ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్న అరెస్ట్! ఉత్తరాంధ్రపై కక్ష కట్టారన్న బాబు
posted on Feb 2, 2021 @ 10:04AM
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అచ్చెన్నపై పోలీసులు బెదిరింపు కేసు నమోదు చేశారు. ఏ1గా కింజారపు హరిప్రసాద్, ఏ2గా సురేష్, ఏ3గా అచ్చెన్నాయుడు, ఏ4గా కింజారపు లలితకుమారి పేర్లను చేర్చారు. ఈ కేసులో మొత్తంగా 12 మందిని అరెస్టు చేసినట్లుగా సమాచారం. అచ్చెన్నాయుడు అరెస్టుతో నిమ్మాడలో ఉద్రిక్తత నెలకొంది.
అచ్చెన్నాయుడు సొంత ఊరైన నిమ్మాడలో ఆయన భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. అయితే ఆయన బంధువునే పోటీకి దింపాలని వైసీపీ ప్లాన్ చేసింది. దీంతో అచ్చెన్నాయుడు ఆ బంధువుకు ఫోన్ చేసి నచ్చజెప్పాలని చూశారు. అయితే అచ్చెన్నాయుడు బెదిరించనట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో అక్కడ వైసీపీ ఇన్‌చార్జ్ దువ్వాడ హల్ చల్ చేశారు. క్రికెట్ బ్యాట్‌లు పట్టుకుని రోడ్లపై భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు నడిచి బీభత్సం సృష్టించారు. అయితే వాళ్లపై ఎలాంటి కేసులు నమోదు అవలేదు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిమ్మాడలో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనకు ముందే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం మరింత కాక రేపుతోంది. అసలు నిజంగానే అచ్చెన్నాయుడు బెదిరింపులకు పాల్పడ్డారా? ఆయన ఫోన్‌లో ఏం మాట్లాడారన్నది ఒక్కసారి డీజీపీ వింటే తెలుస్తుందని టీడీపీ నేతలు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాల కోసమే టీడీపీ నేతలను అక్రమ కేసులతో అరెస్టులు చేయిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అచ్చెన్నాయుడు అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ అరెస్టుపై టీడీపీ అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జగన్ రెడ్డి కక్ష సాధింపునకు పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారని... అందుకే భయోత్పాతం సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో గొడవకు కారణమైన దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమన్నారు చంద్రబాబు.‘‘ఐపీసీలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెడతారా..? అయినా అచ్చెన్నాయుడిపై మీ కసి తీరలేదా..?’’అంటూ తీవ్రస్థాయిలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే జగన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటిపైకి రాడ్లు, కత్తులతో దాడికి వెళ్ళిన వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, అతని అనుచరులపై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చెయ్యలేదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా పంచాయతీ ఎన్నికల్లో నియంత జగన్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని లోకేష్ అన్నారు.