బరువు పెరిగితే ముప్పే! కరోనాపై షాకింగ్ రిపోర్ట్ 

కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. కరోనా వైరస్ ప్రభావంపై యూకే రీసెర్చర్లు అధ్యయనంలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. నిర్ధారిత బరువు కంటే కొంత ఎక్కువ బరువున్నా కరోనా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని ఆ అధ్యయనం వెల్లడైంది.  ముఖ్యంగా యువతలో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది.  వరుస లాక్ డౌన్ల వల్ల జనాలు ఇళ్లలోనే ఉంటుండటంతో... వారు బరువెక్కుతున్నారు. వీరిపైనే యూకే రీసెర్చర్లు అధ్యయనం చేశారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23 కంటే ఎక్కువ ఉన్నవారు ఇప్పటికే హై రిస్క్ లో ఉన్నారని అధ్యయనంలో వారు తెలిపారు. బీఎంఐ ఒక్క పాయింటు పెరిగినా... ఆసుపత్రుల్లో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే అవకాశాలు 10 శాతం పెరుగుతాయని హెచ్చరించారు. 40 కంటే తక్కువ వయసున్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని రీసెర్చర్లు తెలిపారు.  ఇతర జాతులతో పోల్చితే నల్లజాతీయులపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని యూకే రీసెర్చర్లు చెప్పారు. 70 లక్షల మంది హెల్త్ రికార్డులను అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ వివరాలను వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారు బరువు పెరిగినప్పటికీ... వారిపై ప్రభావం తక్కువగానే ఉంటుందని చెప్పారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు 'ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ' జర్నల్ లో ప్రచురితమయ్యాయి.   

కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ అవుట్?

కరోనా కల్లోల సమయంలోనూ తెలంగాణలో రాజకీయ సంచలనాలు జరుగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ  కేసీఆర్ కు అనుకూలంగా ఉన్న మీడియాలో వార్తలు వస్తుండటం చర్చగా మారింది. ఈటలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందనే చర్చ జరుగుతోంది.  మెదక్​ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్​గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్​కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది.  ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.  మంత్రి ఈటల వ్యవహారం శుక్రవారం  మీడియాలో వైరల్​గా మారింది. టీఆర్​ఎస్​ పార్టీ అధికారిక ఛానల్​గా గుర్తింపు ఉన్న టీ న్యూస్​లో కూడా ‘‘ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జారోగం’’ అంటూ ఇదే అంశాన్ని హైలెట్​ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదేపదే రావడం సంచలనంగా మారింది. ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్​ను కేబినెట్​ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్​ నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.  కొంత కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉంటున్నారు ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ తీరుపైనా ఆయన గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. పలు సార్లు ఆయన ఓపెన్ గానే తన అసమ్మతిని వ్యక్తం చేశారు. గత సంవత్సరం గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లం అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల కూడా కేసీఆర్, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేలా రాజేందర్ మాట్లాడారు. బీసీ సంఘం సమావేశంలోనూ తనను అణగదొక్కాలని చూస్తున్నారనే సంకేతం ఇచ్చేలా ఈటల మాట్లాడారు. తమను వరుసగా టార్గెట్ చేస్తున్నరన్న కసితో అతనికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే భూకబ్జాలతో పేరుతో కథ నడిపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

టీకాలేక్కుండా వ్యాక్సినేషన్ ఎలా? రెండు రోజుల్లో 3 కోట్ల రిజిస్ట్రేషన్లు..

మే 1 వతేదీ మూడో దశ వ్యాక్సినేషన్‌కు అనుమతించింది కేంద్రం. 18 ఏండ్లు నిండిన వారినీ టీకాకు అర్హులుగా ప్రకటించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. కొవిన్‌ పోర్టల్‌, ఆరోగ్య సేతు యాప్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దేశంలో రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు స్పందన లభిస్తోంది. గురువారం వరకే 2.45 కోట్ల మంది లబ్ధిదారులు కొవిన్‌  ద్వారా పేర్లు నమోదు చేసుకున్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28న 1.37 కోట్లకుపైగా పేర్లను నమోదు చేసుకోగా.. 29న 1.04 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.  వ్యాక్సినేషన్ నమోదు ముమ్మరంగా సాగుతోంది కాని.. టీకా పంపిణి మాత్రం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. చాలా రాష్ట్రాల్లో 45 ఏండ్లు నిండినవారికే ప్రస్తుతం టీకాలు వేసే పరిస్థితి లేదు. వ్యాక్సిన్లు లేక టీకా కేంద్రాలనే మూసేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో చాలా వ్యాక్సినేషన్ సెంటర్లు క్లోజ్ చేశారు. టీకాలు లేకపోవడంతో మహారాష్ట్ర లోని ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సి నేషన్‌ నిలిపివేస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌  ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏండ్లు నిండినవారికి చేపట్టాల్సిన టీకా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. టీకాలు వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తామని తెలిపింది. ఢిల్లీ సర్కార్‌ వద్ద ప్రస్తుతం వేయటానికి టీకా అనేదే లేదని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్‌ ప్రకటించారు. ఉన్న వ్యాక్సిన్‌ నిల్వలు మొత్తం అయిపోయాయని వెల్లడించారు. వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న ప్రైవేటు కంపెనీలకు విజ్ఞప్తులు చేశామని, వాటి నుంచి స్పందన లభించిన తర్వాతే టీకాలు ఎప్పుడు వస్తాయో తెలియజేయగలమని పేర్కొన్నారు. టీకాలు అందుబాటులో లేనందున  గుజరాత్‌, పంజాబ్‌, ఏపీ, తెలంగాణలోనూ 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ వాయిదా పడింది. 45 ఏండ్లు దాటిన వారికి మాత్రమే టీకా వేస్తున్నప్పుడే పరిస్థితులు ఇలాఉంటే.. ఇక వారికి 18-44 ఏండ్లలోపు వాళ్లు కూడా కలిస్తే.. అసలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇప్పుడున్నంత సజావుగానైనా జరుగుతుందా అని ఆరోగ్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు.  18-44 ఏండ్ల వయసువాళ్లు టీకా తీసుకోవాలంటే కొవిన్‌ పోర్టల్‌ ద్వారాగానీ, ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవటం తప్పనిసరి. అయితే, టీకా కోసం నిర్ణయించిన స్లాట్లు అందుబాటులో ఉంటేనే వారికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవటం వీలవుతుంది. టీకా అందుబాటులో ఉంటేనే స్లాట్‌లు కేటాయిస్తారు. 18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా కోసం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కోట్లాదిమంది యువతీ యువకులు, నడి వయస్కులు వ్యాక్సిన్‌ కోసం తమ పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఇంతటి డిమాండ్‌ను తట్టుకునే స్థాయిలో టీకాలు అందుబాటులో ఉంటాయా? కంపెనీలు సరఫరా చేయగలవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేంద్రం ఏప్రిల్‌ 19న వ్యాక్సినేషన్‌ కొత్త నిబంధనలను ప్రకటించింది. అప్పటివరకూ 45 ఏండ్లు నిండినవారే కరోనా టీకా తీసుకోవటానికి అర్హులుకాగా.. కొత్త నిబంధనల ప్రకారం.. అర్హుల వయస్సును 45 నుంచి 18 ఏండ్లకు తగ్గించింది. అంతేకాదు, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న కంపెనీల నుంచి టీకాలను స్వయంగా కొనుగోలు చేసుకోవటానికి రాష్ట్రప్రభుత్వాలకు, ప్రైవేటు దవాఖానలకు అనుమతించింది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం.. ఏప్రిల్‌ 28 నుంచి కొత్త లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 19 నుంచి మే 1 వరకూ 11 రోజుల గడువున్నా.. కేంద్రం ఇటు రాష్ట్రాలను, అటు వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలను సమన్వయం చేసుకొని, ప్రణాళికలను సిద్ధం చేసుకోలేదు. ఇకనైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎక్కడికక్కడ సమన్వయంతో టీకాల పంపిణీ, సరఫరా, వ్యాక్సినేషన్‌పై పని చేసి, పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తేనే విస్తృత వ్యాక్సినేషన్‌ సాధ్యమతుందని నిపుణులు సూచిస్తున్నారు.  

