వందల కోట్ల దోపిడీ.. కరోనాతో వ్యాపారమా? ప్రభుత్వాల చేతగాని తనమా?
posted on Apr 26, 2021 @ 6:32PM
పుట్టినప్పటి నుంచీ ఆక్సిజన్ పీలుస్తూనే బతుకుతున్నాం. కరోనా వస్తే మాత్రం కృత్రిమంగా ఆక్సిజన్ పెడితేనే బతికే పరిస్థితి. సెకండ్ వేవ్ కొవిడ్ కల్లోలంలో ఆక్సిజన్‌కు ఫుల్ డిమాండ్. అందుకే అదిప్పుడు వ్యాపార వస్తువు.
రెమ్‌డెసివిర్. ఇది కరోనాకు కచ్చితమైన మెడిసిన్ కాకపోయినా.. ప్రస్తుత సమయంలో కొవిడ్ నుంచి ప్రాణాలను కాపాడే సంజీవిని. కరోనాతో ప్రాణాపాయంలో ఉన్న రోగిపై రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు బాగా పని చేస్తున్నాయి. కొవిడ్‌కు చికిత్స వచ్చేలోగా.. రెమ్‌డెసివిరే మెరుగైన మందు. అందుకే, ఈ ఇంజెక్షన్‌ను బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ వేలకు వేలు దండుకుంటున్నారు.
కరోనా సెకండ్‌వేవ్ తీవ్రంగా ఉంది. చాలా మందికి ప్రాణాంతకంగా మారింది. హాస్పిటల్‌లో చేరాల్సిన వారి సంఖ్య భారీగా ఉంటోంది. అందుకే, హాస్పిటల్ బెడ్స్‌కు బాగా గిరాకీ. అందుకే, ప్రైవేట్ హాస్పిటల్స్.. బిజినెస్ సెంటర్స్‌గా మారాయి. కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, బెడ్స్.. ఈ మూడు ఇప్పుడు ఏపీ, తెలంగాణలో అంగట్లో వస్తువులు. కాయ్ రాజా కాయ్ అన్నట్టు.. ఎవరు ఎక్కువ ధర పెడితే వారికే ఆ సేవలు. అంతా కృత్రిమ కొరత. అడ్డగోలు దందా.
రెమ్‌డెసివిర్. ఒక్కో ఇంజెక్షన్ ధర సుమారు 3వేలు. కానీ, 3వేలు పెడితే మార్కెట్లో రెమ్‌డెసివిర్ దొరకదు. డౌట్ ఉంటే ఓసారి ట్రై చేసి చూడండి. మీకే తెలిసొస్తుంది. 3వేలు ఇస్తే.. ఇంజక్షన్లు స్టాక్ లేవనే సమాధానం వస్తుంది. అదే, ధర ఎంతైనా పర్లేదు అని చెప్పి చూడండి. వెంటనే.. ఎన్ని కావాలి? సార్.. అనే ఆన్సర్ వస్తుంది. ఒక్కో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను బ్లాక్‌మార్కెట్‌లో సుమారు 30వేలకు అమ్ముతున్నారు. 3వేలు ఎక్కడ? 30 వేలు ఎక్కడ? ఎంత తేడా.. ఎంత ప్రాణాపాయం ఉన్నా.. మరీ అంత నిలువుదోపిడీ చేయాలా? రెమ్‌డెసివిర్ మెడిసిన్‌ను ఇలా బ్లాక్ మార్కెటింగ్ చేస్తుంటే.. ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? మందులతో ఇలా అడ్డగోలు వ్యాపారమేంటి? అని అడిగినా.. పట్టించుకునే పాలకుడే లేడు. అందుకే వాళ్లు అలా బరితెగిస్తున్నారు.
