సంగంకి సంకెళ్లు.. అప్పుడు వైఎస్‌.. ఇప్పుడు జ‌గ‌న్‌..!

సంగం డెయిరీ ఛైర్మ‌న్ ధూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌. సంగం డెయిరీకి తాళాలు వేసేందుకే.. ధూళిపాళ్ల‌కు సంకెళ్లు వేశార‌నే విమ‌ర్శ‌. అమ‌రావ‌తిపై ప్ర‌భుత్వ కుతంత్రాల‌ను బ‌య‌ట‌పెట్టినందుకే న‌రేంద్ర‌ను టార్గెట్ చేశార‌నే ప్ర‌చారం. ఇలా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంగం డెయిరీ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. ఇది రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్యా?  లేక‌, ఏసీబీ చెబుతున్న‌ట్టు సంగం డెయిరీ నిజంగానే అక్ర‌మాల పుట్టా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సంగం డెయిరీ. గుంటూరు, ప్ర‌కాశం పాడి రైతుల‌కు పెన్నిధి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల కుటుంబాలకు ఆధారం. 2వేల కోట్ల వ‌ర‌కూ ఆస్తులు. దాదాపు 200 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు. సుమారు వెయ్యి కోట్ల ట‌ర్నోవ‌ర్‌. ఇలా, సంగం డెయిరీ ఆర్థిక వ‌ట‌వృక్షంగా ఎదిగింది.  సంస్థ ఆవిర్భావం నుంచి టీడీపీకి చెందిన వారే డెయిరీ చైర్మన్లుగా ఉన్నారు. ప్రస్తుతం డెయిరీకి ధూళిపాళ్ల‌ నరేంద్రకుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంగంపై పైచేయి సాధించేందుకు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాం నుంచే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయినా, టీడీపీ ప‌ట్టు కోలేదు. వైఎస్‌ హయాంలో ఆర్డినెన్స్‌ ద్వారా పాల‌క వ‌ర్గాన్ని ర‌ద్దు చేసి.. డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలిచ్చారు. వీటిపై అప్పటి చైర్మన్‌ కిలారి రాజన్‌బాబు కోర్టులో స్టే తీసుకురావటంతో వైఎస్‌కు ఎదురుదెబ్బ త‌ప్ప‌లేదు.  ఐదేళ్ల క్రితం ధూళిపాళ్ల నరేంద్ర.. క్షేత్రస్థాయిలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల మహాజనసభ తీర్మానంతో సంగం డెయిరీని సహకార పరిధి నుంచి కంపెనీ చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. అప్పట్లో చంద్రబాబు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా, నరేంద్ర మాత్రం అనుకున్నది సాధించారు. ఈ కారణంగానే నరేంద్రకు మంత్రి పదవిచ్చేందుకు చంద్రబాబు నిరాకరించారని అంటారు. ప్రస్తుత వైసీపీ సర్కారు సంగం డెయిరీపై టీడీపీ నేతల పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోతోందట. ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా డెయిరీ చైర్మన్‌గా కొనసాగుతూ గుంటూరు జిల్లాలో నరేంద్ర చక్రం తిప్పుతున్నారు. దీనిని వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆయన అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యలకు అసలు మింగుడుపడటం లేదంటున్నారు.  జ‌గ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. సంగం డెయిరీపై ప్ర‌తీకార చ‌ర్య‌లు మ‌రింత పెరిగాయంటారు. సంగం డెయిరీని దెబ్బ కొట్టేందుకే గుజ‌రాత్‌కు చెందిన అమూల్ మిల్క్‌ను ఏపీకి తీసుకొచ్చార‌ని చెబుతారు. అమూల్ త‌ర‌ఫున పాల సేక‌ర‌ణ‌కు అధిక ధ‌ర‌లు చెల్లిస్తూ.. రైతుల‌ను అటువైపు మ‌ళ్లించే ప్ర‌య‌త్నాలు జోరుగా జ‌రుగుతున్నాయి. అయినా, సంగంతో ద‌శాబ్దాల అనుబంధం ఉన్న పాడి రైతులు నేటికీ సంగం డెయిరీకే పాలు విక్ర‌యిస్తున్నారు. దీంతో.. అమూల్‌కు పాలు అమ్మ‌క‌పోతే ప్ర‌భుత్వ ప్రోత్సాహ‌కాలు ఇవ్వ‌మంటూ అధికారులు, పాల‌కులు బెదిరింపుల‌కు దిగ‌న సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద‌మ‌య్యాయి.  సంగం డెయిరీ ఛైర్మ‌న్‌గా ఉంటూ ధూళిపాళ్ల న‌రేంద్ర ఏళ్లుగా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌నేది ఎమ్మెల్యే రోశ‌య్య ఆరోప‌ణ‌. లాభాలు రైతుల‌కు పంచి ఇవ్వ‌కుండా.. డ‌బ్బులు దారి మ‌ళ్లించి న‌రేంద్ర వ్య‌క్త‌గ‌తంగా వేల కోట్లు కూడ‌బెట్టార‌ని అంటున్నారు. స‌రైన బోన‌స్‌లు ఇవ్వ‌కుండా.. సంగం డెయిరీ పేరుతో దోపిడీకి పాల్ప‌డ్డార‌ని.. అది బ‌య‌ట‌కు తీసేందుకే ఏసీబీ రంగంలోకి దిగింద‌నేది వైసీపీ పాయింట్‌. అలాంటిదేమీ లేద‌ని.. రైతుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు బోన‌స్‌లు ఇస్తున్నామ‌ని.. సంస్థ ఆస్తులు పెంచామ‌నేది ధూళిపాళ్ల వాద‌న‌. సంగం డెయిరీని దెబ్బ తీసేందుకే.. అమూల్‌ను తీసుకొచ్చి.. ఏసీబీ కేసులు పెట్టి.. భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌నేది టీడీపీ వ‌ర్ష‌న్‌. 2013లో సంగం డెయిరీని మ్యాక్స్‌ చట్టం నుంచి కంపెనీ యాక్ట్‌లోకి మార్చే ప్రక్రియలో అక్రమాలు జరిగాయనేది ప్ర‌స్తుత ఏసీబీ కేసు. ఆ కేసులో భాగంగానే ఛైర్మ‌న్‌ ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను, ఎండీ గోపాలకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. 

