దేశంలో వ్యాక్సిన్ ధర ఎక్కువ! మోడీ సర్కారే కారణమా?
posted on Apr 27, 2021 @ 11:30AM
ఆంధ్రప్రదేశ్ లోని కడియం పూలకు ప్రసిద్ధి. అక్కడి నర్సరిలో స్థానికులు, ఏపీలో వాసులు కొనుగోలు చేస్తే రేటు తక్కువ. అదే హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లలో అయితే కడియం పూలకు డబుల్ రేట్. ఇలాంటి పరిస్థితే ఎక్కడైనా ఉంటుంది. పంటలు కూడా అంతే స్థానికంగా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు వస్తుంది.. బయట మాత్రం ఎక్కువ రేటు ఉంటుంది. కాని కొవిడ్ వ్యాక్సిన్ విషయంలో మాత్రం ఇండియాలో సీన్ రివర్సైంది. ఇండియాలోనే టీకాలు తయారవుతున్న మనకు ఇతర దేశాల కంటే వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచాన్ని గడగడలాస్తున్న కరోనా మహ్మమారి కట్టడి కోసం వ్యాక్సినే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఇండియాలో రెండు వ్యాక్సిన్లు తయారవుతున్నాయి. పుణెలోని సీరం ఇన్సిట్యూట్ లో ఆక్స్ ఫర్డ్ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారవుతుండగా.. హైదరాబాద్ లోని భారత్ బయో
టెక్ లో కోవాగ్జిన్ తయారవుతోంది. సీరమ్ సంస్థ ఇప్పటివరకు కేంద్ర సర్కార్ కు మాత్రమే ఒక్క డోసును 150 రూపాయలకు అందిస్తోంది. అయితే మే 1 నుంచి మాత్రం రాష్ట్రాలు, ప్రైవేట్ సంస్థలకు విక్రయించనుంది. ఇందుకోసం వ్యాక్సిన్ ధరలను ప్రకటించింది సీరమ్. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాను 4 వందల రూపాయలకు, ప్రైవేట్ సంస్థలకు 6 వందల రూపాయలకు ఇస్తామని తెలిపింది. అయితే ఈ ధరలు .. కొన్ని విదేశాలకు సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ ధర కంటే ఎక్కువ.
ఇండియాలో వ్యాక్సిన్ తయారవుతున్నా.. విదేశాల కంటే ఎక్కువగా ఉండటం ఏంటనే చర్చ వస్తోంది. సీరమ్ తీరును కొందరు తప్పుబడుతున్నారు.విదేశాలతో పోలిస్తే.. భారత్ లో వ్యాక్సిన్ ధర ఎందుకు ఎక్కువగా ఉందన్న నిలదీత మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఎక్కువైంది. ఇండియాలో తాము ప్రకటించిన వ్యాక్సిన్ ధరలపై వివాదం సాగుతుండటంతో సీరం సంస్థ వివిరణ ఇచ్చింది. అసలు కారణం చెప్పేసింది. భారత్ లో వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉండటానికి కారణం.. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరించిన విధానమేనని సీరమ్ సీఈవో పూనావాలా చెప్పారు. ఎందుకంటే.. కొన్ని దేశాలు వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉన్నప్పుడే నిధులు సమకూర్చుకోవటం.. ఒప్పందాలు చేసుకోవటమే కారణమని తెలిపారు. అందుకు భిన్నంగా భారత ప్రభుత్వం ఎలాంటి నిధులు అందంచలేదు. ఈ కారణంగానే ఒప్పందంలో భాగంగా కొన్ని దేశాలకు తక్కువ ధరకు తాము వ్యాక్సిన్ అందిస్తున్నట్లు చెప్పారు. రిస్కు తీసుకొని.. ప్రయోగ దశల్లోనే వారు నిధుల్ని సాయంగా అందించారని.. తమ పరీక్షలు ఫలించాయని చెప్పారు. భారత దేశంలోని వ్యాక్సిన్ ధరను అంతర్జాతీయ ధరలతో పోల్చి చూడటం సరికాదని స్పష్టం చేశారు.
పునావాలా చెప్పినదాన్నిబట్టి మోడీ సర్కార్ అస్తవ్యస్థ విధానం వల్లే వ్యాక్సిన్ ధర ఇండియాలో ఎక్కువగా ఉందనేది స్పష్టమవుతోంది. ప్రధాని మోడీ మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా అంటూ జబ్బలు చరుకుంటున్నారు. కొవిడ్ కట్టడి కోసం మన దగ్గరే టీకా తయారవుతుందంటూ గొప్పలు చెప్పారు. సీరమ్, భారయ్ బయెటెక్ కు వెళ్లి పరిశీలించి.. ఫోటోలు కూడా దిగారు. కాని ఇతర దేశాల మాదిరి ఆలోచన మాత్రం చేయలేదు. పీఎం కేర్ లో వేల కోట్ల రూపాయలు ఉన్నా.. టీకా తయారీ సంస్థలకు పరిశోధనల సమయంలో అడ్వాన్సులు మాత్రం ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు టీకా ధర పెరిగిపోయింది. మోడీ సర్కార్ తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎంతసేపు పబ్లిసిటి రాజకీయాలు తప్ప.. అవసరమైన ఆలోచనలు మాత్రం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మిగిలిన దేశాల మాదిరి.. కరోనా టీకాలపై జరుగుతున్న ప్రయోగాల సందర్భంలోనే మోడీ సర్కారు సీరంతో పాటు మిగిలిన సంస్థలకు అడ్వాన్సులు చెల్లించి ఉంటే.. ఈ రోజున ఈ స్థాయి ధరల్ని భరించాల్సి వచ్చేది కాదు. మిగిలిన దేశాలు ఆలోచించిన తరహాలో కేంద్రం ఎందుకు ఆలోచించనట్లు? అన్నది ప్రశ్న. ఈ లెక్కన చూస్తే.. మోడీ సర్కారు చేసిన తప్పునకు దేశ ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న భావన కలుగక మానదు.