కేవలం రెమ్‌డెసివిర్ మాత్రమే కాదు.. ఆక్సిజన్ సిలిండర్లది అంతకు మించి దగా. కరోనా కాలంలో కాదేదీ అక్రమ వ్యాపారానికి అనర్హం. కొవిడ్ పాజిటివ్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో పావు వంతు మందికి ఆక్సిజన్ అవసరం అవుతోంది. మెడికల్ ఆక్సిజన్ షార్టేజ్ వల్ల చాలా హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ సిలిండర్స్‌ను రోగులనే తెచ్చుకోమంటున్నారు. ఇదే ఇప్పుడు మంచి వ్యాపార అవకాశంగా మారింది. ఏపీ, తెలంగాణలో ఆక్సిజన్ దొరకడం కష్టతరమైంది. ఆక్సిజన్ అందించే ప్లాంట్లు తక్కువగా ఉండటం.. వాటి ముందు భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. డిమాండ్ అమాంతం పెరిగిపోవడంతో.. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు.. హాస్పిటల్ మేనేజ్ మెంట్లు.. ఎవరికి వారే.. ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ చేస్తున్నారు కేటుగాళ్లు. నో స్టాక్ బోర్డులు పెట్టి.. బ్లాక్ మార్కెట్లో అడ్డగోలు ధరలకు అమ్ముకుంటున్నారు.
విజయనగరం మహారాజా హాస్పిటల్‌లో ఆక్సిజన్ అందక పలువురు చనిపోయారు. అర్థరాత్రే ఆ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిలిచిపోయిందని అంటున్నారు. తాము అప్పటికప్పుడు బయటికి వెళ్లి.. 16వేలకు ఒక సిలిండర్ చెప్పున.. 32వేలు పెట్టి రెండు ఆక్సిజన్ సిలిండర్లు కొని తెచ్చామని రోగి బంధువులు చెప్పారు. ఏపీలో ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ ఏ రేంజ్‌లో సాగుతోందో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇలా అక్రమార్కులు బరితెగించడానికి కారణం. ప్రస్తుత పాండమిక్ సిట్యూయేషన్‌లోనూ ఆక్సిజన్ సిలిండర్ల అమ్మకంపై సర్కారు సరైన విధానం అవలంభించకపోవడం.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపకపోవడం వల్లే ఇలా ప్రాణాలు నిలపాల్సిన ప్రాణవాయువు అంగడి సరుకుగా మారిందనే విమర్శ వినిపిస్తోంది.
ఇక, ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ అయితే చెప్పనవసరమే లేదు. చిన్నా, పెద్దా తేడా లేదు.. గల్లీలో దవాఖానా అయినా.. కార్పొరేట్ హాస్పిటల్ అయినా.. ఒకటే బాదుడు. ముందు నో బెడ్స్ అంటారు. బాధితుడు ప్రాణభయంలో ఉంటాడు. బిల్ ఎంతైనా కడతానంటాడు. ఇదే కదా వారికి కావలసింది. పేషెంట్‌ని అడ్మిట్ చేసుకోకుండానే.. లక్షల్లో డిపాజిట్ చేయిస్తారు. అలా, లక్షలు కట్టించుకున్నాకే.. బెడ్ ఇస్తారు. ఆ తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్స్‌లో ఉంటే.. అన్ని లక్షల బిల్లు కామన్. ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. ఎవరైనా బిల్లు కట్టలేకపోతే.. దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తమకు అధికంగా బిల్లు వేశారంటూ.. మంత్రుల ట్విట్టర్ ఖాతాలకు నిత్యం అనేక ఫిర్యాదులు వస్తుంటాయి. అయినా, ఏ పాలకుడూ వాటిని పట్టించుకోడు. ఇలా, కోట్లలో సాగుతోంది కార్పొరేట్ హాస్పిటల్స్ దందా. ప్రాణం పోసే వాడు దేవుడే.. మరి, ప్రాణం పోయేంత బిల్లు వసూలు చేసేవాడిని ఏమనాలి? ఈ దారుణాలను అడ్డుకోని పాలకులను ఎవరు నిలదీయాలి?
ఇలా.. కరోనా కాలంలో మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆసుపత్రి బెడ్లు.. అన్నిటినీ వ్యాపార వస్తువుగా మార్చేశారు. వీటి బ్లాక్ మార్కెటింగ్ విలువ.. వందల కోట్లలోనే ఉంటుంది. పాలకులు కన్నెర్ర చేస్తేనే గానీ.. ఈ పాపం ఆగదు? మరి, మొద్దు నిద్రలో ఉన్న నాయకులు.. ఈ దారుణాలను అడ్డుకుంటారా? కరోనాతో కష్టకాలంలో ఉన్న తమ ప్రజలను ఆదుకుంటారా?