30 నిమిషాల్లో నాగోల్ టు జూబ్లీహిల్స్ ! గుండె తరలింపునకు మెట్రో గ్రీన్ చానెల్ 

హైదరాబాద్‌ మెట్రోలో  కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గుండె మార్పిడి కోసం ఫస్ట్ టైమ్ ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి.. నాగోల్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మెట్రోలో గుండెను తరలించారు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఇదేక్రమంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు తరలించారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో శస్త్ర చికిత్స జరిగింది.   ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి నాగోల్‌కు గుండెను తరలించి.. అక్కడి నుంచి మెట్రోలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు నాన్ స్టాప్‌గా నడిపారు.  30 నిమిషాల్లోపే మెట్రోలో నాగోలు నుంచి జూబ్లీ హిల్స్  చెక్ పోస్టుకు చేరింది గుండె. దీనికి సంబంధించి ముందే సమాచారం అందడంతో మెట్రో అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధమయ్యారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉన్నందున.. రోడ్డుమార్గంలో అంబులెన్స్‌లో గుండెను తరలిస్తే లేట్ అవుతుందని, మెట్రోలో గుండెను తరలించారు. 

నీ ఇంటికే వచ్చి తేల్చుకుంటా !  జగన్ కు చంద్రబాబు వార్నింగ్

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పై దాడితో విజయవాడలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పట్టాభిరామ్ కారులో ఆఫీసుకు వెళుతుండగా కొందరు దుండగులు రాడ్లతో దాడి చేశారు. కారు ధ్వంసం కాగా..  ఈ దాడిలో పట్టాభిరామ్ గాయపడ్డారు. ఈ ఘటనతో పార్టీ అధినేత చంద్రబాబు సహా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి.  దుండగుల దాడిలో ధ్వంసమైన పట్టాభి కారుతో సహా టీడీపీ నేతలు సీఎం జగన్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. తనపై జరిగిన దాడి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పట్టాభి, ఇతర టీడీపీ నేతలు సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వారిని పట్టాభి నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో  టీడీపీ నేతలకు, పోలీసులకు తోపులాట చోటుచేసుకుంది. పట్టాభి ఇంటికి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండడంతో పోలీసు బలగాలను  భారీగా మోహరించారు. దుండగుల దాడిలో గాయపడిన పట్టాభిని పరామర్శించారు చంద్రబాబు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. 'రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నాను. వైసీపీ నేత‌లు గూండాలుగా త‌యారైపోయారు. వారికి క‌ళ్లు నెత్తికెక్కి ఏమైనా చేయగ‌ల‌మ‌ని భావిస్తున్నారు. కొంత మంది క‌లిసి ఓ ప‌థ‌కం కూడా వేశారు. ప‌ట్టాభిపై దాడికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మాధానం చెప్పాలి' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.  'ప్ర‌భుత్వ అవినీతిని ప‌ట్టాభి ప్ర‌శ్నిస్తున్నారు అందుకే ఆయ‌న‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. వైసీపీ నేత‌లు బ‌రి తెగించి దాడులు చేస్తున్నారు. ప‌ట్టాభిని చంపాల‌నే దాడి చేశారు. ఇంత‌కు ముందు కూడా ప‌ట్టాభిపై దాడి జ‌రిగింది. ఇనుప రాడ్లు, ఇత‌ర మార‌ణాయుధాల‌తో దుండ‌గులు వ‌చ్చి దాడి చేశారు. డ్రైవ‌ర్ ను బ‌య‌ట‌కు లాగేశారు. ప‌ట్టాభి బ‌లంగా ఉంటారు కాబ‌ట్టి త‌ట్టుకోగ‌లిగారు. వేరే వార‌యితే త‌ట్టుకోలేక‌పోయే వారు. వైసీపీ నేత‌లు ఏమ‌నుకుంటున్నారు?' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు.  టీడీపీ నేత‌లంద‌రూ వైసీపీ దాడుల‌ను ఎండ‌గ‌డుతున్నారు. దీంతో వైసీపీ నేత‌లు టీడీపీ నేత‌ల‌పై దాడుల‌కు దిగుతున్నారు. ఇది పులివెందుల కాదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవా‌లి' అని చంద్ర‌బాబు నాయుడు హెచ్చరించారు.  ఓ వైపు టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఇక్క‌డ ప‌ట్టాభిపై దాడి చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి అంటే ఇది ప్ర‌జ‌ల‌పై దాడి. ప్ర‌జ‌ల కోసం పోరాడుతోన్న వారిపై దాడులు చేస్తారా? ఎంత మందిని చంపుతారు? చ‌ంపేస్తారా అంద‌ర్నీ? చ‌ంపండి చూస్తాం. ఖ‌బ‌డ్దార్ జాగ్ర‌త్త‌గా ఉండండి' అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.  'మీ బూతు మంత్రులకు చెప్పుకో జ‌గ‌న్.. ఇటువంటివి జ‌రిగితే చూస్తూ ఊరుకోబోము. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎక్క‌డైనా ఇటువంటి దాడులు జ‌రిగాయా?  మా నేత‌లు ఎవ‌రైనా తప్పుగా మాట్లాడితేనే నేను వారిని కంట్రోల్ చేసేవాడిని. గ‌తంలో టీడీపీ నేత‌ల‌పై దాడులు జ‌రిగితే డీజీపీ స‌రైన రీతిలో స్పందిస్తే ఇప్పుడు మ‌ళ్లీ దాడి జ‌రిగేవి కాదు' అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. 'మీకు జీతం ఎవ‌రు ఇస్తున్నారు? జ‌గ‌న్ ఇవ్వ‌ట్లేదు. ప్ర‌జ‌లు క‌డుతోన్న పన్నుల‌తో మీకు జీతం వ‌స్తోంది. మేము ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడుతున్నాం. అటువంటి మాపై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉండే అర్హ‌త జ‌గ‌న్ కు లేదు. వెంట‌నే రాజీనామా చేయాలి' అని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'ఈ రోజు మావాళ్లంద‌రూ క‌లిసి ముఖ్య‌మంత్రి ఇంటికి వెళ్తారు.. ఈ దాడులను క‌ట్టడి చేయాల‌ని ఆయ‌న‌ను అడుగుతారు. ఎందుకిలా దాడులు చేయిస్తున్నార‌ని అడుగుతారు. మా ప్రాణాలు కావాలా? అని అడుగుతారు. ఆ త‌ర్వాత ఆయ‌న స్పంద‌న ఎలా ఉంటుందో చూసి పోరాడ‌తాం' అని చంద్ర‌బాబు అన్నారు.

