కరోనా గుప్పిట్లో దేశం..
కరోనా గుప్పిట్లో దేశం మొత్తం అట్టుడుకుతోంది. నిత్యం వేల కేసులతో దేశం విలవిలలాడుతుంది. కరోనా మరణాలతో కలకలం రేపుతోంది. మరణాలు రేటు ఆకాశాన్ని అంటుంది. వరుసగా 6వ రోజు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 3,23,144 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా సోమవారం 3,52,991 పోలిస్తే 8.4 శాతం తక్కువగా కేసులు నమోదు కావడం కొంత ఊరట కలిగిస్తోంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 2771 మంది మరణించారు. ఇది నిన్నటి మరణాల సంఖ్య 2812 కన్నా తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. ఇక మొత్తం మరణాల సంఖ్య 2లక్షలకు దగ్గరగా ఉంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1,97,894కు చేరింది. తాజాగా 2,51,827 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,45,56,209గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా.. తెలంగాణాలో కరోనా పంజా..
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా… తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలిసారి పదివేల మార్క్ దాటాయి. తాజాగా ఈరోజు 10,122 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 52 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,11,905 కరోనా కేసులు నమోదు అవగా, మొత్తం 2094 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం 69,221 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు.