జగన్ బెయిల్ రద్దు!.. సీబీఐ కోర్టు సై..
posted on Apr 27, 2021 @ 3:02PM
జగన్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టుంది. జగన్ బెయిర్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. బయట ఉంటే జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషినర్. వెంటనే బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు. పిటిషన్ తరఫు అభ్యర్థనలు విన్న న్యాయస్థానం.. కేసును విచారణకు స్వీకరించింది. ఇంతకీ ఈ పిటిషన్ దాఖలు చేసింది మరెవరో కాదు.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.
నాంపల్లి సీబీఐ కోర్టులో తాను వేసిన పిటిషన్ మొదట్లో సాంకేతిక కారణాల వల్ల న్యాయస్థానం తిరస్కరించిందని రఘురామ తెలిపారు. ఆ తర్వాత సవరణలు చేసి తిరిగి పిటిషన్ వేయడంతో తాజాగా తన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించినట్లు జడ్జి వెల్లడించారని వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రికి, సీబీఐకి నోటీసులు ఇస్తారని రఘురామ తెలిపారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారే న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వకపోతే పౌరులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిని దృష్టిలో ఉంచుకునే తాను ఈ పోరాటం మొదలు పెట్టానని ఆయన వెల్లడించారు.
రఘురామకృష్ణంరాజు.. కొన్ని రోజులుగా సీఎం జగన్‌రెడ్డిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆయనపై ప్రభుత్వ ప్రోద్బంలంతో ఈడీ రైడ్స్ జరుగుతున్నా..కేసులు పెడుతున్నా.. ఏమాత్రం అదరడం లేదు.. బెదరడం లేదు.. వెనక్కి తగ్గడం లేదు. జగన్ అనుసరిస్తున్న విధానాలపై, అడ్డగోలు పాలనపై దాదాపు ప్రతీరోజు విమర్శలు చేస్తుంటారు. ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి పార్టీ సపోర్ట్ లేకున్నా.. వైసీపీ ఎంపీగా ఉంటూనే.. వన్ మ్యాన్ ఆర్మీలా.. జగన్‌రెడ్డిపై మడమ తిప్పని పోరాటం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు రఘురామ. తాజాగా, ఆయన దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించడంతో ఆ ప్రయత్నంలో తొలి విజయం సాధించినట్టైంది. రఘురామ తలుచుకుంటున్నట్టుగానే.. త్వరలోనే జగన్ బెయిల్ రద్దు అవుతుందా? జగన్ మళ్లీ జైలుక వెళ్లక తప్పదా? ఏమో.... ఏదైనా జరగొచ్చు.