కండరాల నొప్పి, జ్వరం, తలనొప్పా! కోవిడ్ టీకా పని చేస్తున్నట్టే? 

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోంది. కొన్ని దేశాలు వేగంగా తమ ప్రజలకు టీకా పంపిణి చేస్తున్నాయి. అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుండగానే.. ఆ వ్యాక్సిన్ సమర్ధతపై అనుమానాలు వస్తూనే ఉన్నాయి. కోవిడ్  టీకా తీసుకున్న వారిలో కొందరికి సైడ్ ఎఫెక్టులు రావడం మరింత ఇబ్బందిగా మారింది. కొంతమంది టీకా తీసుకున్న తరువాత చనిపోయారని వార్తలు వచ్చినా.. వారి మరణానికి టీకాకు సంబంధం లేదని వైద్య ఆరోగ్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. కోవిడ్ టీకాపై వస్తున్న వివిధ వార్తలతో గందరగోళ పడుతున్న కొందరు.. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.  కోవిడ్ టీకాపై భిన్నాభిప్రాయాలు వస్తున్న  నేపథ్యంలో యూఎస్ సీడీసీ చీఫ్ డాక్టర్ ఆంటోనీ ఫౌసీ కీలక ప్రకటన చేశారు. టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్ లు వస్తేనే టీకా సమర్ధవంతంగా పనిచేసినట్టుగా భావించవచ్చని ఆంటోనీ ఫౌసీ చెప్పారు. ఏవైనా ప్రభావాలు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ లూ ప్రాణాంతకమేమీ కాదని, అది వ్యాక్సిన్ శరీరంలో పని చేస్తోందనడానికి సంకేతమని ఆయన స్పష్టం చేశారు. ఏ వ్యాధికి టీకాను తీసుకున్నా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ లు సర్వసాధారణమని చెప్పిన డాక్టర్ ఆంటోనీ ఫౌసీ.. ఇవి ఎలాంటివైనా  రెండు నుంచి మూడు రోజుల్లోనే నయమయిపోతాయని వివరించారు.  కరోనా టీకాను తీసుకున్న తరువాత శరీరంలో ఉండే సాధారణ రోగ నిరోధక శక్తి స్పందిస్తుందని, దీని ప్రభావంతో శరీరానికి నొప్పులు, స్వల్పంగా జ్వరం, జలుబు వంటివి రావచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా కండరాల నొప్పులు, తలనొప్పి రావడం, నీరసంగా అనిపిస్తే.. వ్యాక్సిన్ ప్రభావం శరీరంపై చూపిస్తున్నట్టుగానే భావించాలని చెప్పారు. ప్రజలకు ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన అన్ని టీకాలూ కరోనా వైరస్ పై పని చేస్తున్నాయని, వీటిల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేసే టీకా ఏంటన్న విషయం తేలాలంటే సమయం పడుతుందని డాక్టర్ ఆంటోనీ ఫౌసీ వ్యాఖ్యానించారు.  కోవిడ్ టీకాపై సందేహాలు వద్దంటూనే కొన్ని జాగ్రత్తలు చెప్పారు డాక్టర్ ఆంటోనీ ఫౌసీ. వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.  టీకా తీసుకున్న తరువాత జ్వరం వచ్చి, ఐదు రోజులైనా తగ్గకపోయినా, జీర్ణ సమస్యలు రోజుల తరబడి కొనసాగుతున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని యూఎస్ సీడీసీ చీఫ్ సూచించారు. 

రాముడి ఇండియాలో  93, రావణుడి లంకలో  51! పెట్రోల్ రేటుపై  బీజేపీ ఎంపీ సెటైర్లు  

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఇప్ప‌టికే చుక్క‌ల‌నంటుతున్నాయి. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ఇప్పటికే ప్రీమియం బ్రాండ్ పెట్రోల్ రేట్ వంద రూపాయలు దాటేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పెట్రోల్ , డీజిల్ రేట్లు సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నారు. తాజాగా కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో.. పెట్రోల్ రెండున్న ర రూపాయలు, డీజిల్ పై 4 రూపాయలు అదనంగా అగ్రి ఇన్ ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో దేశంలో చమురు ధరలకు ఆకాశామే హద్దు అయ్యేలా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ స్పీడులో పెరిగి పోతుండటంతో  నిత్యావసర వస్తువుల ధరలకు కూడా రెక్కలు వస్తాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.  ఏ విషయంలోనైనా త‌న అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామి తాజాగా చ‌మురు ధ‌ర‌ల‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యంగా స్పందించారు. ప్రస్తుతం భార‌త్, నేపాల్, శ్రీ‌లంక‌లో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను పోల్చుతూ అయన ట్వీట్ చేశారు. "రామ్ ఇండియాలో పెట్రోల్ ధర 93రూపాయ‌లు.. సీత నేపాల్‌లో 53రూపాయ‌లు.. ఇక రావణుని లంకలో 51రూపాయ‌లు" అంటూ సుబ్ర‌మ‌ణ్య‌ స్వామి ఒక ఫోటో కూడా జత చేస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  లోక్‌సభలో 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టిన మర్నాడే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరోవైపు కేంద్ర సర్కార్ మాత్రం  బడ్జెట్‌లో అగ్రి సెస్, డెవలప్‌మెంట్ సెస్ విధించినా.. చమురు ధరలు పెరిగే అవకాశాలు లేవని క్లారిటీ ఇచ్చింది.    

