శ్వాస ఇబ్బంది ఉంటే ఇలా చేయండి!
కరోనా పంజాతో దేశం అల్లాడిపోతోంది.రోజురోజుకూ ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆసుపత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కొరతతో పాటు, మహమ్మారి సోకిన వారికి అవసరమైన మందులు కూడా లభించని పరిస్థితి. అన్ని హాస్పిటల్స్ అన్న నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. తమ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్రాలు అభ్యర్థిస్తున్నాయి.
కరోనా కల్లోలం, ఆక్సిజన్ కొరత నేపథ్యంలో వ్యాధి సోకిన వారు, వ్యాధి సోకకున్నా ముందస్తు జాగ్రత్తగా శ్వాస సక్రమంగా ఆడేలా స్వీయ చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇందుకోసం 'ప్రోనింగ్' విధానాన్ని పాటించాలని సిఫార్సు చేసింది. మరింత సులువుగా శ్వాస ఆడటంతో పాటు, శరీరానికి అవరమైన ఆక్సిజన్ స్థాయిని ఈ విధానం పెంచుతుందని, దీన్ని వైద్య పరంగానూ ఆమోదించారని తెలిపింది.
ప్రోనింగ్ విధానంలో తొలుత బోర్లా పడుకోవాల్సి వుంటుంది. కడుపు మంచంపై ఉండేలా జాగ్రత్తలు తీసుకుని, ముఖం బోర్లా పెట్టి కనీసం 2 గంటలు పడుకోవాల్సి వుంటుంది. దీంతో శ్వాస పీల్చుకోవడం సులువవుతుంది. ఈ ప్రక్రియ శరీరంలో ఆక్సిజన్ స్థాయి 94 శాతానికి మించి తగ్గితే, ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆ తరువాత కుడివైపునకు, ఎడమ వైపునకు తిరిగి పడుకుంటూ సాధ్యమైనంత సమయం ఉండాలని, దీని ద్వారా జ్వరం తగ్గుతుందని, బ్లడ్ షుగర్ కూడా నియంత్రణలో ఉంటుందని, హోమ్ ఐసొలేషన్ లో ఉండే వారికి 'ప్రోనింగ్' ప్రక్రియ చాలా ముఖ్యమని తెలిపింది.
సమయానుసారంగా ప్రోనింగ్ చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్రక్రియకు నాలుగు పిల్లోలను వాడాలని, ఒకటి మెడికింద, రెండు గుండెల కింద, ఆపై మోకాళ్ల కింద పెట్టుకుంటే, మెరుగైన ఫలితాలు ఉంటాయని తెలిపింది.అయితే, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణీలు, వెన్నెముక సమస్యలు ఉన్నవారు ఈ విధానాన్ని పాటించరాదని తెలిపింది. భోజనం చేసిన వెంటనే కూడా ఈ ప్రక్రియ చేయరాదని సూచించింది. ప్రోనింగ్ విధానానికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.