ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేసింది! జగన్ రెడ్డికి ఛీర్స్ చెప్పాల్సిందే
posted on Feb 1, 2021 @ 9:31AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుకున్నది సాధించారు.. అవునండి బాబూ ఏపీకి ఆయన స్పెషల్ స్టేటస్ తెచ్చేశారు. గత ఏడేండ్లుగా ఏపీలో స్పెషల్ స్టేటస్ నినాదం మార్మోగుతుండగా.. నేనున్నాంటూ ఆ స్పెషల్ స్టేటస్ ను ఆంధ్రాకు వచ్చేలా చేశారు జగన్ రెడ్డి. ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేలా చేసిన సీఎం జగన్ రెడ్డి.. ఇప్పుడు ఆంధ్రా జనమంతా ఛీర్స్ కొడుతున్నారు.
స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. విభజనతో కుదైలేన ఏపీ నిలదొక్కుకోవాలంటే ఇదే ప్రధానమని సగటు అంధ్రుడి మాట. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ నినాదం వినిపిస్తూనే ఉంది. ఏపీ రాజకీయాలన్ని కూడా స్పెషల్ స్టేటస్ చుట్టే తిరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ వైసీపీ ఉద్యమాలు చేసింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేసింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో ప్రత్యేక హోదా నినాదాన్ని టీడీపీ ఎక్కువగా వినిపిస్తోంది. స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కేంద్రంతో పోరాడటం లేదని వైసీపీని విమర్శిస్తోంది.
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు ఆ స్పెషల్ స్టేటస్ వచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే. ఏపీకి స్పెషల్ స్టేటస్ లిక్కర్ బ్రాండ్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ స్టేటస్ పేరుతో లిక్కర్ బాటిల్ విక్రయాలు జరుపుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Special Status పేరు ఉన్న క్వార్టర్ బాటిల్ ప్రస్తుతం అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. ఈ క్వార్టర్ బాటిల్ విస్కీ ధర రూ.180 అని ఉంది. దానిపై తెలుగులో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యం సేవించి వాహనం నడపరాదు.’ అని రాసి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ శాఖ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలో స్పెషల్ స్టేటస్ బ్రాండ్ ను విక్రయిస్తున్నట్లు తెలిసింది.ఈ స్పెషల్ స్టేటస్ లిక్కర్ బాటిల్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై కామెడీ చేస్తున్నారు నెటిజన్లు. జగన్ మోహన్ రెడ్డి ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇలా తీసుకొస్తారని అనుకోలేదంటూ కొందరు టీడీపీ అనుకూల నెటిజన్లు, సోషల్ మీడియా జనం ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోను వాడుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఏపీకి స్టెటస్ స్టేటస్ తీసుకొచ్చిన జగన్ రెడ్డికి ఛీర్స్ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా ఏపీలో ఇలాంటి ఘటన జరిగింది. ప్రెసిడెంట్ మెడల్ పేరుతో లిక్కర్ బాటిల్‌ను తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవడంతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆబ్కారీ శాఖ ప్రకటించింది.
తమను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన స్పెషల్ స్టేటస్ అంశాన్ని లేవనెత్తిన తర్వాత రోజే స్పెషల్ స్టేటస్ పేరుతో లిక్కర్ బాటిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ నేతలు చెప్పినట్లు స్పెషల్ స్టేటస్ తెచ్చారంటూ టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.