హై సెక్యూరిటీ జోన్ లోనూ రక్షణ లేదు! ఏపీలో గుండాల రాజ్యమన్న చంద్రబాబు 

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఏకగ్రీవ ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరి తెగించిందనే ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడలో మంత్రులు, జడ్జీలు నివాసం ఉండే  అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరగడం  దుమారం రేపుతోంది.  వైసీపీ తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు.    పట్టాభి‌పై వైసీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు.  15మంది చుట్టుముట్టి ఇనుపరాడ్లతో, బండరాళ్లతో కారు ధ్వంసం చేసి పట్టాభిని గాయపర్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో పట్టపగలు పట్టాభిపై దాడి చేయడం వైసీపీ గుండాల రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు చంద్రబాబు.  సీఎం జగన్‌రెడ్డి అండతోనే వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారని  మండిపడ్డారు.  రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనడానికి పట్టాభిపై దాడి ఘటనే సాక్ష్యమన్నారు. గతంలో పట్టాభి కారు ధ్వంసం చేసినవాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. పోలీసుల ఉదాసీనతతో వైసీపీ గుండాల దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయని బాబు ధ్వజమెత్తారు.  పట్టాభిపై దాడిచేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని, పట్టాభికి పూర్తి భద్రత కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

వీఐపీ జోన్ లోనే పట్టాభిపై దాడి! మంత్రి కొడాలి హస్తం ఉందన్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో బీహార్ ను తలదన్నేలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. అటు నిమ్మాడలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు జరగగా.. ఇటు విజయవాడలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి జరిగింది.  ఆయన ఇంటి దగ్గరే దుండగులు దాడి చేశారు. కారు‌ను చుట్టుముట్టి రాడ్‌తో దాడి చేయగా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సెల్‌ఫోన్ కూడా ధ్వసమైంది. మంత్రులు, హైకోర్టులు జడ్జ్‌లు, ప్రముఖులు ఉండే ప్రాంతంలోనే పట్టాభి ఉంటారు. వీఐపీ జోన్ లోనే మారుణాయుధాలతో దాడి చేశారంటే... ఏపీలో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో  ఊహించవచ్చు.    ఉదయం కార్యాలయానికి  వెళుతున్న సమయంలో  దాదాపు 10 మంది కాపుగాసి, ఒక్కసారిగా కారును చుట్టుముట్టి రాడ్లు, కర్రలు, బండరాళ్లతో తనపై దాడి  చేశారని పట్టాభి తెలిపారు. డ్రైవర్‌పై కూడా దాడి చేసినట్లు చెప్పారు. గతంలో కూడా తన వాహనాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారని పట్టాభి గుర్తుచేశారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదని, వాస్తవాలను బయటపెట్టేందుకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్నందుకే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. గత పదిరోజులుగా తనకు బెదిరింపులు వస్తున్నాయన్నాయి పట్టాభి. తనకు రక్షణ కల్పించాలని కోరినా  పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.  తనపై జరిగిన దాడి వెనుక మంత్రి కొడాలి నాని పాత్ర ఉందని పట్టాభి ఆరోపించారు. రాష్ట్రంలో రౌడీయిజం చేస్తూ వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. టీడీపీని అణచివేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు పధకం ప్రకారమే తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. పోలీస్‌ కమిషనర్ లేదా డీజీపీ వచ్చి  దాడిపై సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని  స్పష్టం చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదు.. సీఎం జగన్ అని పట్టాభి తెలిపారు.పట్టాభిపై దుండగులు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వర్‌రావు అక్కడకు చేరుకుని పట్టాభిని పరామర్శించారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి సరెండర్ అయిపోయిందని,ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరుగున్నా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్న అరెస్ట్! ఉత్తరాంధ్రపై కక్ష కట్టారన్న బాబు 

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది.  తాజాగా ఏపీ టీడీపీ చీఫ్  అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు.  సోమవారం అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. నిమ్మాడ వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అచ్చెన్నపై పోలీసులు బెదిరింపు కేసు నమోదు చేశారు. ఏ1గా కింజారపు హరిప్రసాద్, ఏ2గా సురేష్, ఏ3గా అచ్చెన్నాయుడు, ఏ4గా కింజారపు లలితకుమారి పేర్లను చేర్చారు. ఈ కేసులో మొత్తంగా 12 మందిని అరెస్టు చేసినట్లుగా సమాచారం. అచ్చెన్నాయుడు అరెస్టుతో నిమ్మాడలో ఉద్రిక్తత నెలకొంది.   అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే పోటీకి దింపాలని వైసీపీ ప్లాన్ చేసింది. దీంతో అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ చేసి నచ్చజెప్పాలని చూశారు. అయితే అచ్చెన్నాయుడు బెదిరించనట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో అక్కడ వైసీపీ ఇన్‌చార్జ్ దువ్వాడ హల్ చల్ చేశారు. క్రికెట్ బ్యాట్‌లు పట్టుకుని రోడ్లపై భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు నడిచి బీభత్సం సృష్టించారు. అయితే వాళ్లపై ఎలాంటి కేసులు నమోదు అవలేదు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  నిమ్మాడలో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనకు ముందే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం మరింత కాక రేపుతోంది. అసలు నిజంగానే అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారా? ఆయన ఫోన్‌లో ఏం మాట్లాడారన్నది ఒక్కసారి డీజీపీ వింటే తెలుస్తుందని టీడీపీ నేతలు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాల కోసమే టీడీపీ నేతలను అక్రమ కేసులతో అరెస్టులు చేయిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.    అచ్చెన్నాయుడు అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ అరెస్టుపై టీడీపీ అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారని... అందుకే భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో గొడవకు కారణమైన దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమన్నారు చంద్రబాబు.‘‘ఐపీసీలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెడతారా..? అయినా అచ్చెన్నాయుడిపై మీ కసి తీరలేదా..?’’అంటూ తీవ్రస్థాయిలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.   పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్ళిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, అతని అనుచరులపై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చెయ్యలేదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో నియంత జగన్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని లోకేష్ అన్నారు. 

