అంగట్లో ఆంధ్రుల హక్కు! ఉద్యమాల ఉక్కుకు దిక్కెవరు?
విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు.. ఇది 1963లో ఏపీలో మార్మోగిన నినాదం. ఆంధ్రా జనాలు ఏకమై వినిపించిన గళం. ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో 32 మంది ప్రాణ త్యాగం చేశారు. అంధ్రా ప్రజల ఉక్కు సంకల్పానికి దిగొచ్చింది అప్పటి కేంద్ర సర్కార్. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించింది. అది ఇంతింతై వటుండింతై అన్నట్లుగా ఎదిగి.. రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, నవరత్న కర్మాగారంగా నిలిచింది. విశాఖ పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది స్టీల్ ప్లాంటే. అంతగా విశాఖతో పెనవేసుకుపోయింది ఉక్కు కర్మాగారం. ఇప్పుడు 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు.
ఆ రోజుల్లో దేశంలో అప్పటికే 4 ఉక్కు కర్మాగారాలున్నాయి. 1963లో తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. నిపుణులు అధ్యయనం చేసి విశాఖపట్నం మేలని తేల్చారు. ఆ తర్వాతే రాజకీయం మొదలైంది. ఉక్కు కర్మాగారాన్ని తమ ప్రాంతాలకు తరలించుకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నించాయి. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అవకాశం ఆఖరు నిమిషంలో చేజారే దుస్థితి తలెత్తింది. దీనిపై తొలుత చిన్నపాటి ఆందోళనలే జరిగాయి. గుంటూరుకు చెందిన తమనంపల్లి అమృతరావు అనే వ్యక్తి గుంటూరు నుంచి వచ్చి విశాఖ కలెక్టర్ కార్యాలయం ముందు నిరాహారదీక్షకు దిగారు. ఈ పరిణామంతో ఉద్యమంలో కదలిక వచ్చింది. విశాఖపట్నంలో పోరాటం ఊపందుకుంది. 1966లో తెన్నేటి విశ్వనాథం అధ్యక్షతన అఖిలపక్ష సంఘం ఏర్పడింది. ఓ వైపు అమృతరావు నిరాహార దీక్ష... మరోవైపు అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్రమైన ఆందోళనలు కొనసాగాయి.
ఉక్కు ఉద్యమం తిరుపతి, విజయవాడ సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కోసం యువకులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు. కొన్నిచోట్ల పోలీసుస్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడం, రైల్‌రోకోలు, రాస్తారోకోలకు దిగడం తదితర కార్యక్రమాలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హింసాత్మక ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. విశాఖ ఉక్కు కోసం జరిగిన ఆందోళనల్లో మొత్తం 32 మంది మృత్యువాత పడినట్లు అధికారికంగా తేల్చారు.అప్పటి రాష్ట్రప్రభుత్వం ఉద్యమాన్ని ఎంతగా కట్టడి చేయాలని ప్రయత్నించినా ఫలించలేదు.
ప్రజల పోరాటానికి ప్రజాప్రతినిధులు బాసటగా నిలిచారు. కొందరు తమ శాసనసభ సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యతాలకు రాజీనామా లేఖలు ఇచ్చేశారు. మరోపక్క నిరాహారదీక్షలో కూర్చున్న అమృతరావు ఆరోగ్యం క్షీణించింది. ఆయన మరణించే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు తేల్చారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి.. ప్రధాని ఇందిరాగాంధీకి అదే విషయాన్ని చెప్పారు. చివరకు ఆమె విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ అధికారిక లేఖను అందించారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆ లేఖను తీసుకుని 1966 నవంబరు 3న విశాఖ వచ్చారు. ఆ లేఖను అందరికీ చూపి అమృతరావుతో దీక్ష విరమింపజేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనులు మొదలు పెట్టకపోవడంతో మళ్లీ అలజడి రేగింది. దీంతో ప్రధాని ఇందిరాగాంధీ 1971 జనవరి 20న విశాఖ వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఫ్యాక్టరీ కోసం 64 గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల భూమి సేకరించారు. కర్మాగారం నిర్మాణానికి 20 ఏండ్లు పట్టింది. 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా విశాఖ స్టీల్ ప్లాంట్ జాతికి అంకితమైంది.
ఆంధ్రుల పోరాటంతో ఏర్పాటయిన విశాఖ ఉక్కులో నూటికి నూరుశాతం కేంద్రం పెట్టుబడులు ఉన్నాయి. ఏటా 6.3 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఈ పరిశ్రమ సొంతం. ఉత్పత్తి సామర్థ్యం 63 లక్షల టన్నులు. అయితే 2017 నుంచి విశాఖ ఉక్కు భారీ నష్టాలతో నడుస్తోంది. ఇదే సాకుగా చూపి ప్రైవేట్ పరం చేస్తోంది కేంద్ర సర్కార్. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ముడి ఇనుమును మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దాంతో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటోంది. ముడి ఇనుము, కోకింగ్ కోల్, డోలమైట్ వంటి ముడి సరకుల ధరలు పెరగడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. దీంతో ఉత్పత్తి తగ్గించుకోవలసి వచ్చింది. ఇదే నష్టాలకు అసలు కారణమని గతంలోనే నిపుణులు నివేదికలు ఇచ్చారు. ఇవేమి పట్టించుకోకుండా ప్రైవేట్ కు ఇచ్చేందుకు సిద్దమైంది కేంద్రం. కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నా కరికరం చూపకుండా తాము అనుకున్నది చేసేస్తోంది.
కేంద్ర సర్కార్ నిర్ణయంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఇక అంధ్రుడికి గతమే అయ్యేలా ఉంది. ఆంధ్రుల హక్కును కేంద్ర సర్కార్ హరిస్తున్నా.. జగన్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్ర పోతోంది. దీంతో ఉద్యమాల ఉక్కుకు దిక్కెవరని ఏపీ జనాలు ఆవేదం చెందుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండటంపై మండిపోతున్నారు. కర్మాగారం భూముల విలువ రూ.లక్ష కోట్లకు పైనే. అంతటి విలువైన భూమిని ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రశ్నించలేకపోతోందని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తోంది.
గత డిసెంబరులో స్టీల్ రేట్లు పెరగడంతో మంచి అమ్మకాలు జరిగాయి. ఒక్క డిసెంబరులోనే రూ.2,200 కోట్లు విక్రయాలు చేసి, రూ.200 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే ధరలు కొనసాగితే రెండేళ్లలో లాభాల బాటలోకి వస్తుందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం స్టీల్‌కు డిమాండ్ పెరిగింది. టన్ను టోకున రూ.50 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. గత డిసెంబరులో రూ.200 కోట్ల నికర లాభం వచ్చింది. సమీప భవిష్యత్తులోను ఇదే ఒరవడి కొనసాగుతుందని, అమ్మకాలు బాగుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్క రెండేళ్లు మార్కెట్ బాగుంటే నష్టాలను రికవరీ చేసి మళ్లీ లాభాల బాటలోకి వస్తామని, ప్రైవేటీకరణ చేయవద్దని, వాటాలు విక్రయించవద్దని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ కర్మాగారానికి గనులు కేటాయిస్తే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేలాది మంది సామాన్య, మధ్యతరగతి వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్న భారీ ప్రభుత్వరంగ సంస్థల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.