అప్పుడలా ఇప్పుడిలా.. సుప్రీం తీర్పు తర్వాత స్వరం మారింది!

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణను ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతల స్వరం మారింది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించి, మిగిలిన ఉద్యోగులతో ఎన్నికలను నిర్వహించుకోవచ్చని తాము సూచించామని తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాతైతే ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు తరువాత వెంకట్రామిరెడ్డి మాటలు.. గత రెండు రోజులుగా మాట్లాడిన మాటలకు భిన్నంగా ఉన్నాయి. అంతకుముందు ఎన్నికల సంఘం పై తీవ్రంగా స్పందించిన ఆయన.. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఎప్పుడూ చెప్పలేదంటూ ఇప్పుడు మాట మార్చడం హాట్ టాపిక్ గా మారింది.

నల్గొండకు రాములు నాయక్,  హైద్రాబాద్ కు చిన్నారెడ్డి! 

తెలంగాణలో పట్టు కోసం కాంగ్రెస్ నేతలంతా ఏకమయ్యారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్ గా  తీసుకుని పని చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో కేడర్ లో జోష్ నింపి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేయాలని టీకాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచించారు. అందుకే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. సామాజిక సమీకరణలు, సమర్ధత ఆధారంగా ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపుగా ఖారారు చేసిందని చెబుతున్నారు. నల్లగొండ– ఖమ్మం– వరంగల్‌ జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఎస్‌.రాములు నాయక్, రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ జిల్లాల నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డిలను నిర్ణయించినట్టు సమాచారం.           పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్లను కేటాయించేందుకు కాంగ్రెస్ పెద్ద కసరత్తే చేసింది.  రెండు నెలల క్రితమే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నల్లగొండ స్థానానికి 26, రంగారెడ్డికి 24 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను వడపోసి.. సామాజిక సమీకరణాలు, అనుభవం అనే ప్రాతిపదికలను కాంగ్రెస్‌ పార్టీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. నల్లగొండ– ఖమ్మం–వరంగల్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థిగా రాములునాయక్‌ను ఇదే కోణంలో ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.  రాముల్ నాయక్ కు  ఎమ్మెల్సీగా రెండేళ్ల పదవీకాలం ఉండగానే అధికార టీఆర్‌ఎస్‌ను వీడి ఆయన కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. కేసీఆర్ పై పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందు నుంచి ఉన్నారు రాములు నాయక్. టీఆర్ఎస్ స్థాపించిన సమయంలో కేసీఆర్ తో ఉన్న కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు.  గిరిజన నేతగా, తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు ఉన్నప్పటికీ అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఆయనకు పార్టీ ఇవ్వలేదు. అందుకే ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. రాములు నాయక్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో  లంబాడీ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ సామాజికవర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. రాములు నాయక్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు.   రంగారెడ్డి– హైదరాబాద్‌– మహబూబ్‌నగర్‌ అభ్యర్థిగా జి.చిన్నారెడ్డిని అనుభవం ప్రాతిపదికన ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈసారి చిన్నారెడ్డికి అవకాశం ఇవ్వాలని టీపీసీసీ పెద్దలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, టి.రామ్మోహన్‌ రెడ్డిలు పోటీ నుంచి తప్పుకోవడం, అధిష్టానం పరిశీలనలో ఉన్న వంశీ యువకుడు కావడంతో మరోమారు అవకాశం ఇవ్వవచ్చనే ఆలోచన మేరకు ఇక్కడి నుంచి చిన్నారెడ్డి పేరు దాదా పు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ లో మార్పు!!

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయింది. దీంతో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ స్వల్పంగా మారింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో దశగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 21న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు దశల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు దశలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి 9న, రెండో దశ ఫిబ్రవరి 13న, మూడో దశ ఫిబ్రవరి 17, నాలుగో దశ ఫిబ్రవరి 21న జరగనున్నాయి.

రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న రేవంత్ ! 

టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. అబద్దాలు చెప్పడంలో కేటీఆర్... ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిపోయారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ పచ్చి అబద్దాలతో బ్రతికేస్తున్నారని, అబద్దాలు చెప్పడమే సీఎం పదవికి అర్హత అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  కేటీఆర్ గుంటకాడి నక్కలా సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సిందేనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్‌ను సీఎం చేయరని అన్నారు. మంత్రి పదవి పోతుందని భయపడేవారు, కొత్తగా మంత్రి కోరుకుంటున్న వారే కేటీఆర్ సీఎం అని అంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.  మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్ రెడ్డి..  కొడంగల్‌ అభివృద్ధిపై అధికార పార్టీకి సవాల్ చేశారు. కొడంగల్ ను అభివృద్ధి చేసినట్లు కేటీఆర్ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గతంలో తాను చేసిన అభివృద్ధికి రంగులు మార్చి వారి ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. 2019 తర్వాత కొడంగల్‌కు ఒక్క అభివృద్ధి పనిని మంజూరు చేయలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌కు దమ్ముంటే పనులు మంజూరు చేసినట్టు పోలేపల్లి ఎల్లమ్మ మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. అభివృద్ధి చేసినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు రేవంత్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొత్త పార్టీపై స్పందించిన రేవంత్ రెడ్డి.. తెలంగాణను అందరూ ప్రయోగశాల చేస్తున్నారని చెప్పారు. 

ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌ అలీపై జరిగిన దాడి కేసులో అసదుద్దీన్ కోర్టుకు‌ హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలుసార్లు అసదుద్దీన్ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.   2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో షబ్బీర్ అలీ ప్రయాణిస్తున్న కారును కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. కారు లోపల కూర్చున్న షబ్బీర్ అలీపై కొందరు దాడి కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించి మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనలో అసదుద్దీన్ ని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్ష్యులు, వీడియోలు ఉన్నట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అయితే, షబ్బీర్‌ అలీపై దాడిలో తన పాత్ర లేదని గతంలో అసుదుద్దీన్ తెలిపారు. తాను దాడి చేసే వారిని అడ్డుకున్నానని చెప్పారు. ఈ కేసులో అసదుద్దీన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే మీర్‌చౌక్ పోలీసులు దీనికి కౌంటర్ దాఖలు చేశారు. షబ్బీర్‌ అలీపై దాడిలో అసదుద్దీన్ పాత్ర ఉందని కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో అసదుద్దీన్ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే అసదుద్దీన్ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది. పంచాయతీ ఎన్నికలు యధావిధిగా నిర్వహించాలని ఆదేశించింది. తాజా తీర్పుతో ఏపీ పంచాయతీ ఎన్నికలకు అడ్డంకులు తొలగినట్టుయింది. ఇక విచారణ సందర్భంగా జస్టిస్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అని ప్రశ్నించారు. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమన్న ఆయన.. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, ఎన్నికలు ప్రతీసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు.

హైకోర్టుకే అబద్దం చెప్పిన ఏపీ డీజీపీ, హోమ్ సెక్రెటరీ.. 27న స్వయంగా హాజరు కావాలని ఆదేశం 

ఒక పోలీస్ అధికారికి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశంలో కోర్టు ధిక్కారం కింద ఈరోజు (సోమవారం) స్వయంగా హైకోర్టుకు హాజరు కావాలని డీజీపీ, హోమ్ సెక్రటరీలను ఏపీ హైకోర్టు గతంలో ఆదేశించింది. అయితే ఈరోజు కోర్టు విచారణకు హాజరు కాకుండా ముఖ్య అధికారులు ఇద్దరు సాక్షాత్తు హైకోర్టుకు అబద్దాలు చెప్పారు. "ప్రస్తుతం తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని అందుకే విచారణకు స్వయంగా హాజరు కాలేకపోతున్నామని" వారు హైకోర్టుకు తెలిపారు. అయితే దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేవరకు అన్నీ వాయిదా వేయాలని ఏపీ సీఎస్ కోరారని... కానీ తమరేమో ఎన్నికల విధులంటున్నారు ఇది ఎలా సాధ్యమని ధర్మాసనం ప్రశ్నించింది. ఈనెల 27న కోర్టుకు తప్పకుండా హాజరు కావాలంటూ డీజీపీ, హోంసెక్రటరీకి హైకోర్టు స్పష్టం చేసింది.

లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నా! టీఆర్ఎస్ లో రసమయి కలకలం 

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ పెద్దల తీరుపై ఆగ్రహంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా వాయిస్ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. కరంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ పార్టీలో సెగలు రేపుతుందోని తెలుస్తోంది. మహబూబాబాద్‎లో ప్రముఖ కవి జయరాజు తల్లి సంతాప సభలో మాట్లాడిన రసమయి బాలకిషన్.. సొంత పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.  తాను  అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో తన సహజత్వాన్ని కోల్పోయానన్నారు రమసయి. ప్రస్తుతం తానో లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నానంటూ సంచలనం కామెంట్లు చేశారు. తాను ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో చాలా మందికి దూరమయ్యానన్నారు. సమాజంలో కవులు, కళాకారులు మౌనంగా ఉండటం క్యాన్సర్ కంటే ప్రమాదకరమంటూ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రసమయి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.   తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు రసమయి బాలకిషన్. ధూంధాం ద్వారా ప్రత్యేక రాష్ట్ర వాదన వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో పాటలే ప్రధాన పాత్ర పోషించాయని చెబుతారు. 2014 తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే మానకొండూరు నుంచి బరిలో నిలిచి విజయం సాధించారు బాలకిషన్. 2018లో రెండోసారి గెలుపొందారు. ప్రభుత్వ పథకాలను, సీఎం కేసీఆర్‌ను ప్రశంసిస్తూ అసెంబ్లీలో సైతం తన పాటలతో దుమ్ములేపినరసమయి చేసిన తాజా వ్యాఖ్యలు... అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా మందికి తాను దూరమయ్యారంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతమన్న చర్చ జరుగుతోంది. కొంత కాలంగా టీఆర్ఎస్ ముఖ్య నేతలతో రసమయికి గ్యాప్ పెరిగిందనే చర్చ జరుగుతోంది. తన నియోజకవర్గంలోనూ కొందరు నేతలు కేసీఆర్ కుటుంబం పేరుతో పెత్తనం చలాయిస్తున్నారని రసమయ తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారని చెబుతున్నారు.  తన అసంతృప్తిగా ఇలా బయటికి చెప్పారని చెబుతున్నారు. 

హైదరాబాద్ లో దారుణం.. గుడిలోని దుర్గామాత విగ్రహం పెకలించివేసిన దుండగులు 

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి సఫ్దర్ నగర్‌లోని ఒక ఆలయ ధ్వంసం చేసిన క్రమంలో ఒక అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక కుక్కను చంపిన దుండగులు ఆలయ ఆవరణలోనే ఉరివేసి వేలాడదీశారు. అంతేకాకుండా దుర్గామత ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని పెకిలించి ఆలయం బయట పడవేశారు. అంతేకాకుండా ఆలయానికి వెలుపల ఉన్న‌నాగ దేవత విగ్రహాలను కూడా దుండగులు‌ పగులగొట్టారు. దీంతో విషయం తెలిసిన వెంటనే భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆందోళన చేపట్టారు. మరోపక్క విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ కార్పొరేటర్ మహేందర్ ఘటనా స్థలానికి చేరుకొని నిందితులని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.

స్నేహం నటిస్తూనే  సరిహద్దులో చైనా కుట్ర ! నాకులా  దగ్గర  దళాల మధ్య  ఘర్షణ! 

స్నేహంగా ఉంటామని చెబుతూనే  కుట్రలు కొనసాగిస్తోంది చైనా. భారత్ భూభాగంలోకి చొరబడేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో చర్చలు జరుగుతుండగానే సిక్కింలో భారత, చైనా దళాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి.  ఉత్తర సిక్కింలోని నాకులా వద్ద.. భారత్‌ చైనా సైన్యాల మధ్య మూడు రోజుల క్రితం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరుదేశాలకి చెందిన సైనికులు గాయపడినట్లు సమాచారం. గల్వాన్‌ ఘటన తరహాలోనే ఇరుదేశాలు బాహాబాహికి దిగినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం సిక్కింలోని నాతులా ప్రదేశం గుండా చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను  భారత బలగాలు దీటుగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చైనా సైనికులను అడ్డుకునే ప్రయత్నంలోనే ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో నలుగురు భారత జవాన్లు గాయపడగా, చైనా సైనికులు 20 మంది గాయాలపాలయ్యారు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, పరిస్థితి మాత్రం పూర్తి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా సరే... సరిహద్దుల్లో సమర్థవంతంగా మన సైనికులు తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. భారత్‌ చైనా మధ్య నాకులా ప్రాంతం సరిహద్దుగా ఉంది.  