పోలియో చుక్కలకు బదులుగా శానిటైజర్! సిబ్బంది నిర్వాకంతో చిన్నారులకు గండం 

"నిండు జీవితానికి రెండు చుక్కలు" అనే నినాదంతో మనదేశం నుండి పోలియోను తరిమి వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అయితే  ఆదివారం నాడు జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం ముక్కు పచ్చలారని చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. పోలియో చుక్కలను పసిపిల్లలకు ఇవ్వాల్సిన సిబ్బంది దానికి బదులుగా హ్యాండ్ శానిటైజర్ వేయడంతో 12 మంది ఐదేళ్ల లోపు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా కప్పికోప్రి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కొద్దిసేపటికి తమ పొరపాటు గ్రహించిన ఆ సిబ్బంది ఆ పిల్లలను మళ్లీ వెనక్కు రప్పించి.. పోలియో చుక్కలు వేశారు. అయితే అప్పటికే శానిటైజర్ డ్రాప్స్ వేయడంతో.. ఆ చిన్నారులకు వాంతులు అయ్యాయి.  తీవ్ర అసౌకర్యానికి గురికావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని యవత్మాల్ జిల్లా పరిషత్ సీఈవో శ్రీకృష్ణ పంచాల్ తెలిపారు.  పోలియో డ్రాప్స్ వేసిన సమయంలో పీహెచ్‌సీ వద్ద ఒక వైద్యుడు, అంగన్‌వాడీ కార్యకర్త, ఆశా వలంటీర్ ఉన్నారని అయన తెలిపారు. ఈ ఘటనపై తాము విచారణ చేపట్టినట్టు అయన చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చిన్నారుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పల్స్ పోలియో సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. 

శివా శివా అంటూ  పద్మజ కేకలు! వణికిపోయిన సహచర ఖైదీలు 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అక్కా చెల్లెల్ల హత్య కేసులో మదనపల్లె సబ్ జైలులో ఉన్న నిందితురాలు పద్మజ.. తన మూఢ నమ్మకాలతో అక్కడ ఆగమాగం చేస్తోందని తెలుస్తోంది. తన ప్రవర్తనతో ఆమె సహచర ఖైదీలను వణికిస్తుందని జైలు అధికారుల సమాచారం. తనకు కేటాయించిన గదిలో రోజంతా ధ్యానంలోనే గడుపుతున్నారు పద్మజ. ‘నేనే శివుడిని. నన్నే లోపల వేస్తారా?’ అంటూ ఆమె సోమవారం రాత్రి వీరంగమేసిందని చెబుతున్నారు.  శివా, శివా అంటూ పెద్దగా కేకలు వేయడంతో మహిళా బ్యారక్‌లోని తోటి ఖైదీలు భయంతో హడలిపోయారట. రాత్రంతా పద్మజ గట్టిగా కేకలు వేయడంతో ఖైదీలు జాగారం చేయాల్సి వచ్చిందంటున్నారు.  ఇదే జైలులోనే  ఉన్న పురుషోత్తమ నాయుడు మాత్రం హత్యకు గురైన తన కుమార్తెలను తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నట్లు  జైలు అధికారులు తెలిపారు. కుమార్తెల హత్య కేసులో పద్మజ, పురుషోత్తమ నాయుడు ఇద్దరూ సబ్ జైలులోనే ఉన్నారు. వారి మానసిక పరిస్థితి బాగాలేదని వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. విశాఖపట్టణం మానసిక వైద్యశాలకు తరలించాలని సూచించారు. అయితే  అక్కడికి తరలించేందుకు తమకు ఎస్కార్ట్ కావాలంటూ జైలు అధికారులు పోలీసులకు లేఖ రాశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పద్మజ, పురుషోత్తమ నాయుడుల తరలింపు ఆలస్యమవుతోంది.   మదనపల్లె అక్కా చెల్లెల్ల హత్య కేసులో ట్విస్టులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం వైద్యులకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలేఖ్య చెప్పేదని, తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండడంతో ఆమె మాటలు నమ్మామని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం. ఆధ్యాత్మిక పిచ్చిలో పెద్దకూతురు అలేఖ్య , తల్లి పద్మజలు కిరాతకంగా వ్యవహరించారని తెలుస్తోంది. మూఢ భక్తితో కుమార్తెలను డంబెల్‌తో కొట్టి చంపేసిన తల్లి పద్మజ... ఆ తర్వాత చనిపోయిన పెద్ద కుమార్తె అలేఖ్య నాలుకను కోసి తినేసిందని ఆమె భర్త పురుషోత్తం నాయుడు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.

బడ్జెట్ 2021-22తో  ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే! 

