బెజవాడలో బెడ్స్ ఫుల్.. ఏపీలో కరోనా కల్లోలం.. సీఎం జగన్ వైఫల్యం!
కొవిడ్ సోకితే ప్రమాదకరం. మీరు విజయవాడ, ఒంగోలు వాసులైతే అత్యంత ప్రమాదకరం. స్వల్ప వ్యాధి లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉంటే ఓకే. ఒకవేళ అనారోగ్యం ముదిరితే.. ఇక అంతే సంగతి. ఎందుకంటే, విజయవాడ, ఒంగోలు ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేవు. గంటల తరబడి వెయిట్ చేసినా బెడ్స్ దొరకని దుస్థితి. అంబులెన్సుల్లోనే పడిగాపులు గాస్తున్న కరోనా పేషెంట్స్ ఎందరో ఉన్నారు. హాస్పిటల్స్‌లో ఖాళీ లేక, సకాలంలో చికిత్స అందక వారంతా నరకయాతన పడుతున్నారు.
జనాలు కరోనాతో పిట్టల్లా రాలిపోతున్నారు. కొవిడ్ భయంతో మృతదేహాలు తీసుకెళ్లడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. విజయవాడ ఆసుపత్రి మార్చురీ దగ్గర ఆరుబయటే మృతదేహాలు ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
అటు, ప్రకాశం జిల్లా ఒంగోలులో పడకలు లేక కొవిడ్ రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గత మూడు రోజులుగా జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అనేక మందికి హాస్పిటల్‌లో చేరాల్సిన పరిస్థితి వస్తోంది. ఒంగోలు సర్వజన ఆస్పత్రిలో గత రెండు రోజులుగా కొత్తగా చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. ఆస్పత్రిలో మొత్తం 1100 పడకలు ఉండగా.. వాటిలో 850 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. అవన్నీ కొవిడ్ బాధితులతో నిండిపోయాయి. అత్యవసర కేసులు వస్తే ఎవరైనా డిశ్చార్జ్ అయితే చేర్చుకుంటున్నారు. వ్యాధి తీవ్రతతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి.. బెడ్స్ లేక నేల మీదే పడుకోబెట్టి ఆక్సిజన్ అందిస్తున్నారు. ఒంగోలు, విజయవాడతో పాటు ఏపీలో అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50,972 పరీక్షలు నిర్వహించగా.. 11,698 కేసులు పాజిటివ్ వచ్చాయి. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఏపీలో 10,20,926 మంది వైరస్ బారినపడ్డారు. 24 గంటల వ్యవధిలో 4,421 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,31,839కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 81,471 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా గుంటూరులో 1,581, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు నమోదయ్యాయి.
కొవిడ్‌తో తూర్పు గోదావరి, నెల్లూరులో ఆరుగురు చొప్పున; అనంతపురం, చిత్తూరులో నలుగురేసి; శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి ముగ్గురు చొప్పున; గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లాలో ఒక్కరు చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,616కి చేరింది.
పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ప్రభుత్వం మాత్రం పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయకపోవడంపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. విద్యార్థుల ప్రాణాలకు ఎవరు సీఎం జగన్ బాధ్యత వహిస్తారా? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. ప్రభుత్వం పంతానికి పోకుండా వెంటనే పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శిస్తున్నారు. కొవిడ్ విషయంలో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజలను పక్క దారి పట్టించేందుకే టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఏపీలో కొవిడ్ కల్లోలం సృష్టిస్తుంటే.. ఆసుపత్రిలో బెడ్స్ లేక రోగులు ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం చేతగాక, చేతులెత్తేసి.. ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షం ఆక్షేపిస్తోంది.