ముసుగు మనిషి మాట మార్చాడు!!

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో ఓ ముసుగు వ్యక్తి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. రైతు సంఘాల నేతలను హతమార్చేందుకు కుట్ర పన్నామని శుక్రవారం రాత్రి చెప్పిన అతను.. గంటల వ్యవధిలోనే మాట మార్చాడు.   శుక్రవారం రాత్రి సింఘు సరిహద్దు వద్ద రైతులు ఓ వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. రిపబ్లిక్ డే రోజు రైతులు తలపెట్టిన ర్యాలీని చెదరగొట్టాలని, తన అనుచరులతో కలిసి పోలీసుల మాదిరిగా నటిస్తూ రైతులపై లాఠీచార్జి జరపాలని నిర్ణయించిన్నట్టు అతడు మీడియాతో చెప్పాడు. అలాగే, రైతుల్లో నలుగురు రైతులను చంపి, ఆందోళన చెడగొట్టేందుకు కుట్ర పన్నినట్టు పేర్కొన్నాడు. ఇందులో పోలీసులకు భాగస్వామ్యం కూడా ఉందని చెప్పాడు. ఓ పోలీసు అధికారే తమను ఈ పనికి పురమాయించాడని, రైతు నేతల ఫొటోలు కూడా ఇచ్చాడని నిందితుడు తెలిపాడు. తన పేరు ప్రదీప్ అని, రైతుల నిరసనకు అంతరాయం కలిగిస్తే ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఇస్తామని చెప్పారని పేర్కొన్నాడు. కాగా, పట్టుబడిన నిందితుడిని రైతులు పోలీసులకు అప్పగించారు.   రైతు నేతలను చంపేందుకు వచ్చి పట్టుబడ్డానంటూ మీడియా ముందు మాస్కు పెట్టుకుని మాట్లాడిన వ్యక్తి.. కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చి ఓ వీడియోలో అతడు పూర్తి విరుద్ధంగా మాట్లాడాడు. రైతులు ముందుగా రాసిచ్చిన స్క్రిప్టునే తాను మీడియా ముందు చదివానంటూ అతడు చెప్పుకొచ్చాడు. అయితే, ఈ వీడియో అసలైనదా కాదా అనేది పోలీసులు నిర్ధారించలేదు. అతడిని పూర్తిగా విచారించిన తర్వాత తాము మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం హర్యానాలోని సోనిపట్‌ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ యువకుడిని ప్రశ్నిస్తున్నారు. కాగా, సోనిపట్‌కు చెందిన ఆ యువకుడికి ఇంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేదని సమాచారం.

అధ:పాతాళానికి తొక్కేస్తాం.. జగన్ గారూ మీకంత ధైర్యముందా? 

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఒంగోలులో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అన్నా రాంబాబు వల్లే జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తప్పుచేసాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడని ప్రశ్నించారు. గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని అడిగినందుకు.. ఆయనను చంపేశారని అన్నారు. ప్రశ్నించే వారి కుటుంబాలను నాశనం చేయాలనుకుంటే కుదరదని, ఇలాంటి దారుణాలు ఎక్కువైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబుకు పవన్ వార్నింగ్ ఇచ్చారు. అన్నా రాంబాబూ గుర్తుంచుకో.. నిన్ను అధ:పాతాళానికి తొక్కేస్తాం అని హెచ్చరించారు. జగన్ రెడ్డి గారూ మీ ఎమ్మెల్యే చేసిన పనికి ఆయనను శిక్షిస్తారా?.. అంత ధైర్యం మీకుందా? అని ప్రశ్నించారు.   కాగా, ఇటీవల ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సింగరపల్లిలో జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనను దూషించాడని మనస్తాపం చెందిన జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం పారిశుధ్య సమస్యలపై ఎమ్మెల్యే అన్నా రాంబాబును వెంగయ్యనాయుడు నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘‘నువ్వెవుడి రా నాకు చెప్పడానికి.. ఒళ్లు దగ్గర పెట్టుకో.. నన్నే ప్రశ్నిస్తావా?’’ అంటూ అందరి ఎదుట అతనిపై తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన వెంగయ్య నాయుడు ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.   ఈ ఉదయం జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు. వెంగయ్య పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని పవన్ హామీ ఇచ్చారు. అనంతరం ఒంగోలులో ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ ను పవన్ కలిశారు. జనసేన కార్యకర్త వెంగయ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి పవన్ ఫిర్యాదు చేశారు.

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూలు వచ్చేసింది!

ఈ విద్యాసంవత్సరం క్యాలెండర్ ని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. 9,10 తరగతుల వారికి ఫిబ్రవరి 1నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. లాస్ట్ వర్కింగ్ డే మే 26 కాగా.. వేసవి సెలవులు మే 27 నుండి జూన్ 13 వరకు ఉండనున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షలను మే 17 నుండి మే 26 వరకు నిర్వహించనున్నారు.   2020-21 విద్యాసంత్సరానికి మొత్తం 204 పని దినాలు ఉండనున్నాయి. ఫిజికల్ క్లాసులు 89 పనిదినాలు కాగా.. డిజిటల్ తరగతులు 115 రోజులుగా ఉండనున్నాయి. అయితే.. హాజరు శాతం తప్పనిసరి కాదని విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థుల హాజరుపై తల్లి దండ్రుల అనుమతి తప్పని సరి అని పేర్కొంది. ఇక స్కూల్ టైమింగ్స్ విషయానికి వస్తే..  గ్రామీణ, పట్టణాల్లో 9:30 నుండి 4.45 వరకు కాగా.. హైదరాబాద్ లో 8:45 నుండి 4 గంటల వరకు పాఠశాలలు ఉండనున్నాయి.

ప్రాణాలు తీస్తామంటున్న ఉద్యోగ సంఘం నేత! జగన్ రెడ్డి అండతోనే  బరి తెగింపా ?  