ఆర్థికమంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రకటించారు. స్వయం శక్తితో ఎదిగేందుకు ఆత్మనిర్భర్ భారత్‌ను కేంద్రం ప్రకటించింది. ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన, మిషన్ పోషన్ 3.0 కూడా ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం నిర్మలా కీలక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అన్నీ రంగాలకు సమన్యాయం చేస్తూ.. బడ్జెట్ చదివారు. ఆర్థిక మంత్రి ప్రకటనల వల్ల సామాన్యులపై నేరుగానే ప్రభావం పడనుంది. కొన్ని ప్రొడక్టుల ధరలు పెరగనున్నాయి. మరికొన్ని వస్తువలు ధరలు తగ్గనున్నాయి..  ధరలు పెరిగేవి .. -ఎలక్ట్రానిక్ ఐటమ్స్ (ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటివి) - మొబైల్ ఫోన్స్ - చార్జర్లు - రత్నాలు - లెథర్ షూ -  కాబులీ చానా, - పప్పులు - యూరియా - ఆటో స్పెర్ పార్ట్స్ - దిగుమతి చేసుకున్న క్లాత్స్ - వంట నూనే ధరలు తగ్గేవి .. - వెండి -  బంగారం  - ఐరన్ - స్టీల్ - నైలాన్ క్లాత్స్ - కాపర్ ఐటమ్స్ - ఇన్సూరెన్స్ -  షూలు - డ్రై క్లీనింగ్ -  వ్యవసాయ ఉత్పత్తులు  

చీరాలలో ఆమంచి, కరణం మధ్య  "పంచాయితీ"  

ఆంధ్రప్రదేశ్ లో  పంచాయతీ ఎన్నికల హడావిడి పీక్స్ కు చేరుతోంది. ఈ ఎన్నికలలో పొలిటికల్ పార్టీలు కానీ వాటి గుర్తులు కనిపించకపోయినప్పటికీ ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉండడంతో గ్రామాలలో పొలిటికల్ టెన్షన్ మొదలైంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికలలో ఏకగ్రీవాలు కాకూడదని.. తమ పార్టీ అనుచరులు తప్పకుండ నామినేషన్లు వేయాలని చంద్రబాబు సూచిస్తుండగా.. మరో వైపు అధికార వైసీపీలో వర్గ విభేదాలు బయటకు వస్తుండడంతో వైరి వర్గాలు ఇద్దరేసి చొప్పున సర్పంచ్ అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఈ పరిణామంతో గ్రామాలలోని వైసిపి అభిమానులు తీవ్ర గందరగోళానికి గురౌతున్నారు. పంచాయతీ ఎన్నికలలో నిలబడ్డ ఇద్దరు వైసిపి సానుభూతిపరులలో ఎవరికీ ఓటు వేయాలో తేల్చుకోలేక సతమవుతున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీకి వైసీపీలోని రెండు వర్గాలు పోటీపోటీగా నామినేషన్లు దాఖలు చేసాయి. ఇక్కడ వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు పోటీపోటీగా నామినేషన్లు వేసి స్థానికంగా పొలిటికల్ హీట్ పెంచేశారు. అంతేకాకుండా సర్పంచ్ స్థానంతోపాటు వార్డు మెంబర్ స్తానాలకు కూడా విపరీతంగా నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో నామినేషన్ల్ ఉపసంహరణ తేదీ అయిన ఫిబ్రవరి 4న ఎవరు నామినేషన్లు వెనక్కి తీసుకుంటారు..? ఎవరు ఎన్నికల బరిలో నిలుస్తారు? అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కేంద్ర బడ్జెట్ లోని టాప్ అంశాలు ఇవే! 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-2022 బడ్జెట్‌ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. తొలిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ తెచ్చారు. ఓ టాబ్లెట్ కంప్యూటర్‌ని బడ్జెట్ ప్రసంగం కోసం వాడారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఆ టాబ్లెట్ కంప్యూటర్ తయారైనది మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌తోనే. దీంతో  ఆమె ఆత్మ నిర్భర భారత్‌కి అలా చిన్న సపోర్ట్ ఇచ్చారు. బడ్జెట్ లో భారతీయ రైల్వేలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి.  రైల్వే రంగానికి 1.15 లక్షల కోట్లు కేటాయించడంతోపాటుగా.. భారత నూతన జాతీయ రైల్వే ప్లాన్ 2030ని ప్రకటించారు. సరసమైన హౌసింగ్‌ లోన్‌పై కీలక ప్రకటన చేశారు. మార్చి 31, 2022 వరకూ సరసమైన గృహ రుణాలు తీసుకునేవారికి... అదనంగా మరో రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.  2021- 22 కేంద్ర బడ్జెట్ లోని ముఖ్యాంశాలు - జల జీవన్‌ మిషన్‌కు రూ. 2,87,000 కోట్లు  - కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం రూ. 35,400 కోట్లు -  వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లు  -  రూ. 64,180 కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్‌ యోజన  -మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌ - కొత్తగా బీఎస్‌ఎల్‌-3  ప్రయోగశాలలు 9 ఏర్పాటు - రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు - ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌ -  ఐడీబీఐ, భారత్‌ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌ -2021-22లో పవన్‌ హాన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ - కనీస మద్దతు ధరకు రూ. 1.72 లక్షల కోట్ల వ్యయం - 2020-21లో రైతు సంక్షేమానికి రూ. 75 వేల కోట్లు - రైతు రుణాల లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు - గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు -  విద్యుత్‌ రంగానికి రూ. 3.05 లక్షల కోట్ల కేటాయింపు - ఉజ్వల స్కీమ్‌ కింద మరో 9 కోట్ల మందికి గ్యాస్‌ కనెక్షన్లు -  జమ్మూ కశ్మీర్‌లో నూతనంగా గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు -  సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి రూ.1000 కోట్లు -  బ్యాంక్‌ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ. 1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు - బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు - రూ.2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు - పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు - పన్ను మినహాయింపులు మరో ఏడాది పెంపు - ఇల్లు కట్టుకునే మధ్య తరగతి వర్గానికి మరింత ఊరట -  టాక్స్ ఆడిట్‌ పరిమితి రూ. 10 కోట్లకు పెంపు - కనీసం 120 రోజులు ప్రవాసంలో ఉన్న వారికే వర్తింపు - రాగిపై పన్ను మినహాయింపులు - జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక డ్యాష్‌ బోర్డు - కాటన్‌ పై 10 శాతం అదనపు పన్ను

ఆ నాలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు! బడ్జెట్ లోనూ బీజేపీ ఓట్ల రాజకీయం! 