ఉద్యోగం పోయింది. దొంగతనం చేసిన 21 ఏళ్ళ యువతి..

ఆమె ఓ యువతి. వయసు 21 సంవత్సరాలు. గతంలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసింది. కారణం ఏంటో తెలియదు గానీ ఆ యువతి ఉద్యోగం పోయింది. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకోసం ఆమె ఒక కొత్త అవతారం ఎత్తింది. అదేంటని అనుకుంటున్నారా.. ? మీరే చూడండి ఏం చేసిందో..     ఆమె ఓ జ్యూయలరీ షాప్‌కు వెళ్ళింది. ఓనర్ తో అది చూపించండి.. ఇది చూపించండి  అంటూ మాటల్లో పెట్టింది. ఓనర్ అమ్మాయి కదా అని ఆమెను ఏం అనలేదు. కానీ ఆమె మాత్రం బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించింది. ఇక అంతే ఆమె దొంగతనాన్ని గమనించిన షాప్ యజమాని ఆమె పారిపోకుండా పట్టుకున్నాడు. చుట్టుపక్కన ఉన్నవారందరినీ పిలిచాడు. ఈ యువతి షాప్‌లో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకున్నానని వాళ్లకు చెప్పాడు. అక్కడ వచ్చిన చుట్టుపక్కల వారందరి ముందే ఆ యువతిని రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి కట్టేశారు. ఆమె చేతులను తాళ్లతో కట్టేసిన తర్వాత ఆ యువతిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు.  కట్ చేస్తే..ఈ సమాచారం అందుకున్న పోలీసులు  ఘటన జరుగుతున్న స్థలానికి  వచ్చారు. పోలీసులు వెళ్లే సరికి ఆమెను స్తంభానికి కట్టేసి మాకు ఏం సంబంధం లేదన్నట్లు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అసలు అప్పటిదాకా ఏమీ జరగనట్టు, ఆమెను ఎవరో వచ్చి కట్టేసి వెళ్లిపోయినట్లు ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఆమెకు కట్లు విప్పిన పోలీసులు ఆ యువతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. దీంతో.. ఆమె అసలు నిజం బయటపెట్టింది. దొంగతనానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. కానీ దాని వెనుక ఓ కారణం ఉందని ఆమె చెప్పింది. తాను అంతకు ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశానని.. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయానని చెప్పింది. కొన్నిరోజుల క్రితం తనకు తెలిసిన వ్యక్తి ‘నవ్‌కర్ ఆర్నమెంట్స్’‌లో చోరీ చేయమని చెప్పి తనను ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేశాడని తెలిపింది. షాప్‌లోకి వెళ్లి మత్తు మందును ఓనర్‌పై స్ప్రే చేసి జ్యూవెలరీని దొంగిలించి తీసుకొచ్చి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు చెప్పింది. తాను చెప్పినట్లు చేయకపోతే.. నీకున్న అఫైర్ గురించి బయటపెడతానని తనను బెదిరించాడని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. ఈ బెదిరింపు వ్యవహారం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఓ వ్యక్తితో తనకు కొంతకాలంగా అఫైర్ ఉందని ఆ యువతి అంగీకరించింది. ఈ విషయం బయట తెలిస్తే ఇబ్బంది అవుతుంది చెపింది.  ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  కరోనా వచ్చి ప్రాణం తియ్యడమే కాదు. ఉద్యోగం కూలిపోయి నిరుద్యోగం కొంత మంది పాలిట శాపంగా మారింది. 

పరువు తీసుకున్న విజయసాయి రెడ్డి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. కరోనా కట్టడిలో రాష్ట్ర సర్కార్ పనితీరు ఎలా ఉందో విజయసాయి సాక్షిగా బహిర్గతమైంది. ప్రభుత్వం చెబుతున్నదానికి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతనే లేదని తేలిపోయింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో 104 కాల్ సెంటర్లు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సీఎం జగన్  ఆదేశాలిచ్చారు. అయితే 104 సేవలు మాత్రం రోగులకు అందడం లేదు. ఈ నేపథ్యంలో 104 సర్వీసుల పనితీరు ఎలా ఉందో పరిశీలించేందుకు ప్రయత్నించి భంగపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కలెక్టరేట్‌లోని 104 కంట్రోల్‌ రూమ్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే ఆయన వచ్చిన సమయంలో ఒక్క కాల్‌కూడా రాకపోవడంతో.. స్వయంగా 104కి ఫోన్‌ చేశారు. దీంతో ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. విజయసాయిరెడ్డి  104 కేంద్రానికి స్వయంగా ఫోన్ చేశారు. అయితే దాదాపు 20 నిమిషాల వరకు అవతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విజయసాయి అసహనానికి గురయ్యారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటన్న విజయసాయి... 104 నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అయితే సాంకేతిక లోపాల కారణంగా ఈ సమస్య వచ్చిందని 104 నిర్వాహకులు విజయసాయికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కరోనా ఉద్ధృతంగా ఉన్నవేళ లోపాలు చక్కదిద్దుకుని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని విజయసాయి స్పష్టం చేశారు. అనంతరం కేజీహెచ్‌లో వైరాలజీ లాబ్‌ను విజయసాయి సందర్శించారు. టెస్టింగ్, నిర్వహణ తీరును వైద్యుల నుంచి అడిగి ఆయన తెలుసున్నారు. 

బాధితులు కష్టాలు చెప్పుకుంటే తప్పేంటి! కేంద్రానికి సుప్రీంకోర్టు చివాట్లు 

సోషల్ మీడియాలో కరోనా బాధితులు తమ కష్టాలను చెప్పుకుంటూ ఇతరులకు సమాచారం చేరవేయడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవద్దని.. ఒకవేళ అలా చేస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరించింది. సోషల్ మీడియాలో బాధలు చెప్పుకోవడాన్ని అణచివేయడం తగదని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు.ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర ఔషధాల పంపిణీ, వ్యాక్సినేషన్‌ తదితర అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.  ఓ పౌరుడిగా, న్యాయమూర్తిగా అది తనకు ఎంతో ఆందోళన కలిగిస్తోందని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. తమకు బెడ్లు కావాలనో లేదంటే ఆక్సిజన్ కొరత ఉందనో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేరం కాదని, అలా తమ గోడు వెళ్లబోసుకున్న పౌరులను హింసిస్తే కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, వైద్యులు, ఆరోగ్య సిబ్బందికే బెడ్లు దొరకని దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పౌరులు సోషల్ మీడియాలో లేవనెత్తిన బాధలు తప్పు అని అనుకోవడం తగదన్నారు. కరోనా కేసులు ఇలాగే పెరుగుతూ పోతే హోటళ్లు, ఆలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనాలయాలను కొవిడ్ సేవల కోసం ఉపయోగించుకోవచ్చని సూచించారు.  వ్యాక్సిన్లపైనా కేంద్ర ప్రభుత్వానికి చీవాట్లు పెట్టారు జస్టిస్ డి.వై. చంద్రచూడ్. ఇలాంటి తరుణంలోనూ కేంద్ర ప్రభుత్వమే ఎందుకు పూర్తిగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు ధరలు ఎందుకని నిలదీశారు. రాష్ట్రాలు 50 శాతం డోసులను కొనుగోలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, ఇందులో సమానత్వం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నోళ్లు 59 కోట్ల మంది ఉన్నారని, పేద ప్రజలు వ్యాక్సిన్ వేసుకునేందుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న జాతీయ టీకాకరణ నమూనానే ఇప్పుడూ అనుసరించాలని ప్రభుత్వానికి సూచించారు. ‘‘ఆక్సిజన్‌ ట్యాంకర్లు, సిలిండర్లు అన్ని ఆసుపత్రులకు చేరేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంతవరకు సరఫరా చేస్తున్నారు? లాక్‌డౌన్‌ తరహాలో తీసుకున్న ఆంక్షలు, చర్యలపై వివరాలు ఏవి? నిరుపేదలు, నిరక్షరాస్యులకు ఇంటర్నెట్‌ సదుపాయం ఉందా? మరి అలాంటి వారికి వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ఎలా చేయిస్తున్నారు? స్మశానవాటికల్లో పనిచేసే వారికి టీకా ఎలా ఇస్తున్నారు? పేటెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 92ను కేంద్రం అమలు చేస్తోందా? వ్యాక్సిన్‌ డోసులను కేంద్రమే 100శాతం ఎందుకు కొనుగోలు చేయడం లేదు? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మే టీకాల ధరల్లో ఎందుకు వ్యత్యాసం ఉంది? ఆ మేరకు సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి పంపిణీ వికేంద్రీకరణ చేయవచ్చు కదా? వ్యాక్సిన్‌ తయారీదారులు డోసులు అందించే క్రమంలో రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని ఎలా పాటిస్తున్నారు? నేషనల్‌ ఇమ్యూనైజేషన్‌ ప్రోగ్రాం విధివిధానాలను కేంద్రం ఎందుకు పాటించట్లేదు? 18-44 ఏళ్ల మధ్య జనాభా ఎంత? వ్యాక్సిన్‌ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి ఎంత?’’ అంటూ ధర్మాసనం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.    కరోనా చికిత్స ధరలను కేంద్రం ఏ విధంగా నియంత్రిస్తుందో చెప్పాలని కోర్టు సూచించింది. వైద్య సిబ్బంది కొరతను ఎలా అధిగమిస్తున్నారు? ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఉంటే తాత్కాలిక చికిత్స కేంద్రాలను ఎలా ఏర్పాటు చేస్తున్నారని అడిగింది. ఈ కేసు విచారణలో అమికస్‌ క్యూరీగా న్యాయవాదులు మీనాక్షి అరోరా, జైదీప్‌ గుప్తా కూడా కోర్టుకు హాజరయ్యారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా కోర్టుకు అఫిడవిట్‌ సమర్పించారు. 

కరోనా వార్డ్ లో డాన్సులు.. 

సరిగ్గా సంవత్సరం కింద ప్రశాంతగా ఉంది ప్రపంచం. ఎక్కడి నుండి వచ్చిందో మాయదారి కరోనా ఒక్కసారి  పెను ఉప్పెనలా ప్రపంచాన్ని కబళించింది. జీవం తో ఉన్న ప్రజా సముదాయాన్ని నిర్జీవులను చేసింది. ఒకటి కాదు రెండు కాదు కొన్నీ లక్షల మంది ప్రాణాలను తీసింది.   దేశంలో కరోనా సెకండ్​ వేవ్​ విధ్వంసం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇండియాలో  రోజుకు 3.5 లక్షలకు పైగా పాజిటివ్​ కేసులు వచ్చాయి. దీంతో, ఏ హాస్పిటల్​ చూసినా కరోనా పేషెంట్లతో కిటకిటలాడుతుండు. దీంతో వైద్య సిబ్బంది, అంబులెన్స్​ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా కరోనా కట్టడిలో ముందున్న వారంతా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారు. చాలా మంది హెల్త్ కేర్ వర్కర్లు 24 గంటలు హాస్పిటల్​లోనే ఉండి సేవలందిస్తున్నారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒత్తిడి పోగొట్టుకోవడానికి, పేషెంట్లలో మనో స్థైర్యాన్ని నింపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిసేపు రిలాక్స్​ అయ్యేందుకు డ్యాన్స్ స్టెప్పులేస్తున్నారు. తాజాగా హెల్త్​ వర్కర్లు పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్​గా మారింది. బహుశా మన ధైర్యానికి మించిన మెడిసిన్ ఈ ప్రపంచంలో ఎక్కడ లేడకున్నారో ఏం కొత్తగా డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు.  కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్య సేవలు అందించే సిబ్బందికి సెలవులు కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వారు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఒత్తిడిని దూరం చేసేందుకు, పేషెంట్లలో ధైర్యాన్ని నిపేందుకు వైద్య సిబ్బంది డ్యాన్సులు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు కరోనా రోగుల్లో సానుకూల ఆలోచనలు నింపుతాయని వారు చెబుతున్నారు. తాజా వీడియో ఇప్పుడు సోషల్​మీడియాలో వైరల్​గా మారుతోంది. హెల్త్ వర్కర్లు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. సోషల్​ మీడియాలో వైరల్​.. వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే.. కరోనా సోకిన రోగులను ఉత్సాహపరిచేందుకు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పీపీఈ కిట్లను ధరించి భాంగ్రా స్టెప్పులేయడం మనం చూడవచ్చు. వైద్యులు డాన్స్​ చేస్తూనే.. రోగులను కూడా వారితో పాటు డాన్స్​ చేయాలని ప్రోత్సహించారు. దీంతో కొంతమంది రోగులు బెడ్​పైనే చిటికెలు, చప్పట్లు కొట్టడుతూ భాంగ్రా స్టెప్పులను అనుకరించారు. ఈ వీడియోను గుర్మీత్ చాధా అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్లేబ్యాక్ సింగర్, గేయ రచయిత షారీ మన్ పాడిన జిందగీ అనే పంజాబీ సాంగ్​కు వారు డ్యాన్స్ చేశారని తెలిపారు. సోషల్ మీడియా యూజర్లు ఇంటర్​నెట్​లో ఈ వీడియోను చూసిన తరువాత వైద్యులను మరింతగా ఉత్సాహపరిచారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సానుకూల భావాలను పెంపొందిస్తున్న హెల్త్​ వర్కర్ల​ను ప్రశంసిస్తున్నారు.  

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు! 