పేదలకు మరింత పేదరికం.. కుబేరుల ఆస్తి డబుల్ ! కరోనా ప్రభావంపై షాకింగ్ సర్వే  

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. అన్ని రంగాలను చిన్నాభిన్నం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. కరోనా దెబ్బకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. మరికొన్ని దేశాలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాయి. అగ్ర దేశాలు సైతం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొన్నాయి. అయితే కరోనా మహమ్మారి ప్రభావంపై తాజాగా విడుదలైన ఓ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కరోనా మహమ్మారి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసినా.. ప్రపంచ కుబేరులకు మాత్రం కలిసి వచ్చిందట. కరోనా కాలంలో కుబేరుల సంపాదన మరింత పెరిగిందని.. అదే సమయంలో పేదలు మరింత పేదలుగా మారిపోయారని తేలింది.  కరోనా ప్రభావంపై తాము నిర్వహించిన సర్వేలను ఆక్స్ ఫామ్ గ్రూప్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్న దావోస్ సమ్మిట్ లో విడుదల చేసింది. విద్య, ఆరోగ్యం, వైద్య రంగాల్లో లక్షాధికారులుగా ఉన్న వారు వ్యాపారులు.. కరోనా మహమ్మారి తర్వాత  కోటీశ్వరులుగా మారిపోయారని ఆ స్పష్టమైంది. ప్రజలంతా మరింత మెరుగైన ఆరోగ్య జీవనాన్ని కోరుకోవడమే ఇందుకు కారణమని  తెలిపింది.  ఆక్స్ ఫామ్ గ్రూప్ ఆ నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత  అంటే మార్చి 18 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రపంచ బిలియనీర్ల సంపద 3.9 ట్రిలియన్ డాలర్ల వరకూ పెరిగిందట. టాప్ 10 అత్యధిక ధనవంతుల సంపద 540 బిలియన్ డాలర్లు పెరిగిందని వెల్లడైంది.  కరోనా సమయంలో కుబేరులు మరింత కుబేరులు కాగా..  కోట్లాది మంది పేదలు మరింత పేదలుగా మారారని ఆక్స్ ఫామ్ గ్రూప్ సంస్థ తెలిపింది. కరోనా కాటుకు ప్రపంచంలోని పేదల జనాభా 20 నుంచి 50 కోట్ల వరకూ పెరిగిందని  అంచనా వేసింది. కరోనా మహమ్మారి ప్రపంచంలోని అత్యధికులపై ప్రభావం చూపిందని.. రోజుకు కేవలం 2 నుంచి 10 డాలర్ల మధ్య వెచ్చిస్తూ జీవనం గడుపుతున్న వారిపైనే ఈ ప్రభావం అధికంగా ఉందని ఆ సర్వేలో వెల్లడైంది. వాణిజ్య రవాణా వ్యవస్థలు నిలిచిపోయిన వేళ, వీరి జేబుల నుంచి ఎన్నో వందల కోట్లు ఆవిరై పోయాయని ఆక్స్ ఫామ్ అంచనా వేసింది. 

తెలుగు రాష్ట్రాలలో కలకలం.. వ్యాక్సిన్ తీసుకున్న ముగ్గురు హెల్త్ వర్కర్ల మృతి..  

రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్లలో మరణాలు నమోదవుతున్నాయి. కేవలం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే వ్యాక్సిన్ వేయించుకున్న ముగ్గురు హెల్త్ వర్కర్లు మ‌ర‌ణించ‌డం ప్రస్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిర్మ‌ల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 42 ఏళ్ల 108 డ్రైవర్ ఆ మ‌రుస‌టి రోజే మృతి చెందారు. వ్యాక్సిన్ వేయించుకోవ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు ఛాతీ నొప్పి వ‌చ్చిన‌ట్టుగా అయన కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.   ఇది ఇలా ఉండగా వ్యాక్సిన్ తీసుకున్న మ‌రో ఇద్ద‌రు హెల్త్ వ‌ర్క‌ర్లు ఆదివారం నాడు మృతి చెందారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా న్యూ శాయంపేట అంగన్‌వాడీ టీచర్ వనిత తీవ్ర‌మైన చాతినొప్పితో నిన్న మృతి చెందింది. వ్యాక్సిన్ వేయించుకున్న‌ప్పటి నుంచి ఆమె అస్వ‌స్థ‌త‌గా ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోపక్క ఏపీలోని గుంటూరు జిల్లాలో క‌రోనా‌ వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి కూడా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. ఆమె కూడా వ్యాక్సిన్ వేయించుకున్న త‌ర్వాతే అనారోగ్యానికి గురైన‌ట్టు ఆమె కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఆమె బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌కు గురయ్యారని తేల్చారు. మరోపక్క ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ రియాక్షన్‌తో 17 మంది ఆసుపత్రిలో చేరినట్లుగా జీజీహెచ్ అధికారులు తెలిపారు. 10 మందికి వైద్యం చేసి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇంకా ఏడుగురికి చికిత్స కొనసాగుతోంది. అయితే బాధితుల వివరాలను వైద్యశాఖ గోప్యంగా ఉంచుతోంది. దీంతో వ్యాక్సిన్ తీసుకున్న ఆశా వర్కర్ విజయలక్ష్మి మరణించడంతో మిగతా బాధిత కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇండియానాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు.  ఓ ఇంట్లో దుండగులు కాల్పులకు పాల్ప‌డ‌డంతో గర్భిణీ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో మైన‌ర్‌కి తీవ్ర‌గాయాలు కాగా ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. అడ‌మ్స్ స్ట్రీల్ 3500 బ్లాక్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దుండ‌గుడు ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే కాల్పుల‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండ‌గుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.    కాల్పుల  ఘ‌ట‌న‌ను  తీవ్రంగా ఖండిస్తూ ప్ర‌క‌ట‌న చేశారు ఇండియానా పోలిసు మేయర్ జో హాగ్‌సెట్. ఈ దారుణ ఘ‌ట‌న‌పై పోలీసులు, ఇతర అధికారులు దర్యాప్తు ప్రారంభించార‌ని వివరించారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, దశాబ్ద కాలంలో ఇంతటి ఘోరమైన కాల్పులు చూడలేదని అక్క‌డి పోలీసులు తెలిపారు.