కోవిడ్ ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు నెలకొన్న సమయంలో కేంద్ర బడ్జెట్ కోసం దేశ ప్రజలంతా అశగా ఎదురు చూశారు. 2021-22 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులను ప్రకటించారు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే బడ్జెట్ కేటాయింపుల్లోనూ రాజకీయ కోణాలు కనిపించాయి. త్వరలో కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో   ఈ నాలుగు రాష్ట్రాలకు బీజేపీ  ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. ఎన్నికలు జరగనున్న ఆ నాలుగు రాష్ట్రాల్లో  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ  నరేంద్ర మోడీ సర్కార్ తీసుకుంది.  అసోం, కేరళ, బెంగాల్‌ లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టు  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు.  బెంగాల్‌లో రూ.25వేల కోట్లతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. అసోంలో రూ.19000 కోట్లు, కేరళలో రూ.65వేల కోట్లతో  జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 2022 జూన్‌ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య ఈస్ట్‌ కోస్ట్‌ సరకు రవాణా కారిడార్‌ ఏర్పాటు కానుంది.   అంతేకాదు 27 సిటీలకు మెట్రో విస్తరణ చేపడతామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా  చెన్నై మెట్రో ఫేజ్-2కు ఏకంగా రూ.63,246 కోట్లు కేటాయించారు. కొచ్చి మెట్రో ఫేజ్-2కు రూ.1,957 కోట్లు అలాట్ చేశారు. ఈ కేటాయింపులపైనే రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు జరగనుండటంతో ఓట్ల కోసమే చెన్నై మెట్రోకు  63 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి.    

ఎస్‌ఈసీ ఆఫీసుకు ద్వివేది, గిరిజా శంకర్ పరుగులు ! ఆన్ లైన్ నామినేషన్లపై నిమ్మగడ్డకు వివరణ 

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో దూకుడుగా ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఏపీ సర్కార్ కు చుక్కలు చూపిస్తున్నారు. తమ ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలకు దిగుతున్నారు. దీంతో ఇంతకాలం ప్రభుత్వం కనుసన్నల్లో నిమ్మగడ్డ ఆదేశాలను లైట్ తీసుకున్న అధికారుల గుండెళ్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా మరో ఏపీ సర్కార్ కు మరో షాకిచ్చారు ఎస్ఈసీ నిమ్మగడ్డ.  గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్‌ పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా ఎందుకు స్వీకరించలేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పంచాయతీరాజ్ ‌శాఖను నిలదీశారు. ఈ వ్యవహారంపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఈరోజు ఉదయం హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు  ఎస్‌ఈసీ కార్యాలయానికి హడావిడిగా చేరుకున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్లను ఆన్ లైన్ లో స్వీకరించే విషయంపై ఎస్ఈసి ని కలిసి వివరణ ఇవ్వనున్నారు. గత మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కొందరు అభ్యర్థుల నామినేషన్ల పత్రాలు చించివేయడం, అలాగే నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను అడ్డుకోవడం వంటి ఘటనలు జరగడంతో పలు రాజకీయ పార్టీలు ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లను స్వీకరించాలని అప్పట్లో ఎస్‌ఈసీని అభ్యర్థించాయి. దీంతో ఇక నుండి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని పంచాయతీరాజ్‌శాఖను ఎస్‌ఈసీ ఆదేశించారు. అయినా పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ నామినేషన్లను మాత్రం ఆన్ లైన్ ద్వారా కాకుండా వ్యక్తిగతంగానే స్వీకరించారు. అయితే ఈ ప్రక్రియలో కూడా పలు గ్రామాల్లో అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్న వ్యవహారం పై మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. మరోపక్క పలు పొలిటికల్ పార్టీలు గతంలోనే తాము ఆన్‌లైన్‌ నామినేషన్ల ప్రక్రియ పై చేసిన అభ్యర్ధన గురించి ఎస్‌ఈసీకి మరోసారి గుర్తుచేశాయి. దీంతో ఎన్నికల సంఘం స్పందించి.. ఉన్నతాధికారులు ద్వివేది, గిరిజా శంకర్‌కు నోటీసులిచ్చింది. 

