ఆరోగ్య రంగానికి బడ్జెట్ లో పెద్ద పీట! కరోనా విపత్తు పాఠాలు నేర్పిందన్న నిర్మల
posted on Feb 1, 2021 @ 11:08AM
అందరూ ఊహించినట్లే బడ్జెట్‌లో ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్ మహమ్మారి నేర్పిన పాఠాలతో ఈ రంగానికి కేటాయింపులను గతంలో కన్నా భారీగా పెంచింది. ఆత్మనిర్బర్ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. 9 బీఎస్‌ఎల్-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కరోనా మహమ్మారి తీసుకొచ్చిన విపత్తును బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు కేంద్ర మంత్రి. ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు. కరోనా వల్ల కలిగిన కష్టాల నుంచి అన్ని రంగాలను రక్షించేందుకు ఇప్పటికే రెండు మూడు మినీ బడ్జెట్లను అమలు చేశామని గుర్తు చేశారు కరోనా వ్యాక్సినేషన్ల గురించి కూడా ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కోసం ’ఆత్మ నిర్భర్ యోజన‘ ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇందు కోసం 61,180 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తున్నామని తెలిపారు. ఆరేళ్ల ఇంత మొత్తాన్ని ఈ పథకం కోసం ఖర్చు పెడతామన్నారు.
భారత్ లో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తున్నామన్నారు నిర్మలా సీతారామన్. మరో రెండు వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. మన శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్లు కేవలం మన కోసమే కాకుండా దాదాపు వంద దేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు నిర్మలా. ఇది అంతర్జాతియంగా భారత్ ఖ్యాతిని పెంచుతోందని తెలిపారు. మొదటిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్.