తల్లి గోల్డ్ మెడలిస్ట్.. తండ్రి వైస్ ప్రిన్సిపాల్.. దివ్యశక్తుల కోసం కన్నబిడ్డలను కడతేర్చారు 

ఎంత విద్యావంతులైనా మూఢ భక్తి తలకెక్కితే జరిగే అనర్ధాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిపే ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. అది ఒక ఉన్నత విద్యావంతుల కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరు అధ్యాపక వృత్తిలో ఉండగా పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. పెద్దమ్మాయి నిన్నటిదాకా ఫారెస్ట్‌ సర్వీసులో జాబ్ చేసింది. ఇక చిన్నమ్మాయి సంగీతంపై ఇష్టంతో సాధన చేస్తోంది. అటువంటి కుటుంబంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా క్షుద్ర పూజల నేపథ్యంలో దారుణం చోటు చేసుకుంది. మూఢనమ్మకాలు, ఆపై పరాకాష్టకు చేరిన మూఢభక్తి.. రెండూ తోడై.. దివ్యశక్తులను వశపరుచుకోవడం కోసమంటూ ఇద్దరు పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలను కన్నతల్లే అతి దారుణంగా కడతేర్చింది.   ఈ ఘటన పూర్తీ వివరాల్లోకి వెళితే.. శివనగర్‌కు చెందిన పురుషోత్తం నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్. ఆయన భార్య పద్మజ ఓ విద్యాసంస్థలో కరస్పాండెంట్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వారికి అలేఖ్య (27), సాయిదివ్య (22) ఇద్దరు కుమార్తెలు. అయితే కరోనా నేపథ్యంలో పిల్లలు ఇద్దరు ఇంటివద్దే ఉంటున్నారు. అలేఖ్య సివిల్స్‌కు సిద్ధమవుతోంది. రెండో అమ్మాయి సాయిదివ్య ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఏఆర్‌ ఇనిస్టిట్యూట్‌లో మ్యూజిక్‌ ప్రాక్టీస్ చేస్తున్నారు. గతేడాది వీరు స్థానికంగా కట్టుకున్న సొంత ఇంటిలోకి మారినప్పటినుండి ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు.   ఈ క్రమంలో మూడురోజులుగా బయటి వ్యక్తులను పిలిపించి ఎడతెరపి లేకుండా పూజలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం పూజగదిలోనే పెద్దకుమార్తె అలేఖ్యను పద్మజ.. డంబెల్‌తో నుదిటిపై మోది చంపేశారు. అంతేకాకుండా చనిపోయిన అలేఖ్యను పూజా క్రతువులో భాగంగా బతికించుకొనేందుకు రెండోకుమార్తె సాయిదివ్యను పైఅంతస్తులోని బెడ్‌రూమ్‌లో ఇదే తరహాలో భర్త ఎదుటే తల్లి పద్మజ చంపేసింది.   ఈ ఘటన అనంతరం ఆ పిల్లల తండ్రి ఈ విషయాన్ని కాలేజీలోని తోటి ఉపాధ్యాయుడికి చెప్పడంతో ఆయన వెంటనే వారి ఇంటికి చేరుకుని.. అక్కడి పరిస్థితి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ.. తమ బిడ్డలు మళ్లీ బతుకుతారన్న మూఢభక్తితోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కుమార్తెలు ఇద్దరినీ తల్లే చంపిందని.. ఆ సమయంలో తండ్రి అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ ఇద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించామని.. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అయన తెలిపారు.