అతనో ఉద్యోగ సంఘం నేత. కాని రాజకీయ నేతలను మించిపోయారు. పంచాయతీ ఎన్నికల అంశంలో  రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషన్ నే టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న ఎస్ఈసీపైనే  ఆరోపణలు చేస్తున్నారు. ప్రాణాలు కూడా తీస్తామంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీకి మద్దతుగా ఉంటారనే ఆరోపణలు ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత ..  తాజాగా చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌పై మాట్లాడిన సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కాసర్ల వెంకట్రాంరెడ్డి సంచలన కామెంట్లు చేశారు.  సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు తాము ఎదురుచూస్తామని... అంతవరకు ఎన్నికల సంఘానికి సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ వేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. జీవించే హక్కు,  వాక్సిన్ పొందే హక్కు ఉద్యోగులకు ఉందన్నారు  వెంకటరామిరెడ్డి. అంతేకాదు ప్రాణాపాయం వస్తే ఎదుటివాటి ప్రాణం తీసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీకి ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు చెప్పిందని...అయితే పరిస్థితులు క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉన్నాయన్నారు. పంచాయతీ ఎన్నికలు, ఎస్ఈసీపై కాకర్ల చేసిన కామెంట్లు కలకలం రేపుతున్నాయి.  ప్రాణం తీసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందన్న వెంకట్రామ్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.  సీఎం జగన్ రెడ్డి అండతోనే కాకర్ల బరి తెగించారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల అండ లేకపోతే.. ఎన్నికల కమిషన్ నే టార్గెట్ చేసే ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. కాకర్లపై టీడీపీ సోషల్ మీడియా విభాగం తీవ్రస్థాయిలో స్పందించింది. ఆయన  పోకడలు రోజురోజుకీ శృతిమించుతున్నాయని మండిపడింది. జగన్ రెడ్డి స్కూల్ నుంచి వచ్చిన కాకర్ల.. అవసరం అయితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ట్వీట్ చేసింది. ‘‘ఎవర్ని చంపుతాడు ? నిమ్మగడ్డ గారినా ? హైకోర్టు జస్టిస్‌లనా? సుప్రీం కోర్టు జస్టిస్‌లనా..? అని ప్రశ్నించింది. స్వామి భక్తి చూపడంలో కాకర్ల  పీహెచ్ డీ కూడా పూర్తి చేసినట్లున్నారనే విమర్శలు సామాన్య జనాల నుంచి వస్తున్నాయి.  సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామ్ రెడ్డి ప్రకటనపై ఉద్యోగుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. రాజ్యాంగ బద్ద సంస్థపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరికాదని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో ఎస్ఈసీ ఆదేశం అమలు చేయనందుకు కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. సొంత ఎజెండాతో నిర్ణయాలు తీసుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేయవద్దని ఉద్యోగులు కోరుతున్నారు. ఎవరో  ఒకరికి ప్రయోజనం కలిగేలా మాట్లాడితే.. తర్వాత జరిగే పరిణామాలకు ఎవరూ బాధ్యత వహిస్తారని మరికొందరు ఉద్యోగులు నిలదీస్తున్నారు.    

పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం.. ఏపీఎన్జీవో అధ్యక్షుడు హెచ్చరిక!

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఉద్యోగుల సంఘాలు వ్యతిరేక గళం వినిపిస్తున్నాయి. ఎన్నికలు నిలిపివేయాలని, లేదంటే ఎన్నికల బహిష్కరణకు తాము సిద్దంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాయి. ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని, అవసరమైతే సమ్మెకు కూడా వెళతామని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. తాజాగా దీనిపై ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. కరోనా వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలకు వెళదామని తాము అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎన్నికల సంఘాన్ని వేడుకున్నామని తెలిపారు. అయినప్పటికీ ఎస్ఈసీ ఎంతో మొండిగా వ్యవహరించి నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తాము ఇప్పటికే ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సోమవారం విచారణ ఉందని, ఈలోగానే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఇవేమీ సాధారణ ఎన్నికలు కాదని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.   ఎస్ఈసీ ఎందుకింత పంతానికి పోతున్నారు? ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? అని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలంటే ప్రజలతో మమేకం అవ్వాల్సి ఉంటుంది. కొందరు ఉద్యోగులు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు దుష్పరిణామాలకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు.ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం అని ఎస్ఈసీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు? అయినప్పటికీ మేం భయపడం అని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తే అక్కడ కరోనా వ్యాప్తి అధికమైనట్టు తేలిందని, ఇవేవీ పట్టించుకోకుండా ఎన్నికలు జరపాలని నిర్ణయించుకుంటే.. ఎన్నికలను బాయ్ కాట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

కరోనా మరణాలు పెరగడానికి ఇదే కారణం?

