కేటీఆర్ పై క్లారిటీ కోసమేనా ? ఈనెల 7న టీఆర్ఎస్ కీలక సమావేశం
ఈనెల 7వ తేదిన తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం జరగబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని, కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, లీడర్లు ఓపెన్ గానే కేటీఆర్ కాబోయే సీఎం అని ప్రకటనలు చేస్తున్నారు. కొందరు మంత్రులు కూడా ఇదే వాయిస్ వినిపిస్తున్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో పార్టీకి చెందిన అన్ని స్థాయిల్లోని నాయకులతో కేసీఆర్ సమావేశం జరపబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయబోయే అంశంపై సీఎం కేసీఆర్ నేతలకు క్లారిటీ ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, పార్టీ వార్షికోత్సవంపైనే చర్చించడానికే కేసీఆర్ సమావేశం పెడుతున్నారని కొందరు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి మార్పు అంశంలో సమావేశంలో చర్చకు వచ్చే అవకాశమే లేదంటున్నారు. అసలు కేటీఆర్ ను సీఎం చేసే ఆలోచనే కేసీఆర్ కు లేదని చెబుతున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా వెళుతోంది. వరుస విజయాలతో జోరు మీదున్న బీజేపీకి చెక్ పెట్టడానికి ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కూడా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. ఈ మధ్య టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు అనవసర వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు.అలాంటి నేతలకు కేసీఆర్ స్వయంగా క్లాస్ తీసుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.