ఏపీలో అంతా రివర్స్! కొవిడ్ కట్టడిలోనూ సేమ్ సీన్
posted on Apr 27, 2021 @ 9:54AM
ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్లుగా అంతా రివర్స్ పాలన సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దేశమంతా ఒక దారి అయితే... ఏపీది మరో దారిలా ఉంది. జగన్ రెడ్డి సర్కార్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా... ఆయన వైఖరి మాత్రం మారడం లేదు. కరోనా మహమ్మారి కల్లోల సమయంలోనూ రివర్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారు జగన్ రెడ్డి. దేశమంతా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తే.. ఏపీలో మాత్రం నిర్వహించి తీరుతానంటూ పంతం పట్టి కూర్చున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని ఎవరూ చెప్పినా పట్టించుకోవడం లేదు జగన్ రెడ్డి. తాజాగా దేశమంతా మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తుండగా... ఏపీలో మాత్రం అది అమలు కావడం లేదు. నెల రోజుల తర్వాత అంటే జూన్ లో టీకాలు ఇస్తామని ప్రకటించింది ఏపీ సర్కార్.
కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయనున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించింది. అయితే ఏపీలో మాత్రం జూన్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీకా పంపిణీ కోసం సంబంధిత కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు జరగలేదన్నారు. కాబట్టి వీరికి టీకాలు ఇచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన వారు పేర్లు ఎప్పుడు నమోదు చేసుకోవాలన్న సమయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు.
అయితే కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టడమే పరిష్కారమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎంత వేగంగా వ్యాక్సినేషన్ చేపడితే అంత త్వరగా మహమ్మారి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. అందుకే కేంద్రం కూడా వ్యాక్సినేషన్ పైనే మొత్తం దృష్టి సారించింది. ప్రైవేట్ హాస్పిటల్స్ కు కూడా టీకాలు వేసే అవకాశం కల్పించింది. దేశమంతా వ్యాక్సినేషన్ పైనే ఫోకస్ చేసింది. మే1 నుంచి జరిగే వ్యాక్సినేషన్ కోసం అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఏపీ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వెళుతోంది. నెల రోజుల ఆలస్యంగా అంటే జూన్ 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి టీకాలు ఇస్తామని ప్రకటించింది. జగన్ సర్కార్ తీరుపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత కీలకమైన విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.