కోవిడ్ 19 లో మత్తువాడకం వల్లే మరణాలు పెరిగాయా? ఐసియు పద్దతులు సరిగా పాటించడం లేదా? అసలు నిజం ఏమిటి. ఒక పరిశోధన మీముందుకు.                            ఐసియు లో ఉన్న కోవిడ్ 19 రోగులకు డెలీరియం మోతాదు ఎక్కువై  కోమాలో ఉన్నట్లు కనుగొన్నారు. దీర్ఘకాలంగా భయపెట్టిన కోవిడ్ రోగులను ఇంకా వెంటాడుతోంది. కోవిడ్ 19 తో  ఆసుపత్రిలో చేరి ఐసియులో చికిత్స పొందుతున్న రోగులలో డెలీరియం ఎక్కువైనందు వల్ల కోమాలోకి చేరినట్లు నిపుణులు అంచనా వేసారు. ఊపిరితిత్తులు పనిచేయకపోవడం ఎక్కువ శాతం మత్తు మందుల వల్లేనని విశ్లేషించారు. దీనికితోడు బంధుమిత్రుల పరామర్శలు, మెదడు సరిగా పనిచేయకపోవడం గమనించినట్లు వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయంగా జరిగిన పరిశోధన అంశాలను లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ పరిశోధకులు వండర్ బిట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ సమన్వయంతో స్పెయిన్ పరిశోధకులతో కలిసి జనవరి 8 న కధనాన్ని ప్రచురించింది. సుదీర్ఘకాలంపాటు జరిగిన పరిశోధనలో డేలీరియం వల్ల జరిగిన పలు సంఘటనలును పరిశోధన బృందం నిశితంగా పరిశీలించింది. ఈ మేరకు 2088 మంది కోవిడ్ 19  రోగులు ఏప్రిల్ 28 కి మందు ఆసుపత్రిలో చేరారని, అందులో 69 మంది పెద్దవాళ్ళే అని, 14 దేశాలలో ఇంటెన్సివ్ కేర్ లో చేరినట్లు తెలుస్తోంది. ఐసియులో ఉన్నప్పుడు ఇచ్చే డెలీరియం అత్యంత ఖరీదుతో కూడుకున్నదని, ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని అన్నారు. ఐసియులో దీర్ఘకాలం పాటు ఉండే వారిలో డిమ్నీషియా వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై వివిఎంసిలో రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేసారని అన్నారు. శరీరం ఆధారంగా క్రిటికల్ కేర్ గైడ్ లైన్స్ ను పలుదేశాలకు మెడికల్ సొసైటీ  ఇచ్చిందని చెప్పారు. సొసైటీ మార్గదర్శకాల ప్రకారం రోగిని పూర్తిగా పరిశీలించిన మీదట  పెయిన్ మేనేజ్ మెంట్ పూర్తి అనాలసిస్ లేదా నిద్ర మాత్రలు ప్రతి రొజూ స్పాంటేనియస్ గా ఇవ్వాలని మత్తు నుండి మేల్కొల్పే ప్రయత్నం చేయాలనీ సత్వరం పంపించడం వ్యాయామం  కుటుంబ సబ్యులతో కలవడం ప్రధానమనవి. ఈ పరిశోధనలో 82 % రోగులు డెలీరియం మీడియన్ 10 రోజులు మాత్రమే ఉన్నారని, 55 % మంది డెలీరియం మీడియన్ మూడురోజులు ఉన్నారని, 12 రోజులు ఆపైన ఉన్నవారికి మెదడు పనిచేయక పోవడం డెలీరియం కోమాకు చేరిన వారు ఉన్నట్టు కనుగొన్నారు. ఇంతకు రెండింతలు నాన్ కోవిడ్ రోగుల్లో ఉన్నారని గమనించారు.  స్పెయిన్ కి చెందిన యునివర్సిటీ ఆఫ్ వాలెన్సియా మల్టీ సైట్ ఐసియుపై పరిశోధన నిర్వహించింది. 5 రోజుల పరిశోధనలో 4 రోజులు కోమా, ఒకరోజు డెలీరియం కోవిడ్ 19 రోగులను పంపడం వల్ల  మెదడు పనిచేయక పోవడం, రోగులపై శ్రద్ధ సంరక్షణ చేపట్టకపోవడం వంటి వాస్తవాలు వెలుగు చూసాయన్నారు. పాండమిక్ సమయంలో రోగులకు చికిత్స చేసే విషయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అలాగే కీలక పాత్ర పోషించిన విషయాన్నీ మర్చిపోకూడదు అన్నారు. ఈ నేపథ్యంలో ఒక పరిశోదన అత్యవసర పరిస్థితులలో సంరక్షణ అంశాలపై చేసిన పరిశోధనలో పలు లోపాలు వెలుగు చూసాయి. ఇందులో దీర్హ కాలం పాటు మత్తు మందులు ఇవ్వడం బెంజో డయా జపైన్ నరాలపై పనిచేస్తుంది. కుటుంబసభ్యుల సహాకరం లేకపోవడం ఇమ్మునైజేషన్, ఐసోలేషన్ , వంటి కోవిడ్ ప్రోటోకాల్ ను పక్కకుపెట్టినట్లు గమనించారు. ఐసియు పూర్తిగా పడకేసింది. అసలు వ్యవస్త పనిచేయలేదని ఈ సమయంలో ఎవరు సరిగా సహకరించకపోవడంతో, మెదడు పనిచేయని స్థితికి చేరిందని ఇది చాలామంది అత్యవసర రోగులకు సంబందించింది అని, ఈ పరిశోధనలలో చాలా ఐసియులలో మత్తుమందులు వికటించాయని నిబందనలకు అనుగుణంగా వ్యవహరించలేదని తెలుస్తోంది. దీనికి గల కారణం ఉహించలేమని అన్నారు. చాలా ఆసుపత్రులలో ఐసియు ప్రొవైడర్స్ తక్కువగా ఉన్నారని, ఐసియు ప్రొవైడర్స్ ఉత్తమ వైద్యాన్ని అందించే ప్రయత్నం చేసినప్పుడే మత్తుమందులు సైతం తక్కువగా ఉన్నాయని కాగా కోవిడ్ 19 సమయంలో ఊపిరితిత్తులు సరిగా పనిచేయడంలేదని తెలిసినా అందుకు సమర్థమైన నిర్వహణా పద్దతులు  అవలంబించాల్సినప్పటికీ అందులోభాగంగా ఎక్క్యుట్ బ్రెయిన్ డిస్ ఫంక్షన్, డీప్ సడేషన్ పద్ధతి నివారణా చర్యలు సరిగాలేవని తేల్చారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, పరీక్షలు జరిపిన రోగులకు దగ్గరగా పరిశీలించినప్పుడు వారి లక్షణాలు వారి పట్ల చూపిన శ్రద్ద తీసుకున్నచర్యలు క్లినికల్ అస్సెస్మెంట్ ఇందులో 88 % మంది రోగులకు ఇన్వేసివ్లీ మెకానికల్ వెంటిలేటర్ వినియోగించాలని 67 % కి ఐసియు చేరిన వెంటనే benzodiczpine మత్తు ఇచ్చినట్లు తెలుస్తోంది. 50 % రోగులలో డెలీరియం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారని, రోగులను కుటుంబసభ్యులు వర్చువల్ ద్వారా మాట్లాడటం ద్వారా 30 % మందిపై  డేలీరియం ఇబ్బందులు తక్కువని తేల్చారు. మనం రెండు మూడు విడతలుగా వచ్చే కోవిడ్ ను ఎదుర్కునేందుకు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని, ఏ అంశాలపై పరిశోధన చేసినా పెట్రిక్ పాన్ దారీ పాండే ప్రోఫెసర్ ఎనస్తీషియా ఈ అంశాలను వివరించారు. ఈ సమయంలో దీర్హకాలంపాటు ఎక్క్యుట్ బ్రెయిన్ డిస్ ఫంక్షన్ నివారించాలని, కోవిద్ 19  ఐసియు పద్దతులు మార్చాలని అందులో భాగంగానే రోగులకు తక్కువ మొతాదులో మత్తు మందు ఇవ్వాలని, వర్చువల్ విధానంలో కుటుంబ సభ్యులతో మాట్లాడే వీలు కల్పించాలని సూచించారు. 

కేటీఆర్ సీఎం అయితే  అణుబాంబు పేలనుందా!  

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను నియమించడానికి కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ సీఎం మార్పు అంశంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ముఖ్యమంత్రిగా తాను దిగిపోయే సాహసం కేసీఆర్ ఇప్పుడు చేయబోరని చెప్పారు. ఒకవేళ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. ఆ  వెంటనే టీఆర్ఎస్ లో అణుబాంబు పేలుతుందని చెప్పారు. కేటీఆర్ సీఎం కావడాన్ని టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.   తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ పూజలు చేసి, పూజ సామగ్రిని కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరిలో కలిపారని బండి సంజయ్ ఆరోపించారు.   కేటీఆర్ ను సీఎం చేస్తున్నట్టు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలకు కూడా చెప్పొచ్చానని, బీజేపీతో స్నేహం ఉంటుందంటూ తనకు అనుకూలమైన వ్యక్తుల చేత కేసీఆర్ చెప్పిస్తున్నాడని బండి సంజయ్ విమర్శించారు. ఏ పార్టీ కూడా కేసీఆర్ తో కాని, టీఆర్ఎస్ తో కాని పొత్తు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటే అని మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెపుతున్నారని... ఇదంతా అబద్ధమని అన్నారు. ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షా, నడ్డాలను కలుద్దామని... ఆ దమ్ము నీకుందా? అని కేసీఆర్ కు సవాల్ విసిరారు సంజయ్. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని చెప్పారు. 

సీఈవోకు ఎస్ఈసీ పవర్ తెలియదా! గోపాలకృష్ణ ద్వివేది.. ఏందిది? 

ఆయనో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్.. చట్టాలపై సమగ్ర అవగాహన ఉన్న అధికారి.. ఎన్నికల కమిషన్ అంటో ఏంటో.. దానికుండే పవరో ఏంటో తెలిసిన వారు.. అయినా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయనిప్పుడు సిల్లీగా వ్యవహరిస్తున్నారు. సర్కార్ పెద్దల ఒత్తిడో మరో కారణమో తెలియదు కాని.. ఆయన ఎన్నికల కమిషన్‌ను ధిక్కరిస్తుండటం అందరిని షాక్ కు గురి చేస్తోంది. బ్యూరోక్రాట్లలో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆయన ప్రతిష్టకు భంగం కల్గిస్తుందనే చర్చ  అధికార యంత్రాగంలో  జరుగుతోంది.              చట్టాల గురించి తెలిసినా అభాసుపాలయ్యేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటోంది ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ. ఏపీ పంచాయతీ ఎన్నికల విషయంలో ఆయన తీరు వివాదాస్పదమవుతోంది. ఎస్ఈసీకి సహకరించాల్సిన ఆ ఆఫీసర్.. తన విధులను నిర్వర్తించకుండా అడ్డదారుల్లో వెళుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా  శుక్రవారం రాత్రి  రాష్ట్ర ఎన్నికల కమిషనరేటర్‌ కు వెళ్లిన ద్వివేది.. కమిషనర్ ను కలవకుండానే  అక్కడ పేషిలో ఓ లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేనని చెప్పడం ఆ లేఖ సారాంశం.  ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.   కేంద్ర ఎన్నికల కమిషన్ స్థాయి అధికారాలు ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓ సీనియర్ ఐఎఎస్ ఇలా లేఖ రాయడం సంచలనంగా మారింది.  గోపాలకృష్ణ ద్వివేదీ ఇలా రాయడం మరింత విస్మయపరుస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నికల అధికారిగా పని చేశారు గోపాలకృష్ణ ద్వివేదీ. ఆ అధికారాల్ని పక్కాగా  ఉపయోగించుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా ద్వివేదీ ఉన్నారు. ఎన్నికలు మొత్తం ఆయన చేతుల మీదే నడిచాయి. చంద్రబాబు సర్కార్ ను మూడు నెలల పాటు.. ఎన్నికల కోడ్ కారణంగా అధికారాలేమీ లేకుండా చేశారు ద్వివేది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఇంటలిజెన్స్ చీఫ్‌ సహా  కొందరు కీలకమైన అధికారులను  బదిలీ చేయించారు.  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మొత్తం పట్టు సాధించారు. అప్పటి  చీఫ్ సెక్రటరీని బదిలీ చేయించి…ఎల్వీ సుబ్రహ్మణ్యం ద్వారా ఎన్నికల కోడ్‌ను అత్యంత కఠినంగా అమలు చేయించారు ద్వివేది.  ఎన్నికలకు.. కౌంటింగ్‌కు మధ్య నెలన్నర గ్యాప్ ఉన్న సమయంలోనూ అప్పటి సీఎం చంద్రబాబును పని చేయనివ్వలేదు ద్వివేది . సీఎస్ ద్వారా సొంత పాలన చేశారు. చివరికి రుణమాఫీ రెండువిడతల నిధులకు బడ్జెట్ కేటాయింపులు.. జీవోలు వచ్చినా నిలిపివేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పాస్ చేయనివ్వలేదంటే ఆయన  సీఈవోగా ఎంత అపరిమితమైన అధికారం చెలాయించారో ఊహించవచ్చు. తన అధికారాల్ని స్పష్టంగా .. సూటిగా వినియోగించుకున్నందుకు ఆయన బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్డు కూడా వచ్చింది. లక్ష నగదు బహుమతి కూడా అందుకున్నారు.ఎన్నికల విధుల్లో బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్జు తీసుకున్న గోపాలకృష్ణ ద్వివేదీ.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పినట్లుగా తాను చేయలేనని చెప్పడం విస్మయపరుస్తోంది. హైకోర్టుకు హామీ ఇచ్చి కూడా.. ఓటర్ల జాబితాను ఆయన ప్రిపేర్ చేయలేదు. పంచాయతీల్లో ఎన్నికలు పెట్టడానికి ఉద్యోగుల్ని సిద్ధం చేయలేదు.   ద్వివేది ఇలా చేయడం వెనక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉందనే చర్చ జరుగుతోంది. ట్విట్టర్ లో శుక్రవారం ఫీలింగ్స్ పేరుతో… కొన్ని సార్లు బాధ్యతల్ని పక్కన పెట్టి… మన ఇష్టం వచ్చినట్లుగా గడపాలని ఓ కొటేషన్‌తో ఆయన చిన్న వీడియో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి అయిష్టంగానే ద్వివేది ఈ పనులన్ని చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  ఎన్నికల నిర్వహణకు ఆయన సుముఖంగానే ఉన్నా.. ప్రభుత్వ విధానం ప్రకారం ముందుకెళ్లాలి కాబట్టి అలా చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. అయితే  ప్రభుత్వ విధానమైనా. నిబంధనల ప్రకారమే ఉండాలనేది  సివిల్ సర్వీస్ ట్రైనింగ్ లక్ష్యం. అందులోనూ ప్రత్యేకమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న ద్వివేది లాంటి అధికారులకు ఈ విషయాలన్నీ తెలుసు. అయినా ఆయన రాజ్యాంగ సంస్థకు సహకరించకుండా ఉండటం సరికాదనే అభిప్రాయమే నిపుణుల నుంచి వస్తోంది. కొన్ని రోజులుగా ద్వివేది వ్యవహరిస్తున్న తీరుతో  ఆయనకు మచ్చ పడే అవకాశం వచ్చిందని చెబుతున్నారు.    