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట కర్ఫ్యూను మరో వారం పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. అయినా కొత్త కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయింది. మే 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నైట్ కర్ఫ్యూ సందర్భంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అన్ని జిల్లాల పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  అంతకుముందు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ , కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. నైట్ కర్ఫ్యూ ముగుస్తున్న తరుణంలో తదుపరి తీసుకోబోయే చర్యలపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. అయితే వివరాలను శుక్రవారం ఇస్తామని కోర్టుకు నిన్న ఏజీ తెలిపారు. అయితే తదుపరి కార్యాచరణపై శుక్రవారం కూడా ఎలాంటి వివరాలను అంజేయకపోవడంతో... హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. 24 గంటల్లో ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయిందని నిలదీసింది.  హైకోర్టు ప్రశ్నకు బదులుగా శనివారం ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉందని ఏజీ తెలిపారు. ఈ అంశంపై చీఫ్ సెక్రటరీ సమీక్షను నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పేందుకు 45 నిమిషాల సమయాన్ని ఇస్తున్నామని తెలిపింది. తాము ఇచ్చిన సమయంలోగా ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుపకపోతే.. తామే ఆదేశాలను జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూని మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

దేశంలో లాక్ డౌన్! క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోడీ..

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో 3,86,452 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,498 మంది కరోనాతో మరణించారు. దేశంలో 31,70,228 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.కరోనా పంజా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే తీవ్రత ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో లాక్ డౌన్ పెట్టాలని కేంద్ర ఆలోచిస్తుందని అంటున్నారు. దేశంలో లాక్ డౌన్ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు. కరోనాపై  కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. దేశంలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, చర్యలపై చర్చించారు. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో వర్చుపల్ పద్దతిలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధాని మోడీ తేల్చిచెప్పారు. కరోనా కేసుల ఆధారంగా లాక్‌డౌన్‌పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని  తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని మోడీ సూచించారు.

నందిగ్రామ్ లో మమత ఓటమి! ఎగ్జిట్ పోల్స్ తో టీఎంసీలో టెన్షన్ 

దేశవ్యాప్తంగా రాజకీయ మంటలు రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వచ్చాయి. మెజార్టీ సర్వేలు టీఎంసీదే మళ్లీ అధికారమని తేల్చేశాయి. మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని వెల్లడించాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం హంగ్ ఫలితం రావొచ్చని చెప్పగా.. రిపబ్లిక్ ఛానెల్ సర్వేలో మాత్రం బీజేపీకి విజయం సాధిస్తుందని వెల్లడైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత హ్యాట్రిక్ విజయంపై టీఎంసీ ధీమాగా కనిపిస్తోంది. అటు బీజేపీ కూడా తామే గెలుస్తామని చెబుతోంది. అయితే ఎగ్టిల్ పోల్స్ అంచనాల్లోనే మరో ఆసక్తికర విషయం వెల్లడవుతోంది. టీఎంసీ మేజిక్ ఫిగర్ సాధించినా.. నందిగ్రామ్ లో మాత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలవడం కష్టమని తెలుస్తోంది. దాదాపు అన్ని సర్వేల్లోనూ నందిగ్రామ్ లో టఫ్ ఫైట్ జరిగిందనే రావడంతో ఉత్కంఠ రేపుతోంది.  గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ సర్వే ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పోటీలో ఉన్న అభ్యర్థులు చనిపోవడంతో 292 స్థానాలకే పోలింగ్ జరిగింది. 292లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ టీఎంసీకి 157 నుంచి 185 సీట్లు, బీజేపీకి 96 నుంచి 125 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 8 నుంచి 14 సీట్లు వస్తాయని వెల్లడైంది. ప్రాంతాలవారీగా సర్వే ఫలితాలను ఇచ్చింది గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ. దీని ప్రకారం కోల్ కతా రీజియన్, సెంట్రల్ రీజియన్, నార్త్ బెంగాల్ లో టీఎంసీకి లీడ్ కనిపిస్తుండగా..తీవ్ర ఉద్రిక్తతలు స్పష్టించిన జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో మాత్రం బీజేపీ సత్తా చాటనుందని తెలుస్తోంది. ఇక్కడ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది.   జంగల్ మహాల్, మిడ్నాపూర్ ఏరియాలో బీజేపీకి 31-37 అసెంబ్లీ సీట్లు గెలవనుండగా.. టీఎంసీ కేవలం 18-24 స్థానాలకే ఆగిపోనుందని సర్వే చెబుతోంది. మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం ఈ ఏరియాలోనే ఉంది. ఎన్నికలకు ముందు టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికార ఈసారి కూడా నందిగ్రామ్ ఏరియాలో తన పట్టు నిలుపుకున్నారని గ్రౌండ్ జీరో రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అంచనా వేస్తున్నారు. దీంతో నందిగ్రామ్ లో మమతా బెనర్జీ పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. నందిగ్రామ్ లో తాము తప్పకుండా గెలుస్తామని బీజేపీ ధీమాగా చెబుతోంది.   మమతా బెనర్జీ పోటీ చేసిన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం పుర్బా మిడ్నాపూర్ జిల్లాలో  ఉంది. ఈ జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గ్రౌండ్ జీరో రీసెర్చ్ సంస్థ సర్వే ప్రకారం పుర్బా మిడ్నాపూర్ జిల్లాలో టీఎంసీకి 6-7, బీజేపీకి 10-11 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీది అధికారమని చెప్పిన రిపబ్లికన్ సర్వేలో..  పుర్బా మిడ్నాపూర్ జిల్లాలో టీఎంసీ కేవలం మూడు స్థానాలకే పరిమితం కానుంది. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ వెనకబడి ఉందని రిపబ్లికన్ సర్వే స్పష్టం చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.  సువేందు అధికారితో మమత నేరుగా తలపడ్డ నందిగ్రామ్‌ అసెంబ్లీ స్థానంలో గట్టిపోటీ ఉందని, విజయం ఎవరిని వరిస్తుందో అంచనా వేయడం కష్టమని పలు సంస్థలు పేర్కొన్నాయి. ఒక వేళ టీఎంసీకి మెజార్టీ వ‌చ్చి నందిగ్రామ్‌లో మ‌మ‌త ఓడిపోతే మాత్రం అది ట్విస్టే అవుతుంది. అప్పుడు బెంగాల్ కొత్త ముఖ్య‌మంత్రి టీఎంసీ నుంచి ఎవ‌రు అవుతారు ? అన్న దానిపై కూడా అప్పుడే ర‌క‌రకాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఏదేమైనా బెంగాల్ ఉత్కంఠ‌కు వ‌చ్చే నెల 2వ తేదీన తెర‌ప‌డనుంది.   

కుమార్తె పెళ్లి కి రెడీ.. తండ్రి మృతి.. 

కుమార్తె పెళ్లికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఇంతలోనే కరోనా రూపంలో మృత్యువు ఇంటి పెద్దను కబళించిన సంఘటన ఉప్పల్‌లో చోటు చేసుకుంది. ఉప్పల్‌లోని భరత్‌నగర్‌కు చెందిన ఈగ నర్సింగ్‌రావు ముదిరాజ్‌(48).. ఉప్పల్‌ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మే 13న కుమార్తె వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఐదారు రోజుల క్రితం నర్సింగ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం రాత్రి ఆరోగ్యం విషమించడంతో..మరో ఆసుపత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్‌లో తీసుకొని బయలుదేరారు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా పడకలు లేవనే సమాధానమే వచ్చింది. రాత్రంతా ప్రయత్నించినా ఏ ఆసుపత్రిలోనూ ఆయన్ను చేర్చుకోలేదు. చివరకు తీసుకెళ్లిన అంబులెన్స్‌లోనే తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.     పెళ్ళికి 300 మంది. తల్లిదండ్రులపై కేసు నమోదు..  కరోనా నిబంధనల్ని పట్టించుకోకుండా వివాహానికి 300 మందిని ఆహ్వానించి, వివాహ విందును నిర్వహించిన ఉదంతమిది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెంటూరులో ఏర్పాటైన ఈ వేడుకకు సంబంధించి  పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో 50 మందికి మించకుండా వేడుకల్ని నిర్వహించుకోవాలని నిబంధనలు విధించారు. వీటిని పట్టించుకోకుండా పెళ్లి వేడుకకు 300 మంది హాజరయ్యారు. విషయం వాట్సప్‌ ద్వారా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై నివేదిక పంపాలని రామచంద్రపురం ఆర్డీవో గాంధీని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు విచారణ జరిపారు. విందు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీఆర్వో శాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడి తండ్రి సురేష్‌బాబు, వధువు తండ్రి  వెంకటేశ్వరరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు.      

శ్రీవారికి ప్రకృతిసిద్ధ నైవేద్యం..

బ్రిటీష్ కాలం‌ నాటి సాంప్రదాయంకు టిటిడి శ్రీకారం చుట్టింది.. దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన బియ్యంతో నేటి నుండి నైవేద్యం తయారు చేసి శ్రీవారికి సమర్పించనుంది. స్వామి వారి నైవేద్యంకు కావాల్సిన బియ్యంను అందజేసిన విజయరాం అనే భక్తుడు. ఏడాదిలో రోజుకో రకం చొప్పున 365 రకాల బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామి వారి నైవేద్యంగా పెట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్ లో కొనసాగించేందుకు టిటిడి నేరుగా రైతుల వద్ద నుండి బియ్యంను కొలుగోళ్ళు చేసెందుకు టిటిడి భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేయనుంది. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతినిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడి దర్శనార్ధం దేశ,విదేశాల నుండి వస్తుంటారు. గంటల తరబడి వేచి ఉండి క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్యమంగళ స్వరూపం కోసం పరితపించి పోతుంటారు. వేలాదిగా తరలివచ్చే భక్తులతో ఏడు కొండలు గొవింద నామస్మరణలతో మారుమ్రోగుతుంటుంది‌. స్వామి వారు ఎంతటి అలంకార ప్రియుడో.., అంతటి నైవేద్య ప్రియుడు కూడా. అందుకే శ్రీవారి ఆలయంలోని నైవేద్య పోటులో సాంప్రదాయబద్దంగా తయారు చేసిన వివిధ రకాల నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తుంటారు అర్చకులు. పూటకొక్క వంటకంతో స్వామి వారికి ఎంతో భక్తి భావంతో అర్చకులు నైవేద్యాలు సమర్పిస్తూ..స్వామి వారిని సంతృప్తి పరుస్తారు. అయితే గతంలో ఆనవాయితీగా 365 రకాల దేశీయ వరి వంగడాల బియ్యంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించే వారు. ఆ తర్వాత ఈ పద్ధతి నిలిచిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని టిటిడి తీసుకున్న నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి వరకు ఈ కష్టం తప్పదు.. కొవిడ్ వ్యాక్సిన్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు.. దేశంలోనే అతి పెద్ద ధార్మిక సంస్దగా టీటీడీ పేరుపొందింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరు గాంచిన వడ్డి కాసులవాడి ఆలయ పాలనా బాధ్యతలు నిర్వర్తించేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం 1933లో... కమిషనర్ల నేతృత్వంలో నడిచే పాలకమండలి వ్యవస్థను ఏర్పాటు చేసింది. మళ్లీ 1951లో చేసిన హిందూ మత చట్టం ప్రకారం కమిషనర్లందరినీ కార్యనిర్వాహక అధికారులు (ఈవో) గా మార్చింది. బ్రిటీష్ వారి పాలనకు ముందు 365 రకాల బియ్యంతో చేసిన ప్రసాదాన్ని స్వామి వారికి నివేదించే విధానంను అనుసరిస్తుండగా, కాలక్రమేణ ఈ సంప్రదాయానికి అప్పటి పాలకులు స్వస్తి పలికారు. వైఎస్ఆర్ రైతు భరోసా నమోదుకు ఇంకా రెండు రోజులే.. ఇలా దరఖాస్తు చేసుకోండి... అయితే శ్రీవారి ఆలయంలో స్వయంబుగా కొలువైయున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించే నేవేధ్యాలు అన్ని ఇన్ని కావు.. నిత్యం మూడు పూటలా 195 కిలోల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తుంటారు అర్చకులు.. దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్దంగా పండిన బియ్యంతో తయారు చేయబడిన నైవేద్యాన్ని సమర్పించే క్రతువు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుల సమక్షంలో ప్రారంభం‌కానుంది. ఇందుకు కావాల్సిన దేశీయ వంగడాల బియ్యంను కృష్ణా జిల్లా, గూడూరు మండలం, పినగూడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్ సంస్థ నిర్వాహకుడు ప్రకృతి వ్యవసాయవేత్త ఎం. విజయరాం ఈ సాంప్రదాయంకు తిరిగి రూపకల్పన చేశారు. గురువారం‌ మధ్యాహ్నం కృష్ణా జిల్లా నుండి 15 రకాల ప్రకృతిసిద్ధ బియ్యంతో వాహనం తిరుమలకు చేరుకుంది. గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో దేశీయ వ‌రి వంగ‌డాల‌తో పండించిన బియ్యం, కూర‌గాయ‌లను టిటిడి అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డికి తిరుమ‌ల శ్రీ‌వారికి విరాళంగా అందాయి. కృష్ణా జిల్లా పిన‌గూడురులంకకు చెందిన రైతు శ్రీ విజ‌య‌రామ్ ఈ మేర‌కు బియ్యం, కూర‌గాయ‌ల‌ను శ్రీ‌వారి ఆల‌యం ఎదుట టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.  పల్లెల కోసం సీఎం జగన్ కొత్త పథకం.. వైఎస్ఆర్ జయంతిరోజే లాంఛింగ్ గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో దేశీయ వ‌రి వంగ‌డాల‌తో పండించిన బియ్యంతో శ్రీ‌వారికి నైవేద్యం స‌మ‌ర్పించాల‌ని రైతు విజ‌య‌రామ్ టిటిడి ఛైర్మ‌న్‌, ఈవోను సంప్ర‌దించార‌ని టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ మేర‌కు మొద‌ట‌గా 10 రోజుల పాటు స్వామివారికి నైవేద్యం పెట్టే అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి గానూ 2,200 కిలోల బియ్యం, కూర‌గాయ‌లు, అర‌టిపండ్లు, బెల్లం, 15 కిలోల దేశీయ ఆవు నెయ్యి అందించార‌ని తెలిపారు. ఈ బియ్యంలో ప్రొటీన్లు, ఫైబ‌ర్, విట‌మిన్లు పుష్క‌లంగా ఉన్నాయ‌న్నారు. శుక్రవారం నుంచి ఈ బియ్యంతో త‌యారు చేసిన అన్న‌ప్ర‌సాదాల‌ను స్వామివారికి నైవేద్యంగా స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పారు. ఈ బియ్యం కావాల్సిన మోతాదులో దొరికితే రైతుల నుండే నేరుగా సేక‌రించి స్వామివారికి నైవేద్యంతో పాటు భ‌క్తుల‌కు అందించే అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి కూడా వినియోగిస్తామ‌న్నారు. ఎరువులు, పురుగుల మందులు వాడ‌కుండా పండించిన‌ ఇలాంటి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను వాడితే ప్ర‌జలంద‌రూ ఆరోగ్యంగా ఉంటార‌ని తెలిపారు. రైతు విజ‌య‌రామ్ మాట్లాడుతూ.. శ్రీ‌వారికి 365 రోజుల పాటు 365 ర‌కాల దేశీయ వ‌రి వంగ‌డాల బియ్యంతో నైవేద్యం స‌మ‌ర్పించే అవ‌కాశం క‌ల్పించాల‌ని టిటిడిని కోరారు. గో ఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా భూమి సార‌వంత‌మ‌వుతుంద‌ని, ఇలాంటి ఉత్ప‌త్తుల‌ను స‌మాజంలోని ప్ర‌జలంతా వినియోగించాల‌ని కోరారు..ఇందుకు దేశంలో ఉన్న ప్రకృతిసిద్ధ విత్తన ఉద్యమకారుల సహకారం తీసుకుంటున్నామని, పశ్చిమ బెంగాల్ కు చెందిన అనుమపస్వామి నుంచి 30 నుంచి 40 రకాలు, ఒడిశాకు చెందిన సబర్మతి నుంచి 10 రకాల ప్రకృతి సిద్ధ బియ్యాన్ని సేకరించి అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తిరుమలకు 15 రకాల వరి బియ్యం పంపించిన వాటిలో బహురూపి, నారాయణ కామిని, రత్నచోళి, కాలాబట్, చింతలూరు సన్నం, రాజ్బోగ్, రాజుడి, చిట్టి ముత్యాలు, బాస్బోగ్, తులసీబాసు, గోవింద్బోగ్, లాల్ చోనా, ఎర్ర బంగారం, మాపిళ్లే, సాంబ రకాలు ఉన్నాయి. వీటిని వికారాబాద్, గూడూరు మండలం పినగూడూరు లంక ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పండించినవిగా వివరించారు.  