ఆరోగ్య రంగానికి బడ్జెట్ లో పెద్ద పీట! కరోనా విపత్తు పాఠాలు నేర్పిందన్న నిర్మల 

అందరూ ఊహించినట్లే బడ్జెట్‌లో ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేసింది. కొవిడ్‌ మహమ్మారి నేర్పిన పాఠాలతో  ఈ రంగానికి  కేటాయింపులను గతంలో కన్నా భారీగా పెంచింది. ఆత్మనిర్బర్‌ ఆరోగ్య పథకానికి మొత్తం రూ.2,23,846 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో  తెలిపారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ఈ పథకం రూపొందించినట్టు వివరించారు. 9 బీఎస్‌ఎల్‌-3 స్థాయి ప్రయోగశాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  కరోనా మహమ్మారి తీసుకొచ్చిన విపత్తును  బడ్జెట్ ప్రసంగంలో  ప్రస్తావించారు కేంద్ర మంత్రి. ఇలాంటి విపత్కర పరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించలేదన్నారు. కరోనా వల్ల కలిగిన కష్టాల నుంచి అన్ని రంగాలను రక్షించేందుకు ఇప్పటికే రెండు మూడు మినీ బడ్జెట్లను అమలు చేశామని గుర్తు చేశారు కరోనా వ్యాక్సినేషన్ల గురించి కూడా ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కోసం ’ఆత్మ నిర్భర్ యోజన‘ ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఇందు కోసం  61,180 కోట్ల రూపాయల నిధిని కేటాయిస్తున్నామని తెలిపారు. ఆరేళ్ల ఇంత మొత్తాన్ని ఈ పథకం కోసం ఖర్చు పెడతామన్నారు.  భారత్ లో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందిస్తున్నామన్నారు నిర్మలా సీతారామన్.  మరో రెండు వ్యాక్సిన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. మన శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్లు కేవలం మన కోసమే కాకుండా దాదాపు వంద దేశాలకు సరఫరా చేస్తున్నామన్నారు నిర్మలా. ఇది అంతర్జాతియంగా భారత్ ఖ్యాతిని పెంచుతోందని తెలిపారు. మొదటిసారిగా పేపర్ లెస్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్.  

రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ! తొలిసారి రూ. 1.20 లక్షల కోట్ల మార్క్

కరోనాతో కుదైలేన దేశ ఆర్థిక రంగం మళ్లీ గాడిలో పడుతోంది. జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. లాక్ డౌన్ తరువాత జనవరిలో వస్తువు సేవల పన్ను జీఎస్టీ (గూడ్స్ సర్వీస్ టాక్స్) వసూల్ రికార్డ్ స్థాయిలో పెరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం గత డిసెంబర్ లో వసూలైన 1.15 లక్షల కోట్ల రికార్డును అధిగమించి,  జనవరిలో 1.19 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ వసూల్ దాటింది. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత తొలిసారిగా పన్ను వసూలు దాదాపు 1.20 లక్షల కోట్ల మార్క్ ను తాకిందని ఆర్థిక శాఖ ప్రకటించింది.    జనవరి 31, సాయంత్రం 6 గంటల వరకూ స్థూల జీఎస్టీ ఆదాయం రూ. 1,19,847 కోట్లు కాగా. ఇందులో సీజీఎస్టీ రూ. 21,923 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 29,014 కోట్లు. ఇదే సమయంలో ఐజీఎస్టీ రూ. 60,288 కోట్లుగా ఉందని, ఇతర పన్నుల రూపంలో రూ. 8,622 కోట్లు వసూలైందని కేంద్రం వెల్లడించింది.   కరోనా  మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ శ్రీహరి కోట రాకెట్ లా దూసుకుపోతుందని , అందుకు పెరిగిన  పన్ను వసూళ్లే  నిదర్శనమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.       కరోనా లాక్ డౌన్ సడలింపు తరువాత అక్టోబర్ లో  లక్ష కోట్లను తాకిన జీఎస్టీ వసూళ్లు, నవంబర్, డిసెంబర్ లతో పాటు జనవరిలోనూ అదే ఊపును కొనసాగించింది . దీంతో వరుసగా నాలుగు నెలల పాటు లక్ష కోట్లకు పైగా పన్ను వసూళ్లు జరిగినట్లయింది. 

కృష్ణా జిల్లాలో  వైసీపీకి ఊహించని షాక్!  ముఖ్య నేత ఇంట్లో కస్టమ్స్ తనిఖీలు

పంచాయతీ ఎన్నికల వేళ కృష్ణా జిల్లాలో  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ఊహించని షాక్ తగిలింది. బడా వ్యాపారిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో కస్టమ్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరులపాడు మండలం వైసీపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నాల్లో ఉన్న పూల రాంబాబు నివాసంలో.. తెలంగాణ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండటం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది.  కృష్ణాజిల్లా వీరులపాడు మండలం, జుజ్జూరు గ్రామానికి చెందిన పూల రాంబాబు ఇంట్లో తెల్లవారుజాము నుంచి తెలంగాణ కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులుండటంతో పాటు ట్సాక్స్ ఎగవేత ఆరోపణలపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పూల రాంబాబుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో పలు పరిశ్రమలున్నట్లు తెలుస్తోంది. ఆ పరిశ్రమలకు సంబంధించిన పన్నులు, ఆదాయానికి సంబంధించిన అవకతవకలను గుర్తించినట్లు సమాచారం. పూల రాంబాబుపై ఎప్పటి నుంచో నిఘా ఉంచిన కస్టమ్స్ అధికారులు.., వారం రోజులుగా జుజ్జూరు గ్రామంలో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. రాంబాబుకు వివిధ రూపాల్లో నెలకు రూ.7కోట్ల వరకు వడ్డీ వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కంపెనీల్లో షేర్లతో పాటు సొంతగా మరికొన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేసినట్లు సమాచారం.  వీరులపాడు మండలంలో పూల రాంబాబు అధికార వైసీపీకి కీలకనేతగా ఉన్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున మండల వ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల ఏకగ్రీవాలు, ఎలక్షన్ ఫండ్స్ విషయంలో ఈయనే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పూల రాంబాబు ఇంట్లో కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.

