లిదండ్రులు అలేఖ్యను చంపారు. అలా అలేఖ్య మాటలకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చెల్లిని తల్లిదండ్రులతో కలిసి చంపిన అలేఖ్య.. చనిపోయిన దివ్యను తీసుకొస్తానని తల్లిదండ్రుల చేతిలో దారుణంగా హతమైంది. పునర్జన్మలపై ఉన్న మూఢ నమ్మకమే ఈ హత్యలకు కారణమని నిందితులు చెప్పిన మాటల్ని బట్టి పోలీసులు భావిస్తున్నారు.