రాజధానికి కదిలిన రైతుల దండు!  సరిహద్దుల్లో వేలాది ట్రాక్టర్లు  

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న రైతులు  తుది సమరానికి కదిలారు. గణతంత్ర దినోత్సవం రోజే దేశ రాజధానిలో ర్యాలీకి దండుగా కదలివస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లే దారులన్ని రైతులతో వస్తున్న ట్రాక్టర్లతో నిండిపోయాయి. వేలాది ట్రాకర్లలో రైతులు ర్యాలీగా హస్తినకు వస్తున్నారు. దీంతో వందలాది కిలోమీటర్ల మేర ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ నుంచి ఢిల్లీకి ఎంటరయ్యే సరిహద్దులకు ఇప్పటికే వందలాది ట్రాక్టర్లు చేరుకున్నాయి. ఇంకా వేలాదిగా తరలివస్తున్నాయి. దీంతో గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రైతులు జరప తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ టెన్షన్ పుట్టిస్తోంది.  రాజ్‌పథ్‌ మార్చ్‌లో వివిధ రాష్ట్రాల శకటాలు సాగినట్లే రైతులు కూడా కొన్ని ట్రాక్టర్లను వివిధ ఆకృతులతో కూడిన శకటాలుగా రూపొందిస్తున్నారు. రైతు జీవనం, దేశానికి రైతు అవసరం, రైతుల దుస్థితి, సాగుచట్టాల వల్ల అనర్థాలు, మారుతున్న జీవన విధానాలు.. వీటన్నింటినీ వివిధ రూపాల్లో ప్రదర్శిస్తారు. ప్రతీ ట్రాక్టర్‌పైనా మువ్వన్నెల జెండా తప్పనిసరిగా ఉండేట్లు చర్యలు తీసుకుంటున్నారు. పంజాబ్‌లోని లూధియానా నుంచి కర్తార్‌సింగ్‌ అనే రైతు 160 కి.మీ. దూరం రివర్స్‌ గేర్‌లో ట్రాక్టర్‌ నడుపుకుంటూ ఢిల్లీ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చాడు. తన మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోడీ సాగు చట్టాలను రివర్స్‌ చేయాలని ఆయన కోరారు.  రైతుల ట్రాక్టర్లకు డీజిల్‌ నిరాకరించాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కోరింది. ఢిల్లీ దిశగా వెళ్లే ఏ ట్రాక్టర్‌కూ డీజిల్‌ అందివ్వరాదని అనేక పెట్రోల్‌ బంకులకు ప్రభుత్వాధికారుల నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ఈ విషయం రైతులకు తెలియడంతో చాలా చోట్ల బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.     రైతుల ట్రాక్టర్ ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ ముగిసిన తరువాతే అంటే ఉదయం 11-30 గంటల తరువాతే ట్రాక్టర్‌ ర్యాలీ ఆరంభం కావాలి. పోలీసుల షరతులకు రైతులు కూడా అంగీకరించి.. వాళ్ల రూట్ మ్యాప్ ఇచ్చారని చెబుతున్నారు. రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే ముగిశాకే.. రైతుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లోని బ్యారికేడ్లను తొలగిస్తారు. ట్రాక్ట ర్‌ ర్యాలీని మూడు సరిహద్దు పాయింట్ల నుంచి అంటే సింఘూ, టిక్రీ, గాజీపూర్‌ల వైపు నుంచి అనుమతిస్తా రు. పల్వాల్‌, షాజహాన్‌పూర్‌ అంటే రాజస్థాన్‌ వైపు నుంచి కూడా అనుమతించే అవకాశం ఉందని రైతు నాయకులు చెబుతున్నారు.    టిక్రీ నుంచి 63 కిమీ, సిం ఘూ నుంచి 60 కి.మీ, గాజీపూర్‌ నుంచి 46 కిలోమీటర్ల దూరం ర్యాలీని అనుమతిస్తారు. ఈ మూడూ కుండ్లీ-మనేసర్‌-పల్వాల్‌ ఎక్స్‌ప్రె్‌సవే వద్ద కలుస్తాయి. ఢిల్లీ నగరంలోనే 100 కి.మీ మేర ఇది సాగుతుంది.ఎన్ని ట్రాక్టర్లు ఏఏ పాయింట్ల నుంచి వస్తాయన్నది ముందుగానే నిర్ధారిస్తారు. ఢిల్లీ నగరంలో ఎక్కడికక్కడ అవుట్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తారు.  ట్రాక్టర్లు ఆయా పాయింట్ల నుంచి మరలిపోవాలి. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో వేలాది మంది  రైతులు కదం తొక్కారు. 21 జిల్లాల నుంచి ముంబైకి వచ్చారు. ఆజాద్‌ మైదాన్‌ వద్దకు భారీగా చేరుకుని  ధర్నాచేస్తున్నారు

