ఒక రోగితో 406 మందికి వైరస్! ఇంట్లో కూడా మాస్క్ మస్ట్..
posted on Apr 26, 2021 @ 6:08PM
దేశంలో కరోనా మహ్మమారి ఊహంచని విధంగా విలయ తాండవం చేస్తోంది. మొదటి దశతో పోల్చుకుంటే సెకండ్ వేవ్ లో కోవిడ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున 3 లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి నగరాల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మహారాష్ట్ర, యూపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉండటం ఆందోళన కల్గిస్తోంది.
కరోనా విజృంభణతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. కోవిడ్ బాధితులు వైద్యుల సలహా మేరకే హాస్పిటల్స్ లో చేరాలని చెప్పింది. కొందరు రోగులు లక్షణాలు లేకున్నా అనవసర భయాలతో హాస్పిటల్స్ కు వెళుతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వార్ అన్నారు. దీంతో కచ్చితంగా చికిత్స అవసరమైన బాధితులకు హాస్పిటల్స్ లో బెడ్లు దొరకడం లేదు. కరోనా బాధితులు ఖచ్చితంగా మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు లవ్ అగర్వాల్. ఒక రోగి నుంచి నెలలో 406 మంది వైరస్ సోకుతుందన్నారు.
మరోవైపు బయటికి వెళ్లినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం వచ్చిందని నీతి అయోగ్ ఆరోగ్య విభాగం వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉన్న నేపధ్యంలో నీతి అయోగ్ ఆరోగ్య విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ వీకే పాల్ ఈ సూచన చేశారు. ‘‘కోవిడ్ తీవ్రంగా ఉన్న కారణంగా అత్యవసరమైతే కానీ బయటికి వెళ్లొద్దు. కుటుంబ సభ్యులతో ఉన్న సరే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే ఈ సమయంలో ఇతరులను ఇంటికి పిలవకపోవడమే మంచింది’’ అని ఆయన చెప్పారు.