భార్య భర్తను చంపినా..  ఆమెకు ఫించన్ ఇచ్చి తీరాల్సిందే..  హైకోర్టు సంచలన తీర్పు   

సాక్షాత్తు కట్టుకున్న భర్తను హత్య చేసినా.. లేక భర్త మరణానంతరం ఆమె రెండో వివాహం చేసుకున్నా.. ఆ భార్య ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే అవుతుంది అని పంజాబ్‌, హరియాణా హైకోర్టు ఒక సంచలన తీర్పు చెప్పింది. హర్యానాలోని అంబాలా తర్సెమ్‌ సింగ్‌, బల్జీత్‌ కౌర్‌ దంపతులు సొంత ఊరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన తర్సెమ్‌ సింగ్‌ 2008లో మృతిచెందారు. అయితే ఆయనను భార్య బల్జీత్ కౌర్ చంపారంటూ 2009లో ఆమెపై కేసు నమోదైంది. అంతేకాకుండా 2011లో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. మరోపక్క భర్త మృతిచెందినప్పటి నుండి 2011 వరకు బల్జీత్‌ కౌర్‌ ఫ్యామిలీ పెన్షన్‌ను పొందారు. అయితే భర్తను హత్యచేసిందని కోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం వెంటనే ఆమెకు ఇస్తున్న పెన్షన్‌ను నిలిపివేసింది. దీంతో ఈ వ్యవహారంపై ఆమె పంజాబ్‌, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జనవరి 25న విచారించిన ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. "భర్తను హత్యచేసిందనే కారణంతో ఫ్యామిలీ పెన్షన్‌కు భార్యను దూరం చేయరాదు. ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమే ఫ్యామిలీ పెన్షన్‌. అందువల్ల భార్య క్రిమినల్‌ కేసులో దోషిగా తేలినా సరే ఫ్యామిలీ పెన్షన్‌కు ఆమె అర్హురాలే అవుతుంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా బల్జీత్ కౌర్ ‌కు ఫ్యామిలీ పెన్షన్‌ను నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును కోర్టు కొట్టివేసింది. ఆమెకు 2011 నుండి రావాల్సిన బకాయిలను రెండు నెలల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భర్త మరణానంతరం ఫ్యామిలీ ఫించన్ కు భార్యే హక్కుదారంటూ 1972 నాటి ఫించన్ చట్టం ప్రకారం కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేసింది! జగన్ రెడ్డికి ఛీర్స్ చెప్పాల్సిందే 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుకున్నది సాధించారు.. అవునండి బాబూ ఏపీకి ఆయన స్పెషల్ స్టేటస్ తెచ్చేశారు. గత ఏడేండ్లుగా ఏపీలో స్పెషల్ స్టేటస్ నినాదం మార్మోగుతుండగా.. నేనున్నాంటూ  ఆ స్పెషల్ స్టేటస్ ను ఆంధ్రాకు వచ్చేలా చేశారు జగన్ రెడ్డి. ఏపీకి స్పెషల్ స్టేటస్ వచ్చేలా చేసిన సీఎం జగన్ రెడ్డి.. ఇప్పుడు ఆంధ్రా జనమంతా ఛీర్స్ కొడుతున్నారు.   స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. విభజనతో కుదైలేన ఏపీ నిలదొక్కుకోవాలంటే ఇదే ప్రధానమని సగటు అంధ్రుడి మాట. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఈ నినాదం వినిపిస్తూనే ఉంది.  ఏపీ రాజకీయాలన్ని కూడా స్పెషల్ స్టేటస్ చుట్టే తిరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ వైసీపీ ఉద్యమాలు చేసింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేసింది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో ప్రత్యేక హోదా నినాదాన్ని టీడీపీ ఎక్కువగా వినిపిస్తోంది. స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కేంద్రంతో పోరాడటం లేదని వైసీపీని విమర్శిస్తోంది.  అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు ఆ స్పెషల్ స్టేటస్ వచ్చేసింది. అవును మీరు విన్నది నిజమే. ఏపీకి స్పెషల్ స్టేటస్ లిక్కర్ బ్రాండ్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ స్టేటస్  పేరుతో లిక్కర్ బాటిల్ విక్రయాలు జరుపుతున్నట్టు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. Special Status పేరు ఉన్న క్వార్టర్ బాటిల్‌ ప్రస్తుతం అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌గా మారింది. ఈ క్వార్టర్ బాటిల్ విస్కీ ధర రూ.180 అని ఉంది. దానిపై తెలుగులో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మద్యం సేవించి వాహనం నడపరాదు.’ అని రాసి ఉంది.  ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ శాఖ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం ఉత్తరాంధ్రలో స్పెషల్ స్టేటస్ బ్రాండ్ ను విక్రయిస్తున్నట్లు తెలిసింది.ఈ స్పెషల్ స్టేటస్ లిక్కర్ బాటిల్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై కామెడీ చేస్తున్నారు నెటిజన్లు. జగన్ మోహన్ రెడ్డి ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇలా తీసుకొస్తారని అనుకోలేదంటూ కొందరు టీడీపీ అనుకూల నెటిజన్లు, సోషల్ మీడియా జనం ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోను వాడుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఏపీకి స్టెటస్ స్టేటస్ తీసుకొచ్చిన జగన్ రెడ్డికి ఛీర్స్ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా ఏపీలో ఇలాంటి ఘటన జరిగింది. ప్రెసిడెంట్ మెడల్ పేరుతో లిక్కర్ బాటిల్‌ను తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవడంతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆబ్కారీ శాఖ ప్రకటించింది.  తమను గెలిపిస్తే  కేంద్రం మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.  తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్పారు. ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన స్పెషల్ స్టేటస్ అంశాన్ని లేవనెత్తిన తర్వాత రోజే స్పెషల్ స్టేటస్ పేరుతో లిక్కర్ బాటిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ నేతలు చెప్పినట్లు స్పెషల్ స్టేటస్ తెచ్చారంటూ టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.