నాలుగు రాజధానులకు జై కొట్టిన మమత!

పశ్చిమ బెంగాల్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీతో  పోరాటం చేస్తున్న మమతా బెనర్డీ దూకుడు పెంచారు. బెంగాల్ లో అధికారంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం వేస్తున్న ఎత్తులను చిత్తు చేసేలా కొత్త ఎత్తులు వేస్తున్నారు. నేతాజి సుభాష్ చంద్ర బోస్ ను ఎన్నికల్లో తమ అస్త్రంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న కమలనాధులను ఇరుకున పెట్టేలా ఆమె కొత్త నినాదం తెరపైకి తెచ్చారు.  భారత దేశానికి నాలుగు రొటేటింగ్‌ రాజధానులు ఉండాలన్నారు   మమతా బెనర్జీ.  కోల్‌కతాను రాజధానిగా చేసేకొని అప్పట్లో ఆంగ్లేయులే పాలించారని, అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే రాజధాని ఎందుకు ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి  ప్రశ్నించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి ఉత్సవాల్లో  భాగంగా మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని కేంద్రం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె డిమాండ్‌ చేశారు. దేశ్‌నాయక్‌ దివాస్‌గా జరుపుకునే నేతాజీ పుట్టిరోజు గురించి మనందరికీ తెలిసినా, ఆయన మరణం గురించి మాత్రం ఎవరికీ తెలియదని అన్నారు. మాతృభూమిపై సమానంగా నేతాజీపై ప్రేమ ఉన్నది కొద్ది మందికే అన్నారు బెంగాల్ సీఎం.  కొందరు మాత్రం ఎలక్షన్స్‌ను దృష్టిలో ఉంచుకొని అధికారం కోసం ఆయన సంబరాలు నిర్వహిస్తున్నారంటూ  బీజేపీని పరోక్షంగా విమర్శించారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.  

గ్లాస్‌ షీల్డ్‌ కవర్‌ వెనక నిమ్మగడ్డ ప్రెస్ మీట్! ఉద్యోగుల పరిస్థితి ఏంటంటున్న వైసీపీ 

తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ఒక వైపు ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుంటూ పోతుండగా.. అధికార వైసీపీ నేతలు నిమ్మగడ్డ టార్గెట్ గా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ వివాదమంతా  కరోనా చుట్టే తిరుగుతోంది. టీకా వేసుకునే వరకు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తుండగా.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని ఎస్ఈసీ చెబుతోంది. అయితే  తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన మీడియా సమావేశం ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపింది. ఎన్నికలకు సహకరించబోమని చెబుతున్న ఉద్యోగ సంఘాలకు అస్త్రంగా మారుతోంది.      నిమ్మగడ్డ రమేష్ కుమార్ విలేకరుల సమావేశంలో  పూర్తి స్థాయిలో  కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్‌ ధరించి.. గ్లాస్‌ షీల్డ్‌ కవర్‌ వెనుక కూర్చుని ఆయన వివరాలు వెల్లడించారు.  కరోనాను చూసి భయపడవద్దని ఉద్యోగులు, జనాలకు చెప్పారు. మీడియా సమావేశంలో ప్రశ్నలు వేయరాదని ఆహ్వానపత్రంలో ముందుగానే సూచించారు. సమావేశానికి ముందు ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేయించారు. నిమ్మగడ్డ తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విలేకరుల సమావేశానికే నిమ్మగడ్డ తన రక్షణ కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.. మరి లక్షల మంది ప్రజలతో ముడిపడ్డ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే  సిబ్బంది పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసే ప్రజల ఆరోగ్యం గురించి ఆయనకు బాధ్యత లేదా.. ఆయన ఒక్కరిదే ప్రాణం.. జనాలది కాదా అని విమర్శిస్తున్నారు.    రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలే జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013 జూలైలో పంచాయతీ ఎన్నికలు.. 2014 మార్చిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం 2018 జూలైలో  పంచాయతీ ఎన్నికలు, 2019లో ఏప్రిల్ లో ప్రాదేశిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కాని అప్పటి ప్రభుత్వం వాటిని నిర్వహించలేదు. 2016 జనవరి 30న ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటైంది. అప్పుడే  ఏపీ తొలి ఎన్నికల కమిషనర్ గా 2016 మార్చిలో  నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించబడ్డారు. అంటే 2018,2019లో స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. నిమ్మగడ జరపలేకపోయారు. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ సైలెంట్ గా ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలోని మున్సిపల్, కార్పోరేషన్ల పరిస్థితి ఇంతే. విశాఖ నగరానికి 2007లో ఎన్నికలు జరిగాయి. అంటే 14 ఏండ్లుగా విశాఖ కార్పొరేషన్ కు పాలక మండలి లేదు.     ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నిమ్మగడ్డను టార్గెట్ చేస్తోంది వైసీపీ. మూడేళ్ల పాటు నిద్రపోయిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. మూడు నెలల కోసం ఎందుకు తొందరపడుతున్నారని, వ్యాక్సినేషన్‌  సమయంలో ఇంత మొండిగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నిమ్మగడ్డ సమావేశం పొలిటికల్‌ ప్రెస్‌మీట్‌లా ఉందని చెప్పారు.  2018లో పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?. ఎన్నికల నిర్వహణలో మూడేళ్లుగా ఈసీ ఎందుకు విఫలమైంది? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. ఈ న్యాయపోరాటం ఎక్కడికి పోయిందని అంబటి నిలదీశారు. చంద్రబాబుకు అనుకూలమైన అధికారులతో..ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమని అంబటి  తెలిపారు. వ్యాక్సినేషన్‌, ఎన్నికలు ఒకేసారి నిర్వహించటం సాధ్యం కాదని.. వ్యాక్సినేషన్‌ చేస్తే కోవిడ్‌ తగ్గుతుంది.. ఎన్నికలు నిర్వహిస్తే కోవిడ్‌ పెరుగుతుందన్నారు. నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఆయన  వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్లు ఉన్నాయని  రాంబాబు మండిపడ్డారు.  ఏపీలో 2020 మార్చిలో  స్థానిక సంస్థల ఎన్నికలకు ర్ణయించారు. ఓటర్ల జాబితా తయారు కాలేదంటూ ఎస్‌ఈసీ అప్పట్లో మెలిక పెట్టినా.. జగన్ సర్కార్ ముందుకు వెళ్లింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే దేశంలో కరోనా కేసులు నమోదు కావడంతో  స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.   గత అక్టోబర్ లో  మళ్లీ ఎన్నికల నిర్వహణలో వేగం పెంచారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. షెడ్యూల్ కూడా విడుదల చేశారు. స్థానిక ఎన్నికలు రాజ్యాంగ విధి అని.. సకాలంలో ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి నిధులు రావని చెప్పారు నిమ్మగడ్డ.  అయితే స్థానిక ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి నిధులు రావంటున్న నిమ్మగడ్డకు 2018,19లో ఆ విషయం తెలియదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కరోనా సాకుతో మార్చిలో ఎందుకు వాయిదా వేశారో చెప్పాలంటున్నారు.  చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటూ నిమ్మగడ్డ.. ఎన్నికల కమిషన్ ను వివాదం చేశారని ఆరోపిస్తున్నారు.    

ఆప్ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష!

ఢిల్లీలోని ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా ఆయనకు కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది.    2016లో సెప్టెంబరు 9న సోమనాథ్ భారతి, మరో 300 మంది కలిసి జేసీబీ ఆపరేటర్ సాయంతో ఎయిమ్స్ ప్రహరీకి ఉన్న ఫెన్సింగును తొలగించారు. ఈ క్రమంలో అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేసినట్టు ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ఎస్ రావత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 323, 353, 147 కింద కేసులు నమోదయ్యాయి. కేసును విచారించిన కోర్టు ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు గాను సోమనాథ్ భారతిని దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే ఆప్ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.