దేశంలో కోవిడ్ సూపర్ స్పైడర్ ఆయనే!
దేశంలో కరోనా పంజా అంతకంతకు పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ విజృంభణ మాత్రం ఆగడం లేదు. మంగళవారం దేశంలో 3,60,960 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రికార్డ్ స్థాయిలో 3 వేల 293 మంది కరోనా కాటుకు బలయ్యారు. గత 24 గంటల్లో 2,61,162 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 29 లక్షలకు పైగా యాక్టివ్ కేసులుండటం ఆందోళన కల్గిస్తోంది. ఢిల్లీ, యూపీ, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, పంజాబ్ , కర్ణాటక రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్ర సర్కార్ నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, మీడియా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం.. రాజకీయ నేతల నిర్వాకాల వల్లే భారత్ భయంకర పరిస్థితుల్లోకి వెళ్లిందని చెబుతున్నాయి. తాజాగా భారతీయ వైద్య సంఘం కూడా కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీనే కొవిడ్ సూపర్ స్ర్పెడర్ అని, దేశంలో ప్రస్తుత దుస్థితికి ఆయనే కారణమని ఆ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ నవ్‌జ్యోత్ దహియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బెంగాల్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ర్యాలీలు, హరిద్వార్‌లో కుంభమేళాలు నిర్వహించారని, ఫలితంగా కొవిడ్ వ్యాప్తి పెరిగి మరణాలు పెరుగాయని, ఆస్పత్రులకు అంబులెన్సుల తాకిడి పెరిగిందని అన్నారు. ‘‘చాలా మంది రోగుల మరణాలకు మెడికల్ ఆక్సిజనే కారణం. దేశంలో చాలా చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటుచేసే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం వద్దే అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి’’ అని దహియా చెప్పారు.
ప్రధాని మోడీని ఉద్దేశించి దహియా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కుంభమేళా వల్లే ఢిల్లీ, యూపీ, గుజరాత్ లో కరోనా వేగంగా విస్తరిస్తుందని కేంద్ర వైద్య వర్గాలు కూడా చెబుతున్నాయి. ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోంలోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీనికంతటికి ఎన్నికల ర్యాలీలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రధాని మోడీ 20 ఎన్నికలు ర్యాలీల్లో పాల్గొనగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 30 సభలకు హాజరయ్యారు. వీటిని ఉదహరిస్తూ అంతర్జాతీయ మీడియా మోడీ, అమిత్ షాను టార్గెట్ చేస్తూ వరుస కథనాలు ప్రచురిస్తున్నాయి.