సంగంపై కక్ష.. నరేంద్రపై రచ్చ.. కేసు నిలుస్తుందా?
ధూళిపాళ్ల నరేంద్రకు సంకెళ్లు. సంగం డెయిరీ సర్కారు పాలు. అనుకున్నదంతా అయింది. ముందు నరేంద్రను సైడ్ చేశారు. ఆ వెంటనే సంగంను స్వాహా చేశారు. హమ్మయ్యా.. అని ప్యాలెస్‌లో పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే, ఇల్లు అలకగానే పండగ అయిపోదు. ఇలాంటి ఆక్రమణలు కోర్టుల్లో నిలబడవు. గతంలో వైఎస్సార్ హయాంలోనూ ఓసారి ఇలానే జరిగింది. సంగం డెయిరీ టార్గెట్‌గా రాష్ట్రంలోని అన్ని డెయిరీల పాలక వర్గాలను రద్దు చేశారు. అప్పటి ఛైర్మన్ రాజన్‌బాబు కోర్టుకు వెళితే.. జడ్జి చివాట్లు పెట్టి మరీ పాలక వర్గాన్ని పునరుద్దరించారు.
ఒకటా రెండా.. దశాబ్దాల చరిత్ర. పాడి రైతులతో అనేక తరాల అనుబంధం. అది కేవలం సంగం డెయిరీ మాత్రమే కాదు.. అది గుంటూరు రైతుల ఆత్మాభిమానం. సంగం పాలు తాగిన ప్రతీ ఒక్కరి నిండుగౌరవం. అలాంటి సంగం డెయిరీని.. ఒక్క జీవోతో లక్షలాది మంది రైతుల నుంచి దూరం చేస్తామంటే కుదురుతుందా? ఆగమేఘాల మీద డెయిరీని స్వాధీనం చేసేసుకుంటే అంతా అయిపోయినట్టేనా? కోర్టులు, చట్టాలు లేవా? అంటూ ఇప్పటికీ ధీమాగా ఉంటున్నారు ఇక్కడి రైతులు. మా సంగం.. ఎప్పటికైనా మాకే సొంతమంటున్నారు.
ప్రభుత్వ కుట్రలకు ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర మొనగాడిలా అడ్డు నిలిచాడు. అందుకే, అరెస్టుతో ముందు ఆయన్ను అడ్డుతొలగించుకున్నారు. ధూళిపాళ్లపై పెట్టిన కేసు కోర్టులో నిలవనే నిలవదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఎప్పుడో జరిగిన వ్యవహారానికి.. ఇప్పుడు కేసు పెట్టి.. నరేంద్రను ఇరికించే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఆ కేసులో ఎలాంటి బలం లేదని చెబుతున్నారు.
ధూళిపాళ్ల నరేంద్రపై దాఖలైన FIRలో ప్రధానమైనవి రెండు ఆరోపణలు. 10 ఎకరాల స్థలాన్ని సంగం డైరీ ఫౌండింగ్ ఛైర్మన్ డీవీసీ ట్రస్ట్‌కు మరల్చారనేది ఒక ఆరోపణ. ఆ 10 ఎకరాల వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. 1978లో సంగం రైతులు ఒక రోజు పాలు విరాళంగా ఇస్తే.. ఆ సొమ్ముతో 34 ఎకరాల స్థలాన్ని కొన్నారు. అందులోంచి 10 ఎకరాలను 2000 సంవత్సరంలో డీవీసీ ట్రస్ట్‌కు బదలాయించారు. మరి, ఆ సమయంలో సంగం డెయిరీ ఛైర్మన్‌గా ధూళిపాళ్ల లేనే లేదు. నరేంద్ర హయాంలో జరగని బదలాయింపునకు, నరేంద్ర ఛైర్మన్‌గా లేని సమయంలో జరిగిన వ్యవహారానికి.. నరేంద్రపై ఆరోపణ చేస్తూ కేసు పెట్టడం ఏసీబీకే చెల్లింది.
