కందకాలు కాదు వారధులు కావాలి! రైతుల ఆందోళనలపై ఎంపీల కన్నీళ్లు
కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు సభలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశాన్నికి వెన్నెముకైన రైతులతో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ తప్పు పట్టారు. ఊరికే ఊకదంపుడు ప్రసంగాలు చెప్పడం ఆపేసి చర్చల ద్వారా సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రోడ్లపై కందకాలు తవ్వుతూ ముళ్ల కంచెలు వేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేయడం కాదు, వారధులు నిర్మించి రైతుల మనసులు, మన్ననలు గెలుచుకోవాలని ప్రతిపక్ష పార్టీల నేతలు ముక్తకంఠంతో నినదించారు. రాజ్యసభలో రైతు ఆందోళనపై మాట్లాడిన ప్రతిపక్ష నేతలు.. ప్రసంగాల మధ్యోలో తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘ప్రభుత్వం విమర్శను స్వీకరించే స్థితిలో లేదు. వాళ్లకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి పదం దేశద్రోహంగా మారిపోతుంది. దేశభక్తి అనేది బట్టల్లో కనిపించాదని, మనిషి హృదయంలో ఉంటుంది. ఈరోజు బిజెపి ఇంత పెద్ద మెజారిటీతో అధికారంలో ఉన్నారంటే దానికి కారణం రైతులే కారణమని, ఈ విషయం గుర్తుంటే మీరు ఇంకోలా ఆలోచిస్తున్నారని, రైతులు తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతుంటే . మీరేదో రైతులకు దానధర్మాలు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి తావులేదు’’ అని రాష్ట్రీయ జనతా దళ్ సీనియర్ నేత మనోజ్ ఝా అన్నారు.
‘‘చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి రైతుల ఆవేదనను అర్థం చేసుకోండి. విపరీతమైన చలిలో వారు ఆందోళన చేస్తున్నారు. వారికి నీళ్లు ఆపేశారు, మూత్రశాల సౌకర్యం తీసేశారు, రోడ్లపై మేకులు వేస్తున్నారు, కందకాలు తొవ్వుతున్నారు, ముళ్ల కంచెలు వేస్తున్నారు. అన్నదాతలపై ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం శత్రు దేశాల సైనికులపై ఇలా ఒక్కసారి కూడా వ్యవహరించలేదు’’ అని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆందోళన చేసేవారు, విమర్శలు చేసే వారికి ఖలిస్తానీ, నక్సల్స్, పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ రంగు పూస్తున్నారని, సీఏఏ వ్యతిరేక ఆందోళనపై ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. రైతు ఆందోళనపై ఇలాగే వ్యవహరిస్తోంది. ఎవరి మాటా పట్టించుకోకుండా, కనీసం వినకుండా దేశాన్ని పాలిస్తున్నారు. వినే ఓపిక లేదంటే నువ్వు నియంతవే అని మోడీ సర్కార్ ని ఎత్తి చూపుతూ.. రోడ్లపై గోడలు కట్టి ఆందోళనను ఆపాలని చూస్తున్నారు. గోడలు కాదు, వంతెనలు వేసి రైతుల హృదయాలను గెలుచుకోండి’’ అని మనోజ్ ఝా చెప్పారు.
‘‘ఈరోజు రైతుల ఆందోళనను దేశ అంతర్గత వ్యవహారంగా మాట్లాడుతున్నాం. మరి అమెరికా వెళ్లి ‘అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్’ అని నినాదాలు చేసింది ఎవరు? మళ్లీ వీళ్లే దేశ అంతర్గత విషయాల గురించి వేరే వాళ్లు మాట్లాడకూడదని అంటున్నారు. ఇక్కడ చిన్న చిన్న స్వేచ్ఛలు ఉన్నందుకు కృజ్ణతలు చెప్పాలి. అవి ఎలాంటివంటే, మైక్రోఫోన్‌లు మ్యూట్‌లో పెట్టుకొని మాట్లాడటం, టెలివిజన్ ఫీడ్‌ను సెన్సార్ చేయడం, మార్షల్స్ చేత ఎంపీలను బయటికి పంపడం లాంటి చిన్న చిన్న స్వేచ్ఛలు ఉన్నాయి’’ అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత డేరెక్ ఓబ్రెయిన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
‘‘ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో ప్రజా వ్యతరేక పాలన కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తే దేశద్రోహులని అంటున్నారని, రైతు వ్యతిరేకులు ఈ చట్టాలను తీసుకువచ్చారని. ప్రతి దశలో దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారని , మీరు అత్యంత మెజారిటీతో ఈరోజు అధికారంలో ఉండవచ్చు, కానీ అసమ్మతి అనేది ప్రజాస్వామ్య రూపం మీ అంతు చూస్తుందని ’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.