వాళ్లు పరీక్షలు ఎలా రాస్తారు? పున‌రాలోచించాలన్న ఏపీ హైకోర్టు 

క‌రోనా విజృంభ‌ణ రోజురోజుకీ పెరిగిపోతున్న‌ప్ప‌టికీ ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించడానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.  దీనిపై వ‌చ్చిన పిటిషన్ల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై పున‌రాలోచించాలని ఏపీ స‌ర్కారుని హైకోర్టు సూచించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ కౌన్సిల్‌ చేసిన వాదనలో.. చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు.. పరీక్షల్లో భాగం కావాల్సి ఉందని పేర్కొంది. అందువల్ల ప్రభుత్వం వెంటనే పున:పరిశీలన చేసుకోవాలని సూచించింది.  కొవిడ్‌ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉండాలి కదా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారని... అదెలా సాధ్యమవుతుందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్‌ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతో పాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. మే 2లోపు ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఆక్సిజన్ కోసం రాగిచెట్టు కింద కూర్చోండి! కరోనా రోగులపై యూపీ పోలీసుల క్రూరత్వం 

కరోనా విలయానికి దేశం అల్లాడిపోతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ బాటలోనే ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. వారం రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ అందక రోగులు నరకయాతన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టాలంటూ హాస్పిటల్ కు వస్తున్న కరోనా రోగుల పట్ల యూపీ పోలీసులు క్రూరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆక్సిజన్ సిలిండర్ల పట్టుకుని ప్లాంట్ల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో  పోలీసులు కరోనా పేషెంట్ బంధువులకు వింత పరిష్కారాలు చెబుతున్నారు. ‘రావి చెట్టు కింద కూర్చోబెట్టండి.. ఆక్సిజన్ దానంతట అదే పెరుగుతుంది’’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో చాలా మంది పేషెంట్లకు ఇలాంటి పరిస్థితులే ఎదరవుతున్నాయి. కరోనా సోకిన తన తల్లిని ఆసుపత్రికి తీసుకు వెళితే ఆక్సిజన్ సిలిండర్లుగానీ, క్యాన్లుగానీ, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు గానీ లేవన్నారని, ఆక్సిజన్ కోసం అక్కడి రావి చెట్టు కింద కూర్చోపెట్టాలంటూ పోలీసులు సూచించారని ఓ కరోనా పేషెంట్ కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ పోలీసులు ఇదే విషయం చెబుతున్నారని మరో వ్యక్తి అన్నారు. కరోనా పేషెంట్లు ఇంట్లోనే ఉండాలంటూ చెబుతున్నారని, కానీ, ఇంట్లోనూ ఆక్సిజన్ అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఓ రోగి తాలూకు బంధువు కన్నీరుమున్నీరయ్యాడు. ఆసుపత్రులకు వెళితే అక్కడ బెడ్లన్నీ ఫుల్ అయిపోయాయని అన్నాడు. తన తండ్రికి ఆక్సిజన్ కోసం ఎన్ని ప్లాంట్లు తిరిగినా దొరకట్లేదన్నాడు. ప్లాంట్ దగ్గరకు వస్తే మాట్లాడేవారే ఉండరని వాపోయాడు. ఒక్కసారి మాట్లాడే చాన్స్ ఇవ్వాలని కోరినా.. పోలీసులు తరిమికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు కరోనా రోగి బంధువు. 

దళారుల గుప్పిట్లో ప్రజా ఆరోగ్యం ..

అన్నిరంగాలలో దళారులే కీలక పాత్ర అన్నది నిజం. అయితే ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరాలంటే. దళారులు. పెంక్షన్లు. ఇల్లు. ఆకరికి స్చూళ్ళు. కాలేజీసీట్లు ఇలా ఒక్కటి ఏమిటి, కొన్ని ప్రభుత్వాల హయాంలో అన్ని శాకల లోను దళారులు చొరబడ్డారు. ఈదళారులు ఎంతగా ప్రభావం చూపుతున్నారంటే ప్రభుత్వ పధకాలు కావాలంటే మాకే ఓట్లు వీయలంటూ ఈ దళారులు భయపెట్టేస్తాయికి ఎదిగిపోయారు. ఇక రైతు పండించిన పంటకు మద్దతు నిచ్చేది ప్రభుత్వం కాదు మధ్య దళారీ లే. మొత్తంగా చెప్పాలంటే అన్నిమార్కెట్ లో అన్ని రంగాలను శాసిస్తోంది దళారులే అన్నది వాస్తవం.రాజుల కాలం లో సైతం దళారులు ఉన్న వారిపై నిఘా వ్యవస్థ పనిచేసేది ప్రజలను ఇబ్బంది పెట్టె ఏ సమాచారం అందినా రాజాస్థానంలో విచారణ జరిపి శిక్షించేవారు ఆరకంగా కొంతమేరకు దళారులపై ఉక్కుపాదం మోపేవి రాజ సంస్థానాలు ప్రజా ప్రభుత్వాలు మాత్రం ఇటు ఇల్లు కట్టుకుంటే అనుమతికి, అటు స్థలాల అమ్మకాలు కొనుగోళ్ళు. లైసెన్స్ కావాలన్నా, నల్ల నీళ్ళు కావాలన్నా ముఖ్యమంత్రి సహాయనిది నుంచి ఆఖరికి తాము ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటీ చేయాలన్నా దళారుల పాత్ర కీలకంగా మారింది. ఈ వ్యవస్థ ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు అసలు ప్రభుత్వ అవినీతికి మూలాలు దళారులే . ఇక ఇప్పుడు ప్యాండమిక్ ను అదునుగా భావించిన దాళారులు మెడికల్ మాఫియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈమేరకు ప్రభుత్వ ప్ప్రైవేట్ ఆసుపత్రులలో బెడ్లు, చికిత్స కోసం దళారులదే పెత్తనం సాగిస్తున్నారు. అందినంత మేర దండుకుంటున్న ఈ దళారులు తమ వంతు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎలా అన్నదేగా మీ ప్రశ్న ఆసుపత్రిలో చేరడంఇన్సురెన్స్, చికిత్చ, ఆతరువాత దిక్కులేక మరణిస్తే శవాల మీద చిల్లర ఏరుకునే చందాన అంబు లెన్స్, దహన సంస్కారాలకు ప్యాకేజి పెట్టి మరీ వ్యాపారం చేస్తున్న ఈ దళారులను ఏమనాలి ? అదిఅలా ఉంటె ఇక మందులు, వ్యాక్సిన్ ల కృత్రిమ కొరతకు కారణం ఈ దళారులదే అని అర్ధం అవుతోంది. భారాత్ లో కో వ్యాక్సిన్ పై ప్రజలు మొగ్గు చూపడం తో, దీని కోరత సృష్టిస్తేఅసలు వ్యాక్సిన్ కొరత సృష్టిస్తే మళ్ళీ వ్యాక్సిన్ కొత్తధరలువచ్చేదాకావ్యాక్సిన్ ఇచ్చేది లేదని ప్రైవేటుఆసుపత్రులు బీష్మించుకు కూర్చున్నాయని అంటు న్నారు వైద్య రంగ నిపుణులు.ఇక గత్యంతరం లేక వేరొక వ్యాక్సిన్ తీసుకోక తప్పని పరిస్థితిని దళారులుకల్పిస్తున్నరనేది నిజం.అని వైద్య రంగనిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే కోవిడ్ సమయంలో సైతం ప్రాణాలను రక్షించే మేడి సివిర్ లాంటి మందు ఇతర మందులను మార్కెట్లో లేకుండా చేస్తే కొరత సృష్టించడం లేదా ఎక్కువధరకు అమ్మి సొమ్ము చేసుకోడం చూస్స్తుంటే ఇబ్బిది ముబ్బిడిగా వైద్య అధికారులు ఇటు ఇతర సిబ్బంది తమ చేత నైనంత చేతివాటాన్ని ప్రదర్శించడం చూస్తే విద్యారంగంలో నే కాదు వైద్య రంగంలో కూడా దళారులు పీకలేనంత గా వేళ్ళు ఊనుకు పోయారాన్ని సామాజిక కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. నోరు ఉన్నవాడిదే రాజ్యం అని అలా కాదు కండ ఉన్నావా దిదే రాజ్యమని అనే వారు కోవిడ్ పరిస్థిని పూర్తిగా మార్చేసింది అటు మెడికల్ మాఫియా ఇటు దళారులు పూర్తిగా కమ్మేసారని సామాన్యుడు వాపోతున్నాడు ఇప్పటికైనా ప్రభుత్వాలు అలసత్వం వీడి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడి ప్రజలకు మేలైన వైద్య విధానాన్ని అందించాలని అమలుచేయాలని సామాన్యుడు మొరపెట్టుకుంటున్నాడు.

స్మగ్లింగ్ గేమ్.. పట్టుకోండి చూద్దాం..

స్మగ్లింగ్ మాఫియా , డ్రగ్స్ మాఫియా రోజు రోజుకు కొత్త టెక్నిక్స్ తో కొత్త పుంతలు తొక్కుతుంది. అధికారులకు దొరకకుండా కొత్త పధకాలు వేస్తుంది. అందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటుంది. ఎవరికీ అనుమానం విగ్రహాల్లోను. లో దుస్తువుల్లోనూ  డ్రగ్స్ దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు. తినే ఆహార పదారాల్లో దూర్చి దేశం దాటిచేస్తున్నారు. మరికొందరు మత్స్యకారుల బోటు మాటున తరలిస్తున్నారు. ఇలా ఒక్కటా రెండా.. ఎన్నో కొత్త  టెక్నిక్స్ ఫాలో అవుతున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ఎలా చేస్తారో వీడొక్కడే సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. డ్రగ్స్ క్యాప్సుల్స్‌ను మింగి, వాటిని కడుపులో దాచుకొని మలేషియాకు తరలించే సీన్.. ఈ మూవీకే హైలైట్. ఐతే అచ్చం అలాంటి ఘటనే ముంబై ఎయిర్‌పోర్టులో జరిగింది. కడుపులో డ్రగ్స్ క్యాప్సుల్స్ దాచుకొని ఇండియాకు తరలించిన ఇద్దరు ఆఫ్రికన్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 22న ఇద్దరు టాంజానియా దేశస్థులు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎప్పటిలాగే ఎయిర్‌పోర్టులో అధికారులు తనిఖీలు చేశారు. వారి ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది. అంతేకాదు చాలా నీరసించి పోయినట్లు కనిపించడంతో అనమానం పెరిగింది. వెంటనే ఎయిర్‌పోర్టులోని స్కానింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్షించారు. వారి పొట్టలో పెద్ద మొత్తంలో క్యాప్సుల్స్ కనిపించాయి. అధికారులకు వెంటనే వీడొక్కడే సినిమా గుర్తొచ్చింది. అనంతరం క్యాప్సుల్స్ బయటకు తీసి చెక్ చేస్తే.. అందులో కొకైన్ కనిపించింది. మొత్తంగా 2.22 కేజీల కొకైన్ ఉంది. దాని విలువ రూ.13.35 కోట్ల వరకు ఉంటుంది.ఇద్దరు నిందితులను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జ్యుడిషిల్ కస్టడీ విధించింది. దీని వెనక ఎవరున్నారు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరికి ఇవ్వాలనుకున్నారు? అనే కోణంలో ఆరాతీస్తున్నారు. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. వీడొక్కడే సినిమాల్లో అచ్చం ఇలాంటి సన్నివేశం ఉంటుంది. హీరో సూర్య ఫ్రెండ్ జగన్, మరికొందరు కూలీలు కడుపులో డ్రగ్స్ దాచుకొని మలేషియాకు తరలిస్తున్నారు. క్యాప్సుల్స్‌ను తేనెలో ముంచుకొని మింగేస్తారు. మలేషియా వెళ్లిన తర్వాత ఏనీమా ఇచ్చి సరుకును బయటకు తీస్తారు. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్ కడుపులో ఓ క్యాప్సుల్ పంక్చర్ అవుతుంది. అలా డ్రగ్స్ అతడి శరీరంలో కలిసిపోయి ప్రాణాలు కోల్పోతాడు. ఆ కూలీలకు డ్రగ్స్ ముఠాతో ఎలాంటి సంబంధం ఉండదు. ఎవరు ఇఛ్చారో.. ఎవరు తీసుకుంటారన్న వివరాలు తెలియదు. కేవలం డ్రగ్స్‌ను దేశం దాటించే వరకే వారి బాధ్యత. మిగతా పనంతా డ్రగ్స్ ముఠా చూసుకుంటుంది. అలా డ్రగ్స్ తరలించినందుకు కూలీలకు రూ.50వేల నుంచి లక్ష వరకు ఇస్తారు. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే జరగడంతో.. డ్రగ్స్ స్మగ్లింగ్‌పై మరింత నిఘా పెట్టారు పోలీసులు. ఇక హైదరాబాద్ లో  గ్రైండర్‌ మాటున తరలిస్తున్న అక్రమ బంగారాన్ని గురువారం శంషాబాద్‌ విమానాశ్రయ భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ అధికారుల కథనం ప్రకారం..హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌ నుంచి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఈకే-526 విమాన సర్వీస్‌లో స్వదేశానికి వస్తున్నాడు. ఈ క్రమంలో 2.8కిలోల బంగారాన్ని కరిగించి గ్రైండర్‌ ఆకారంలో తయారు చేసి లోపలి భాగంలో బిగించి తెస్తున్నాడు. శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగి బయటకు వస్తున్న సదరు ప్రయాణికుడి ప్రవర్తనపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని సామగ్రిని పరిశీలించగా అక్రమ బంగారం గుట్టురట్టయింది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.    

హీరో సిద్ధార్థ్ కు బెదిరింపులు! బీజేపీ టార్గెట్ చేసిందా? 

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినా.. రాజకీయ కాక మాత్రం ఆగడం లేదు. తనను బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ప్రముఖ నటుడు సిద్దార్థ్‌ ఆరోపించడం కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలు తన ఫోన్‌ నంబర్‌ని సోషల్ మీడియాలో లీక్ చేశారని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు.  తనని, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ పలువురు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన ట్వీట్ ను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు సిద్ధార్థ్.  ‘తమిళనాడు భాజపాకు చెందిన కొంతమంది నా ఫోన్‌ నంబర్‌ని లీక్‌ చేశారు.  సుమారు 500 ఫోన్‌కాల్స్‌.. అందరూ నన్ను తిడుతున్నారు. నా కుటుంబసభ్యులను అత్యాచారం, హత్య చేస్తామంటూ గడిచిన 24 గంటల నుంచి నన్ను హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్‌ నంబర్లు, వాళ్లు మాట్లాడిన రికార్డింగ్స్ అన్నింటినీ భద్రపరిచా. వాటిని పోలీసులకు అందిస్తున్నా’ అని సిద్దార్థ్‌ ట్వీట్ లో తెలిపారు.  టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో ఎన్నో చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న సిద్దార్థ్‌ గత కొన్నిరోజులుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు బీజేపీ కార్యకర్తలతో ఆయనకు ఆన్‌లైన్‌లో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా తనను ఫోన్ లో కొందరు బెదిరిస్తున్నారని,చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని సిద్ధార్థ్ ఆరోపించడంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మే2న జరగనుంది. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లోనూ డీఎంకే కూటమిదే విజయమని తేలింది. బంపర్ మెజార్టీతో స్టాలిన్ గెలవబోతున్నారని వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ టార్గెట్ గా సిద్ధార్థ్ తన వాయిస్ పెంచారనే చర్చ జరుగుతోంది. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై కొత్త సర్కార్ వచ్చాకా ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

రెమిడీసీవీర్ సీసాల్లో సెలైన్ వాటర్! ఇంత దారుణమా? 

దేశ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. తెలంగాణలోనూ రోజు రోజుకు కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ తో పాటు సీరియస్ పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్న రెమిడీసీవర్ ఇంజక్షన్లు దొరకడం లేదు. ఆక్సిజన్ అవసరమైన రోగులకు రెమిడీసీవీర్ ఇంజక్షన్ బాగా పని చేస్తుందని చెబుతున్నారు. దీంతో రెమిడీసీవీర్ ఇంజక్షన్ల కోసం రోగుల బంధువులు పరుగులు పెడుతున్నారు. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు ఎంటరయ్యారు. కరోనా కల్లోల సమయంలోనూ కాసుల కక్కుర్తితో నీచంగా వ్యవహరిస్తున్నారు.  కరోనా రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుంటూ  కొంతమంది ద్రోహులు వారి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.  నిజామాబాద్ లో వాడిపడేసిన రెమిడీసీవీర్ ఇంజక్షన్ సీసాల్లో సెలైన్ వాటర్ ను ఎక్కించి అమ్మేసిన ఘటన కలకలం రేపింది.నిజామాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు బయలాజికల్ వేస్ట్ క్రింద పడేసిన సీసాల్లో సెలైన్‌ను నింపి అమ్మారు. ఒక్కోటి ముప్పైవేలకు కరోనా బాధితులకు అమ్మారు. అయితే తీరా వాటిని పరీశించిన వైద్యుడు నకిలీవని తేల్చడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులకు విషయం చేరడంతో రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.. నిజామాబాద్ లోనే  కంచె చేనుమేస్తే అన్నచందంగా సర్కారు ఆసుపత్రిలో రేమిడేవిస్ ఇంజక్షన్లు పక్కదారి పట్టిస్తూ ఓ నర్సు అడ్డంగా దొరికిపోయింది. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ నర్సుగా పనిచేస్తున్న శ్రావణి.. ఆసుపత్రి నుంచి ఎంతో విలువైన రెండు రెమిడీసీవీర్ ఇంజక్షన్లను దొంగిలించి తన భర్త అరుణ్ అందించింది.. అరుణ్ వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్మకానికి పెట్టాడు.. నిఖిల్ సాయి హోటల్ వద్ద ఒక్కో డోస్ 25 వేల కు విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.. భార్య భర్తలపై కేసు నమోదు చేశారు. ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.  నిజామాబాద్ లో‌నే కాదు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మందులు అమ్మె ముఠాలు పేట్రేగిపోతున్నారు. శానిటైజర్ దగ్గర నుంచి రెమిడెసివర్‌ వరకు మొత్తం నకిలీవి తయారు చేస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలను అనువుగా మార్చుకొని అమాయకులను మోసం చేస్తున్నారు. వారి మాయలో పడి ప్రాణాన్ని కాపాడుకోవాలనే తొందరలో అడిగినంత డబ్బు కట్టి నకిలీవి కొంటున్నారు. తీరా మోసం జరిగిందని తెలిసి పోలీసులును ఆశ్రయిస్తున్నారు. 

కరోనా అప్ డేట్స్ .. 

దేశంలో క‌రోనా విలయం కొన‌సాగుతోంది. నిన్న‌ కొత్త‌గా 3,86,452 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,97,540 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 3,498 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,08,330కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,53,84,418 మంది కోలుకున్నారు. 31,70,228   మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,22,45,179 మందికి వ్యాక్సిన్లు వేశారు.     కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం  28,63,92,086 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,20,107 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.     తెలంగాణలో క‌రోనా కేసుల  విజృంభ‌ణ‌ కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,646 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 5,926 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,35,606 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,55,618 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,261గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 77,727 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,441 మందికి క‌రోనా సోకింది.