ధూళిపాళ్ల ఛైర్మన్ అయ్యాక.. ఆ 10 ఎకరాల స్థలంలో పాడి రైతులు, డెయిరీ ఉద్యోగుల కోసం హాస్పిటల్ కట్టించారు. ఆ ఆసుపత్రిలో సంగం సభ్యులందరికీ సగం ఖర్చుకే చికిత్స అందిస్తున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. 21 ఏళ్ల క్రితం జరిగిన విషయానికి ఇప్పుడు ధూళిపాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కోర్టులో ఇలాంటి కేసులు నిలబడవు అంటున్నారు.
ఇక, ధూళిపాళ్ల నరేంద్రపై మరో ఆరోపణ ఏంటంటే.. మాక్స్ చట్టం నుంచి కంపెనీ చట్టంలోకి సంగం డెయిరీని తీసుకొచ్చే క్రమంలో అక్రమాలు జరిగాయని. 2011వ సంవత్సరంలో ఇచ్చిన సర్టిఫికెట్స్.. DCO ఆఫీస్ రికార్డ్స్ లో కనిపించట్లేదు అని. అప్పటి అధికారి గురునాథం.. ఆ రికార్డ్స్ ఇప్పటికీ ఉండి తీరాలి అంటున్నాడు. కానీ, ఆ సర్టిఫికెట్స్ కనిపించడం లేదని.. అధికారులు అంటున్నారు. అందుకు, ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రనే బాధ్యుడంటూ.. ఆయనే ఆ ఫైల్స్‌ను గోల్‌మాల్ చేశారంటూ కేసు కట్టారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. మరి, అప్పుడు లేని కేసులు.. ఇప్పుడే తెరపైకి రావడం వెనుక దురుద్దేశ్యం దాగుందని అంటున్నారు.
సరే, కేసులు పెట్టారు. ముందు విచారణ చేయాలి కదా. అందులో దోషిగా నిరూపితమైతేనే అరెస్ట్ చేస్తారు గానీ, అలా కాకుండా ముందు అరెస్ట్.. ఆ తర్వాత ఎంక్వైరీ అన్నట్టు ఉంది సర్కారు తీరు అని తప్పుబడుతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే.. సంగం డెయిరీలో అవకతవకలు జరిగాయని.. ఏ ఒక్క పాడి రైతు గానీ, ఏ ఒక్క సంగం ఉద్యోగి కానీ.. ఫిర్యాదు చేయకపోవడం. ఇంత రచ్చ జరుగుతున్నా.. ఏ ఒక్క పాడి రైతు కూడా ధూళిపాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదంటే ఆయన పనితీరు, ఆయనతో అనుబంధం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
సంగం డెయిరీ టర్నోవర్‌ను వంద కోట్ల నుంచి 1100 కోట్లకు తీసుకెళ్లిన ఘనత ఛైర్మన్‌గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రదే. గడిచిన పదేళ్లలో 200 కోట్లు రైతులకు బోనస్ ఇవ్వడం.. రైతులకు సగం ఖర్చుకే వైద్యం అందించడం.. నరేంద్ర సారథ్యంలోనే సాధ్యమైంది. అందుకే, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర చేతిలో ఉన్న సంగం డెయిరీని ఎలాగైనా చేజిక్కించుకోవాలని జగన్‌రెడ్డి సర్కారు ఎప్పటి నుంచో స్కెచ్ వేస్తోంది. సంగంకి పోటీగా గుజరాత్ నుంచి అమూల్‌ని తీసుకొచ్చింది. ఎక్కువ ధరలు చెల్లిస్తూ రైతులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. అయినా, గుంటూరు, ప్రకాశం పాడి రైతులు సంగం వెంటే నిలిచారు. దీంతో.. సంగం డెయిరీని ఎలాగైనా దెబ్బకొట్టాలనే కసితో.. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సంగం డెయిరీని ప్రభుత్వ డెయిరీగా మార్చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఫుల్ హ్యాపీ కావొచ్చు కానీ.. ముందుంది ముసళ్ల పండగ. కోర్టులున్నాయి. చట్టాలున్నాయి. న్యాయం జరుగుతుందనే నమ్మకముంది. అన్నిటికీ మించి పాడి రైతుల ఆశీర్వాదముంది. సంగంకు ఏమీ కాదు.. నరేంద్రనూ ఏమీ చేయలేరు.