పంచాయతీ ఎన్నికలతోనే వైసీపీ పతనం!

స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ప్రభుత్వం, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య జరిగిన వార్ కు తెరపడింది. తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వ అధికారులు సహకరించకపోయినా ఎన్నికలు జరిపి తీరుతామని చెప్పారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.  తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పార్టీ కేడర్ ను అప్రమత్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి కీలక సూచనలు చేశారు చంద్రబాబు.  అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ   పతనానికి  పంచాయతీ ఎన్నికలే నాంది కావాలని పార్టీ నేతలతో చెప్పారు చంద్రబాబు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీ రౌడీ రాజ్యానికి ముక్కుతాడు వేయాలన్నారు. అన్ని పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని సూచించారు. వైసీపీ దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కోవాలని... బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు.  ఎన్నికల కోడ్ అమల్లో ఉందని... వైసీపీ నేతల దౌర్జన్యాలను సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి, అధికారులకు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు జగన్  కంకణం కట్టుకున్నారని విమర్శించారు చంద్రబాబు. ప్రజల్లో వైసీపీ పట్ల చాలా వ్యతిరేకత ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం వైసీపీలో ఉందని అన్నారు.టీడీపీ కార్యకర్తంగా గట్టిగా పోరాడి వైసీపీని ఓడించాలని చంద్రబాబు పిలుపిచ్చారు. 

రిపబ్లిక్ డే పరేడ్ లో రామ మందిర శకటం 

ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో అయోధ్య రామ మందిర ఆయల నమూనాకు సంబంధించిన శకటాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే శకటం కూడా సిద్ధమైంది. శకటం ముందు భాగంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాస్తున్నట్లు కనిపిస్తోంది. దీని మధ్య భాగంలో భక్తులు రాముడిని కీర్తిస్తున్నట్లు ఉంది. శకటం వెనుక భాగంలో రామ మందిరం నమూనా ఉంది. ఇది అయోధ్య సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని  చెబుతున్నారు. రామ జన్మభూమిగా ప్రసిద్ధి చెందిన అయోధ్య  ప్రాచీన సాంస్కృతిక వారసత్వం, విలువలకు శకటం అద్దం పడుతుందని యూపీ ప్రభుత్వం తెలిపింది. వారసత్వ సంపద విలువను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఈ శకటాన్ని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది.  రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ శకటంలో చూడవచ్చు. అప్పటి సామాజిక, మతపరమైన పరిస్థితులు, సనాతన ధర్మం, విలువలను ఇవి గుర్తుచేస్తున్నాయి. షబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడు తినడం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, అహల్యకు సంబంధించిన సన్నివేశం, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, అశోకవనం... వంటివాటిని శకటంలో తీర్చిదిద్దారు. అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవానికి సంబంధించిన సన్నివేశాలు కూడా శకటంలో చూడవచ్చు. పరేడ్‌లో ఈ శకటానికి రెండు వైపులా సాధువులు, పూజారులు నడుస్తూ రాముడిపై తమ ప్రేమను చాటనున్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రామాలయ నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు కూడా సేకరిస్తున్నారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు రామ జన్మభూమి ట్రస్టు ప్రకటించింది. అయోధ్య రామాలయ నిర్మాణానికి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తెలంగాణలో తొలి రోజే  దాతల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు అందాయి. మైహోమ్ గ్రూప్ సంస్థలు  రూ. 5 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్  రూ. 6 కోట్లు, అపర్ణ కన్స్ స్ట్రక్షన్స్  రూ. 2 కోట్లు , డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ కోటి రూపాయలు ఇచ్చింది.     

పెను సవాలే.. అయినా జరిపి తీరుతాం! నోటిఫికేషన్ విడుదల చేసిన నిమ్మగడ్డ 

ఆంధ్రప్రదేశ్‌ లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే  విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ తెలిపారు. పొలింగ్ సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పొడిగించామన్నారు.  ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కార‌మే నాలుగు ద‌శ‌ల్లో పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహిస్తున్నామని,. విధి లేని పరిస్థితుల్లోనే  ఇలా  ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉందని చెప్పారు నిమ్మగడ్డ. కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో పీఆర్ కమిషనర్ అలక్ష్యంతో ఉన్నారని విమర్శించారు.  పంచాయతీ రాజ్ కమిషనర్ పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరమని.. ఆయనపై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.  పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల  సంద‌ర్భంగా నిమ్మ‌గ‌డ్డ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము అన్ని నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు. రాజ్యాంగాన్ని ర‌చించిన అంబేద్క‌ర్ మాన‌స‌పుత్రికే ఎన్నిక‌ల సంఘం అని ఆయ‌న అన్నారు. దాని ప్ర‌కార‌మే ఎన్నిక‌లు స‌కాలంలో నిర్వ‌హించ‌డ‌మ‌నేది ఎన్నిక‌ల క‌మిష‌న్ విధి అని చెప్పారు. అందుకే తాము ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించి ముందుకు వెళ్తున్నామ‌ని తెలిపారు.  కొంద‌రు ప్ర‌భుత్వ‌ అధికారులు ఎన్నిక‌ల ప్ర‌క్రియను స‌మ‌ర్థంగా కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ తెలిపారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంపై సుప్రీంకోర్టు ఏ నిర్ణ‌యం తీసుకున్నా త‌ప్ప‌కుండా పాటిస్తామ‌ని  స్ప‌ష్టం చేశారు. ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయత ఉంటాయని చెప్పారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఏపీ ప్ర‌భుత్వం నుంచి మిశ్ర‌మ అనుభ‌వాలు ఉన్నాయ‌ని చెప్పారు.  ఏదేమైనా స‌రైన స‌మ‌యానికి ఎన్నిక‌లు జ‌రుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు  నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్.  ప్రభుత్వ సూచనలు సహేతుకంగా లేవన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.  ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీరు కూడా సరిగా లేదని వ్యాఖ్యానించారు. సీఎస్ తనకు రాసిన లేఖ తనకంటే ముందుగానే మీడియాకు చేరిందన్నారు. ఆర్టీఐ నుంచి మినహాయింపులున్నా కమిషన్ విషయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో గోప్యత పాటించాల్సి ఉంటుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెప్పుకొచ్చారు.  సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని... సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనాలని  కోరారు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, జేడీ ఇలా ఎవ్వరూ లేరని.. అయినా ఎన్నికలు జరిపి తీరుతామని తేల్చిచెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ తమకు పెను సవాల్ అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. 

ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీని తొలగించిన ఎస్ఈసీ! మరికొన్ని గంటల్లో తొలి దశ ఎన్నికల షెడ్యూల్

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మరింత జోరు పెంచింది ఏపీ ఎన్నికల సంఘం. విధులకు సహకరించని అధికారులపై   ప్రత్యక్ష చర్యలకు దిగింది. 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి ఎస్ఈసీ తొలగించింది. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేస్తూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలను కూడా ఎస్ఈసీ తొలగించింది. మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌కు ఏపీ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. శనివారం నాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా  ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అధికారులతో వరస భేటీలు అవుతున్నారు. ఉదయం  గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో సుమారు 20 నిముషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు తీర్పు అంశాలు, ఎన్నికల ప్రక్రియ అంశాలు, షెడ్యూల్ వివరాలు గవర్నర్‌కు వివరించారు. ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు సమాచారం.  ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులు నిమ్మగడ్డ భేటీ కావాల్సి ఉంది. అయితే ఎస్ఈసీ ముందు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు హాజరుకాలేదు.       స్థానిక ఎన్నికల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సవాల్ చేసిన వైసీపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని, దానిని సరిచేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌ను వెనక్కిచ్చేసింది. ఈ క్రమంలో మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటిషన్‌ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు. దీనివల్ల సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం ఆదివారమే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.  

గ్రేటర్‌ మేయర్‌ ఎన్నిక ఎప్పుడంటే?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నూతన మేయర్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న మేయర్ ‌తో పాటు డిప్యూటీ మేయర్ ‌ను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగనుంది. ఒకవేళ ఏవైనా కారణాలతో ఫిబ్రవరి 11న ఎన్నిక నిర్వహిండం కుదరకపోతే మరుసటి రోజు అనగా ఫిబ్రవరి 12న ఎన్నిక నిర్వహిస్తారు. ఈ ఎన్నిక ప్రక్రియ పర్యవేక్షించేందుకు ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నారు.

పాలన చేతకాని సీఎం కేసీఆర్! 

తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి మార్పు, కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. కేటీఆర్ కు మద్దతుగా టీఆర్ఎస్ నేతల ప్రకటనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారైందని కొందరు చెబుతుండగా... ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని మరికొందరు చెబుతున్నారు. సీఎం మార్పు ప్రచారంపై విపక్ష నేతలు సీరియస్ గానే స్పందిస్తున్నారు.   తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు, ముఖ్యమంత్రి  అంశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత,  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలన చేతకాకే కేసీఆర్ దిగిపోవాలని అనుకుంటున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్ చేతకాకుండా అయిపోయాడని... అందుకే కేటీఆర్‌ను సీఎం అంటున్నారని చెప్పారు. కేసీఆర్‌కు వయస్సు మల్లిందని.. ఆ కారణంతోనే కేటీఆర్‌ను తెర మీదకు తీసుకువస్తున్నారని తెలిపారు. పాలన చేతకాని ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు జీవన్ రెడ్డి.  కేసీఆర్‌కు కేంద్ర వ్యవసాయ చట్టాలను అమలు చేయడంపై చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అమలుపైన కూడా రెండేళ్ల సమయం పట్టిందని మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ అంత కంటే మెరుగు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయుష్మన్ భారత్ ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం కూడా రెండేళ్లు ఆలస్యం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో వరుస పరాజయాలతో ఇప్పుడు అమలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఇప్పటికైనా కనువిప్పు కలిగినందుకు సంతోషమన్నారు జీవన్ రెడ్డి. గిరిజన రిజర్వేషన్లు 10 శాతం కుడా అమలు చేయడం లేదని, చరిత్రలో సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహిగా మిగిలిపోతారన్నారు. కేసీఆర్ రాజ్యాంగ నిబంధన ఉల్లంగిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. 

మూడ్ ఆఫ్ ది నేషన్.. మళ్లీ మోడీనే ప్రధాని!

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే, ఎన్డీయే మళ్లీ అధికారం చేపడుతుందని ఓ సర్వే వెల్లడించింది. ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా ప్రకారం ఎన్డీయేకు 321 స్థానాలు లభిస్తాయని వెల్లడైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 357 స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే. తాజా సర్వే ప్రకారం ఎన్డీయేకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కొనసాగితే.. 321 స్థానాలు లభించే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. యూపీయేకు 93 స్థానాలు, ఇతరులకు 129 స్థానాలు దక్కుతాయని తేల్చింది. ఇక ఓట్ షేర్ విషయానికొస్తే.. ఎన్డీయేకు 2019 లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం ఓట్లు రాగా, తాజా అంచనా ప్రకారం 43 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది. అలాగే, యూపీయేకు 27 శాతం, ఇతరులకు 30 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది.

క్యాంపుల్లోనే మంత్రులు, అధికారుల తిష్ట! ఏపీ సచివాలయంలో పడకేసిన పాలన! 

సచివాలయం.. రాష్ట్ర పరిపాలనకు కేంద్రం. పాలకులకు కార్యక్షేత్రం.  ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే జనాలతో నిత్యం కళకళలాడుతూ ఉండేది సచివాలయం. కాని ఇప్పుడు అమరావతి సచివాలయాన్ని చూస్తే అంతా ఖాళీనే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రావడం లేదు.. దీంతో మంత్రులూ అటువైపు  చూడటం లేదు. ముఖ్యమంత్రీ, మంత్రుల బాటలోనే ఉన్నతాధికారులు సచివాలయం రావడం మానేశారు.సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేకపోతుండటంతో జనాలు కూడా సచివాలయం సంగతి మర్చిపోయారు. దీంతో  అమరావతి సచివాలయంలో పాలనంతా పడకేసింది.  గతంలో అమరావతి సచివాలయం సందడిగా ఉండేది. అప్పటి సీఎం చంద్రబాబు  ఒకటో బ్లాకుకు ఉదయం పది గంటలకల్లా  వచ్చేవారు. రాత్రి పొద్దుపోయేదాకా ఉండి అనేక శాఖలపై సమీక్షలు నిర్వహించే వారు. ఆయనతోపాటు ఆయా శాఖల మంత్రులూ  పాల్గొనేవారు.  మంత్రులు కూడా తమ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలోనే సమీక్షలు నిర్వహించేవారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని రోజులు సచివాలయం రద్దీగానే ఉండేది. ప్రతి మంగళవారం స్పందన కార్యక్రమంపై రివ్యూ నిర్వహించేవారు జగన్, కేబినెట్ సమావేశాలు ప్రతి 15 రోజులకోసారి జరిపేవారు. ఎస్ఎల్బీసీ సమావేశాలు సచివాలయంలోనే నిర్వహించేవారు. సీఎం రెగ్యులర్ గా వస్తుండటంతో ఉన్నతాధికారులంతా కంపల్సరిగా సచివాలయం వచ్చేవారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా కొన్ని నెలలగా రివ్యూ చేయడం లేదట. ఆ పథకాలు ఎవరికి అందుతున్నాయో, ఎలా ఇస్తున్నారో కూడా ఉన్నతాధికారులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదంటే ..  ఏపీ సచివాలయంలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించవచ్చు.  కాని మూడు రాజధానుల ప్రతిపాదన రావడం... ఇంతలోనే కరోనా మహమ్మారి వెలుగుచూడటంతో సీన్ పూర్తిగా మారిపోయింది. గత 10 నెలలుగా మంత్రివర్గ సమావేశం ఉంటే మినహా... ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదు.  తాడేపల్లి  క్యాంపు కార్యాలయం నుంచే  ఆయన  పాలన సాగిస్తున్నారు. సమీక్షలు కూడా అక్కడి నుంచే చేస్తున్నారు. మంత్రులు కూడా  సచివాలయానికి  చుట్టపుచూపుగానే వస్తున్నారు.కేబినెట్‌ భేటీకి ఒకరోజు ముందు, తర్వాత... అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే హడావుడి చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో సీఎం నిర్వహించే సమీక్షలకు హాజరై... అట్నుంచి అటే వెళ్లిపోతున్నారు.   చివాలయంలో సొంత చాంబర్లు ఉన్నప్పటికీ... అనేక మంది మంత్రులు విజయవాడలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు కూడా సచివాలయానికి రాకుండా తమ క్యాంపు కార్యాలయానికే వారిని పిలిపించుకుంటున్నారు.   వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా మంత్రుల దారిలోనే  సచివాలయానికి రాకుండా విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులను సచివాలయం నుంచి అక్కడికే పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయానికి రావడం మానేశారు. సీనియర్‌ ఐఏఎస్ లు అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కరికాల వలవన్‌, ఏఆర్‌ అనురాధ, ప్రవీణ్‌ ప్రకాశ్‌, మధుసూదన్‌ రెడ్డి తదితరులు సొంతంగా క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేసుకుని, అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు సచివాలయానికి వచ్చిపోతున్నారు.  ఉన్నతాధికారులు రాకపోవడంతో సెక్షన్ ఆఫీసర్లకు సచివాలయంలో పని లేకుండా పోయిందని చెబుతున్నారు. దీంతో వారంతా జాలీగా గడేపిస్తున్నారట. బయోమెట్రిక్ కావడంతో వారంతా సచివాలయానికి రావడం కంపల్సరి కాబట్టి వస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. లేదంటే అధికారుల బాటలోనే వీళ్లు కూడా సొంత క్యాంపులు ఏర్పాటు చేసుకునేవారనే సెటైర్లు పేలుతున్నాయి. సెక్షన్ ఆఫీసర్లు.. వాళ్ల కన్నా కింది స్థాయి ఉద్యోగులు సచివాలయం వస్తున్నా.. పనులేమి చేయడం లేదని చెబుతున్నారు. కొందరైతే మార్నింగ్ వచ్చి హాజరు వేయించుకుని వెళ్లిపోయి... తిరిగి ఈవెనింగ్ వచ్చి మళ్లీ పంచ్ చేస్తున్నారని చెబుతున్నారు. అధికారుల పేషీ దగ్గరకు వెళ్లి సార్ ఎప్పుడొస్తారని ఆరా తీస్తున్న జనాలకు ఉద్యోగుల నుంచి ఒకటే సమాధానం వస్తుందట. తమ సార్  క్యాంపు కార్యాలయంలో ఉన్నారనే.. లేదంటే  సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నారనే చెబుతున్నారట. నిజానికి తమ ఉన్నతాధికారి ఎక్కడ ఉన్నారో ..ఆయన ఆఫీసు సిబ్బందికి కూడా తెలియడం లేదంటున్నారు.  గతంలో ప్రతిరోజూ దాదాపు వెయ్యి మంది వరకు సందర్శకులు వివిధ పనుల కోసం సచివాలయం వచ్చేవారు. కాని ఇప్పుడు  అధికారులు లేక పనులు కాకపోవడంతో పదుల సంఖ్యలోనే వస్తున్నారని సచివాలయ లెక్కలు చెబుతున్నాయి. అమరావతి సచివాలయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందిస్తున్న కొందరు మాజీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల స్థాయి అధికారులు సచివాలయంలో కాకుండా...  క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి విధులు నిర్వర్తించడం గతంలో ఎప్పుడు జరగలేదని చెబుతున్నారట. అధికారిక పర్యటనల్లో ఉన్నారా? లేదా క్యాంపు కార్యాలయాలకు వెళ్లారా? అనే విషయాన్ని సిబ్బంది స్పష్టంగా చెప్పలేకపోతుండటం మరీ దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

గోదావరిలో వణికిస్తున్న వింత వ్యాధి! ప్రజారోగ్యం పడకేసిందన్న చంద్రబాబు 

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలను వణకిస్తున్న వింత వ్యాధిపై  టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి జాతీయస్థాయిలో సంచలనం అయ్యేసరికి నాలుగు రోజులు హడావిడి చేసి ఆపై వదిలేశారని ఆరోపించారు. ఆ వింత వ్యాధి ఇప్పుడు దెందులూరు మండలం కొమిరేపల్లికి కూడా పాకిందని వెల్లడించారు. పాలకులు కుట్ర రాజకీయాలు, వ్యవస్థలను నాశనం చేసేవాటి మీద పెట్టే శ్రద్ధ ప్రజారోగ్యంపై పెట్టాలని హితవు పలికారు.   కొమిరేపల్లిలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని ప్రజలు అంటున్నారని చంద్రబాబు చెప్పారు.  ప్రభుత్వం ప్రజలకు కనీసం సురక్షితమైన తాగునీరు కూడా ఇవ్వలేకపోతోందని చంద్రబాబు విమర్శించారు. పాలన అంటే ప్రజల జీవితాలను మార్చగలగాలి కానీ, వైసీపీ పాలనలో తాము ప్రాణాలతో ఉంటే చాలనే పరిస్థితికి ప్రజలు వచ్చారని వ్యాఖ్యానించారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సంభవించిన వింత వ్యాధి జాతీయస్థాయిలో కలకలం రేపింది. వందలమంది ఆస్పత్రుల పాలయ్యారు. ఇప్పుడవే లక్షణాలతో  భీమడోలు మండలం పూళ్ల, దెందులూరు మండలం కొమరెపల్లిలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతుండడం మరోసారి ఆందోళన కలిగిస్తోంది.   

వింత వ్యాధికి విపక్షాలే కారణమట! వైసీపీ మంత్రుల తాజా వింత 

నలుగురు నవ్విపోదురు గాక నాకేమి సిగ్గు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు. ప్రభుత్వ వైఫల్యంతో ఏదో ఒక్క ప్రాంతంలో కొత్త సమస్య వెలుగుచూస్తూనే ఉంది. దీంతో ఏం చేయాలో తోచక.. ఆ నెపాన్ని  విపక్షాలకు అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నా.. వాటిని అరికట్టడంలో ఘోరంగా విఫలమైంది జగన్ రెడ్డి సర్కార్. దీనిపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో విపక్షాలే కుట్రలు చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఏపీలో భయపెడుతున్న వింత వ్యాధులకు కూడా విపక్షాలే కారమణమని చెబుతూ కామెడీ చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.  పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. గత నెలలో ఏలూరులో వందలాది మందిని హాస్పటిల్ పాల్డేసిన వింత వ్యాధి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.  భీమడోలు మండలం పూళ్ల, దెందులూరు మండలం కొమరెపల్లిలో ఒకేరోజు 21 మంది అస్వస్థతకు గురయ్యారు. తాజాగా ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. వింత వ్యాధి వెనుక కుట్రకోణం దాగి ఉందన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని కామెంట్ చేశారు. జనసేన, తెలుగుదేశం పార్టీలపైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆళ్లనాని ఆరోపించారు. వింత వ్యాధి వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరముందన్నని ఆళ్లనాని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడొద్దని  హెచ్చరించారు  వింత వ్యాధిపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అయిన   ఆళ్ల నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.  వింత వ్యాధి ప్రభలటానికి విపక్షాలు కారణమని మంత్రి చెప్పడంపై పలువురిని విస్మయపరుస్తోంది. ఈ రకమైన ప్రకటనలతో తమ  వైఫల్యాన్ని ప్రభుత్వమే అంగీకరిస్తుందనే వాదనలు వస్తున్నాయి. అళ్ల నాని ఆరోపణలపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. పాలన చేత కాక ప్రజలను గాలికొదిలేసి తమపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకా.. గ్రామాలన్ని మురికి కూపాలుగా మారిపోయాయని, ఆరోగ్య శాఖ పడకేసిందని వారు ఆరోపిస్తున్నారు.       మరోవైపు వింత వ్యాధిపై కుట్రకోణం దాగి ఉందన్న ఆరోపణళపై జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ స్పందించారు. బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపామని.. డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కుట్రకోణం వెనుక ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అలాంటిదేమైనా ఉంటే ఎవర్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని పశ్చిమగోదావరి ఎస్పీ నారాయణ్ నాయక్ స్పష్టం చేశారు. ఎవరైనా వింత వ్యాధిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. కుట్ర ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని ఎస్పీ ప్రకటించగా.. ఉప ముఖ్యమంత్రిగా ఉండి అళ్లనాని ఎలా తమపై ఆరోపణలు చేస్తున్నారని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. 

వాట్సాప్ చాట్ లీక్ పై మౌనమెందుకు?.. నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది!

జాతీయ భద్రతపై రాజీపడటం దారుణమని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సోనియా గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోనియా.. బాలాకోట్ పై ఎయిర్ స్ట్రయిక్స్ చేయడానికి ముందే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్‌చీఫ్ అర్నాబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లో ఈ దాడుల అంశం గురించి మాట్లాడిన ఘటనపై స్పందించారు. సైనిక రహస్యాలు బయటకు రావడం రాజద్రోహం కిందకు వస్తుందన్నారు. అర్నబ్ వాట్సాప్ చాట్ పై ఇంత గొడవ జరుగుతున్నా.. కేంద్ర ప్రభుత్వం నోరు మెదపకుండా మౌనంగా ఉందని మండిపడ్డారు. జాతీయ భద్రత లాంటి కీలకమైన అంశంలో ప్రభుత్వం రాజీపడిందని ఆరోపించారు. ఎప్పుడూ దేశభక్తి, జాతీయవాదం గురించి మాట్లాడుతూ ఇతరులకు సర్టిఫికెట్లను జారీ చేసే వారి నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని విమర్శించారు.   కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై కూడా సోనియా స్పందించారు. ఆలోచన లేకుండా హడావుడిగా వ్యవసాయ చట్టాలను రూపొందించారనే విషయం రైతులు చేస్తున్న నిరసనలతో బయటపడిందని అన్నారు. రైతుల విషయంలో కేంద్రం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆహార భద్రతను ఈ చట్టాలు నాశనం చేస్తాయని అన్నారు. ఈ చట్టాల్లో ఉన్న లోటుపాటులను, లాభనష్టాలను పార్లమెంట్ చర్చించే అవకాశాన్ని కూడా కేంద్రం కల్పించలేదని విమర్శించారు.  కొత్త వ్యవసాయ చట్టాలపై తమ వైఖరి స్పష్టంగా ఉందని, మొదటి నుంచి వాటిని వ్యతిరేకిస్తూనే ఉన్నామని సోనియా అన్నారు.