ఆ నాలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు! బడ్జెట్ లోనూ బీజేపీ ఓట్ల రాజకీయం!
posted on Feb 1, 2021 @ 1:28PM
కోవిడ్ ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు నెలకొన్న సమయంలో కేంద్ర బడ్జెట్ కోసం దేశ ప్రజలంతా అశగా ఎదురు చూశారు. 2021-22 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులను ప్రకటించారు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే బడ్జెట్ కేటాయింపుల్లోనూ రాజకీయ కోణాలు కనిపించాయి. త్వరలో కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నాలుగు రాష్ట్రాలకు బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించింది. ఎన్నికలు జరగనున్న ఆ నాలుగు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ నరేంద్ర మోడీ సర్కార్ తీసుకుంది.
అసోం, కేరళ, బెంగాల్ లో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. బెంగాల్‌లో రూ.25వేల కోట్లతో 675 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు అభివృద్ధి చేయనున్నారు. అసోంలో రూ.19000 కోట్లు, కేరళలో రూ.65వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. ఖరగ్‌పూర్-విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ సరకు రవాణా కారిడార్ ఏర్పాటు కానుంది.
అంతేకాదు 27 సిటీలకు మెట్రో విస్తరణ చేపడతామని ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా చెన్నై మెట్రో ఫేజ్-2కు ఏకంగా రూ.63,246 కోట్లు కేటాయించారు. కొచ్చి మెట్రో ఫేజ్-2కు రూ.1,957 కోట్లు అలాట్ చేశారు. ఈ కేటాయింపులపైనే రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు జరగనుండటంతో ఓట్ల కోసమే చెన్నై మెట్రోకు 63 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారనే ఆరోపణలు విపక్షాల నుంచి వస్తున్నాయి.