తెలుగు వన్ చెప్పిందే అక్షర సత్యం! కేసీఆరే మరో మూడేళ్లు సీఎం!
తెలంగాణ ముఖ్యమంత్రి మార్పుపై తెలుగు వన్ చెప్పిందే నిజమైంది. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదన్నది స్పష్టమైంది. గత కొన్ని రోజులుగా కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ప్రధాన మీడియా కోడే కూస్తోంది. డిజటల్ మీడియా అయితే మరో అడుగు ముందుకేసి కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం కూడా ప్రకటించేసింది. కాని తెలుగు వన్ మాత్రమే ముఖ్యమంత్రి మార్పు ఉండదని, ఈ టర్మ్ లోనూ పూర్తి కాలం కేసీఆరే సీఎంగా కొనసాగుతారని వరుస కథనాలు ఇచ్చింది. తెలుగు వన్ చెప్పిందే నిజమని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం మార్పు ఊహాగానాలపై కేసీఆర్ స్పష్టతనిచ్చారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో తెలుగు వన్ చెప్పిందే నూటికి నూరు పాళ్లు నిజమైంది.
తెలంగాణలో సీఎం మార్పు అంశంలో గతంలో తెలుగు వన్ ఇచ్చిన స్టోరీ మరోసారి మీకోసం..
కేటీఆర్ సీఎం కావడం కష్టం!
తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలన్ని కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ సీఎం అవుతారంటూ గులాబీ నేతలు పోటీపడి మరీ ప్రకటనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులెవరు ఈ వార్తలపై స్పందించడం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కేటీఆర్ పట్టాభిషేకానికి ముహుర్తం ఖరారైందని కథనాల మీద కథనాలు వస్తున్నాయి. అయితే కేసీఆర్ అత్యంత సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పట్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం అసాధ్యమనే తెలుస్తోంది.
తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. సీఎం సొండ గడ్డలో జరిగిన ఉప ఎన్నికలో అది కూడా సిట్టింగ్ సీటును కారు పార్టీ కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కమలనాధులు అధికార పార్టీకి చుక్కలు చూపించారు. వరుస షాకులతో గులాబీ పార్టీలో గుబులు రేగింది. ఆ నేపథ్యంలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక రానుంది. ఈ ఎన్నికలు టీఆర్ఎస్ భవిష్యత్ కు అత్యంత కీలకం.ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎన్నిక అధికార పార్టీకి పెద్ద సవాల్. రాష్ట్రంలో దూకుడు మీదున్న బీజేపీని అడ్డుకోవడంతో పాటు బలమైన నేత జానారెడ్డిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అందుకే ముందు నాగార్జున సాగర్ పై ఫోకస్ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారంటున్నారు.
టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా రివర్స్ అయ్యాయి. తన నైజానికి భిన్నంగా కొన్ని పథకాలను క్యాన్సిల్ చేశారు కేసీఆర్. పీఆర్సీ ప్రకటించకపోవడంతో ఉద్యోగులు, ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో యువత రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తే... పాలన చేతకాక కేసీఆర్ పారిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉందన్న వాదన కూడా కొందరు గులాబీ నేతల నుంచి వస్తుందట. పోరాడి తెలంగాణ సాధించిన ఉద్యమ నేతగా , రాజకీయ వ్యూహాల్లో దిట్టగా పేరున్న కేసీఆర్ కు.. ఈ తరహా ప్రచారం ఇబ్బందిగా మారుతుందని వారు చెబుతున్నారట. అందుకే కేటీఆర్ ను సీఎం చేయాలన్న అంశంపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
కేసీఆర్ కలల ప్రాజెక్ట్ యాదాద్రి పునర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. మరో రెండు, మూడు నెలల్లో ఆలయం సిద్ధమవుతుందని తెలుస్తోంది. పనుల్లో వేగం పెంచాలని యాడా అధికారులను ఆదేశించారు కేసీఆర్. యాదాద్రి ప్రారంభోత్సవాన్ని వైభవంగా జరపాలని, ఆ సందర్భంగా యాగం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యంగా కేసీఆర్ సొంత గడ్డలో నిర్మిస్తున్న .. కాళేశ్వరంలో అతి పెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది. అది పూర్తయ్యాకా ముఖ్యమంత్రిగా తానే దాన్ని ప్రారంభించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. అయితే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తికా ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
కేటీఆర్ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడానికి నిఘా వర్గాల నివేదికలు కూడా కారణమని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హరీష్ రావు కోటరిలో ఉండగా.. బంగారు తెలంగాణ బ్యాచ్ లీడర్లంతా కేటీఆర్ వెంట ఉన్నారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని , హరీష్ రావు కూడా పార్టీ మారే అవకాశం ఉందని నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలం నేతలు. ఇలాంటి సమయంలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి.. పార్టీలో అసమ్మతి పెరిగేలా చూసుకోవడం మంచిది కాదనే భావనకు టీఆర్ఎస్ అధినేత వచ్చారంటున్నారు.
అంతేకాదు కేటీఆర్ ను సీఎం చేసే విషయంలో కుటుంబంలోనూ క్లారిటీ రాలేదంటున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఏ బాధ్యతలు అప్పగించాలన్న దానిపై విభేదాలు వస్తున్నాయంటున్నారు. ఇలా ఏ రకంగా చూసినా..కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఇప్పట్లో జరగడం కష్టమే..