శివా శివా అంటూ పద్మజ కేకలు! వణికిపోయిన సహచర ఖైదీలు
posted on Feb 2, 2021 9:25AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అక్కా చెల్లెల్ల హత్య కేసులో మదనపల్లె సబ్ జైలులో ఉన్న నిందితురాలు పద్మజ.. తన మూఢ నమ్మకాలతో అక్కడ ఆగమాగం చేస్తోందని తెలుస్తోంది. తన ప్రవర్తనతో ఆమె సహచర ఖైదీలను వణికిస్తుందని జైలు అధికారుల సమాచారం. తనకు కేటాయించిన గదిలో రోజంతా ధ్యానంలోనే గడుపుతున్నారు పద్మజ. ‘నేనే శివుడిని. నన్నే లోపల వేస్తారా?’ అంటూ ఆమె సోమవారం రాత్రి వీరంగమేసిందని చెబుతున్నారు. శివా, శివా అంటూ పెద్దగా కేకలు వేయడంతో మహిళా బ్యారక్‌లోని తోటి ఖైదీలు భయంతో హడలిపోయారట. రాత్రంతా పద్మజ గట్టిగా కేకలు వేయడంతో ఖైదీలు జాగారం చేయాల్సి వచ్చిందంటున్నారు. ఇదే జైలులోనే ఉన్న పురుషోత్తమ నాయుడు మాత్రం హత్యకు గురైన తన కుమార్తెలను తలచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
కుమార్తెల హత్య కేసులో పద్మజ, పురుషోత్తమ నాయుడు ఇద్దరూ సబ్ జైలులోనే ఉన్నారు. వారి మానసిక పరిస్థితి బాగాలేదని వైద్యులు ఇప్పటికే నిర్ధారించారు. విశాఖపట్టణం మానసిక వైద్యశాలకు తరలించాలని సూచించారు. అయితే అక్కడికి తరలించేందుకు తమకు ఎస్కార్ట్ కావాలంటూ జైలు అధికారులు పోలీసులకు లేఖ రాశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పద్మజ, పురుషోత్తమ నాయుడుల తరలింపు ఆలస్యమవుతోంది.
మదనపల్లె అక్కా చెల్లెల్ల హత్య కేసులో ట్విస్టులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం వైద్యులకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలేఖ్య చెప్పేదని, తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండడంతో ఆమె మాటలు నమ్మామని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం. ఆధ్యాత్మిక పిచ్చిలో పెద్దకూతురు అలేఖ్య , తల్లి పద్మజలు కిరాతకంగా వ్యవహరించారని తెలుస్తోంది. మూఢ భక్తితో కుమార్తెలను డంబెల్‌తో కొట్టి చంపేసిన తల్లి పద్మజ... ఆ తర్వాత చనిపోయిన పెద్ద కుమార్తె అలేఖ్య నాలుకను కోసి తినేసిందని ఆమె భర్త పురుషోత్తం నాయుడు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది.