తగ్గేదే లే.. కరోనా కల్లోలమే..
మళ్లీ మూడున్నర లక్షల కేసులు. మరోసారి 2వేలకు పైగా మరణాలు. దేశంలో కరోనా విలయం ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 3,52,991 పాజిటివ్ కేసులు వచ్చాయి. 2,812 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కి చేరగా.. ఇప్పటివరకు 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 15.82 శాతానికి పెరిగింది. కొవిడ్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య 28,13,658కి చేరింది. ఆదివారం ఒక్కరోజే 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా కోటీ 43లక్షల మంది వైరస్‌ను ఓడించగా.. రికవరీ రేటు 83.05 శాతానికి పడిపోయింది. దేశంలో ఇప్పటి వరకూ మొత్తం 14,19,11,223 మంది వ్యాక్సిన్ తీసుకువడం ఒక్కటే కాస్త ఆశాకర పరిణామం.
ఎప్పటిలానే మహారాష్ట్రలో మరణమృదంగం మోగుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం మరణాల్లో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. తాజాగా అక్కడ 832 మంది మరణించగా.. 66వేలకు పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. 7 లక్షలమందికి పైగా కరోనాతో బాధపడుతున్నారు.
అటు, దేశ రాజధాని ఢిల్లీలో 22,933 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆదివారం 350 మంది ప్రాణాలు వదిలారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 35వేలు, కర్ణాటకలో 34వేల మందికి కరోనా సోకింది. కేరళ, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌లో వైరస్ భారీగా విజృంభిస్తోంది.
తెలంగాణలోనూ కరోనా కుమ్మేస్తోంది. కొత్తగా 6,551మందికి పాజిటివ్ వచ్చింది. తాజాగా, 43మంది చనిపోగా.. 3,804 మంది కోలుకున్నారు. జీహెచ్ఎమ్‌సీ పరిదిలో 1,418 మందికి కరోనా సోకగా.. తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 65,597కి చేరింది.