టీఆర్ఎస్ పై అసద్ గుస్సా.. ఆ పార్టీతో మిలాఖత్ అయినట్టేనా? 

తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు జరగబోతున్నాయా? అధికార టీఆర్ఎస్ కు షాగ్ తగలనుందా? అంటే అవుననే తెలుస్తోంది. టీఆర్ఎస్ కు మొదటి నుంచి మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న ఓ పార్టీ.. కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీఆర్ఎస్, 2014 నుంచి ఆ పార్టీకి నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటూ వస్తోంది ఎంఐఎం పార్టీ. అధికారికంగా రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా.. లోపాయకారిగా కలిసి పని చేస్తున్నాయి. ఓల్డ్ సిటీలో ఎంఐఎం పోటీ చేసి గెలుస్తుండగా.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం ఎంఐఎం కారు పార్టీకి సపోర్ట్ చేస్తూ వస్తోంది. తెలంగాణలో దాదాపు 25 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే గెలుపోటముల్లో కీలకం. అలాంటి అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్సే గెలిచింది. ఇందుకు ఎంఐఎం మద్దతే కారణం. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎంఐఎంకి మంచి ప్రాధాన్యత ఇస్తారు. హైదరాబాద్ ఎంపీ అసద్ కు సన్నిహితంగా ఉంటారు. అసద్ ఏం చెప్పినా కేసీఆర్ చేస్తారనే ప్రచారం ఉంది. గత డిసెంబర్ లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీ మినగా మిగితా ప్రాంతాల్లో ముస్లిం ఓట్లతోనే టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిచారని లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్ కు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తూ వస్తోంది పతంగి పార్టీ. ఎమ్మెల్సీ , రాజ్యసభ ఎన్నికల్లోనూ అండగా నిలుస్తోంది. అసెంబ్లీలోనూ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న అసద్ వాయిస్ ఇప్పుడు మారినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్లలో అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కొన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. అయితే జడ్చర్ల మున్సిపాలిటీలో మాత్రం సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు పతంగి పార్టీ నేతలు. నామినేషన్ల సందర్భంగా ఎంఐఎం, టీఆర్ఎస్ నేతల మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో జడ్చర్లలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ అసద్.. టీఆర్ఎస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాము టీఆర్ఎస్ కు సపోర్ట్ చేశామని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు మాత్రం తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జడ్చర్లలో పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థులను కొందరు అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు అసద్.  జడ్చర్లలో అసద్ మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ.. టీఆర్ఎస్ కు దూరం కానుందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ కు కటీఫ్ చెప్పాలని డిసైడ్ అయినందువల్లే అసద్ అలా మాట్లాడారని అంటున్నారు. అయితే టీఆర్ఎస్ కాకుంటే అసద్ ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  రాష్ట్రంలో టీఆర్ఎస్ తర్వాత బలమైన పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. అయితే బీజేపీకి ఎంఐఎం సపోర్ట్ చేసే ఛాన్స్ ఉండదు. ఇక కాంగ్రెస్ కు కూడా అసదు మద్దతు ఇవ్వలేరు . ఎందుకంటే కొంత కాలంగా ఆయన దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లకుండా అసద్ కుట్రలు చేస్తున్నారని, ఇందుకు బీజేపీ సపోర్ట్ ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బహిరంగ సభలతో పాటు పార్లమెంట్ వేదికగా కూడా బీజేపీతో పాటు కాంగ్రెస్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు అసద్. దీంతో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు దగ్గర కావడం అసాధ్యమంటున్నారు.  తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ ఏర్పాట్లలో ఆమె బిజీగా ఉన్నారు. ఖమ్మంలో సభ కూడా నిర్వహించారు. షర్మిల పార్టీ తెరపైకి వచ్చినపుడే.. ఆమెకు అసదుద్దీన్ మద్దతు ఇవ్వవొచ్చనే ప్రచారం జరిగింది. గతంలో వైఎస్సార్ తో సన్నిహితంగా ఉన్నారు అసద్. ఏపీ సీఎం జగన్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీతో కలిసి ఎంఐఎం కలిసి నడవవచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది. తాజాగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ఎంఐఎం చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. షర్మిల పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకోవడం వల్లే అసద్.. టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.అదే జరిగితే తెలంగాణలో కారు పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు అసద్... కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని.. జడ్చర్ల ఎన్నికల వరకే ఆ అగ్రహం ఉంటుందనే వాదన కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది.   

సీజేఐగా తెలుగు తేజం.. జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం 

భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ  ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతిథులు త‌క్కువ మంది హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు  ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు సీజేఐ ఎస్.ఎ.బొబ్డే పదవీకాలం ఏప్రిల్ 23తో  ముగియడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరించారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ రమణ చరిత్ర సృష్టించారు. 1966-67 మ‌ధ్య కాలంలో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా పనిచేశారు. 2014 ఫిబ్రవరి 17న జస్టిస్ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అంతకు ముందు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించారు. 1957 ఆగస్టు 27న కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జస్టిస్ రమణ జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న అడ్వకేట్‌గా ప్రస్థానం ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు, సెంట్రల్, ఆంధ్ర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లతో పాటు సుప్రీంకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవా, ఎన్నికల వ్యవహారాల్లో ప్రాక్టీస్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్ 27న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2003 మార్చి 10 నుంచి 2013 మే 20 వరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రమణ పనిచేశారు. 

సునామీలా సెకండ్ వేవ్.. దేశంలో మ‌ర‌ణ‌మృదంగం

మూడు ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌ట్లే. మూడు రోజులుగా మ‌ర‌ణ‌మృదంగం. దేశ‌మంతా క‌రోనా క‌ల్లోలం. మొద‌ట్లో మ‌హారాష్ట్ర‌లో భారీగా కేసులు. .ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్‌లు. సెకండ్ వేవ్‌లో వైర‌స్ విజృంభ‌ణ మామూలుగా లేదు. వ్యాప్తితో పాటు.. డ్యామేజీ ఎక్కువే. శ్వాస వ్యవస్థ మీద దెబ్బకొట్టి.. రోగుల ప్రాణాలు తీస్తోంది. రికార్డు స్థాయిలో సునామీలో చుట్టుముట్టేస్తోంది సెకండ్ వేవ్‌.  గడిచిన 24 గంటల్లో 3,46,786 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. వరుసగా మూడో రోజు కేసుల సంఖ్య 3 లక్షల పైనే ఉంది. ఇక మరణాలు కూడా భారీ స్థాయిలోనే ఉండటం భయాందోళనకు గురిచేస్తోంది. శుక్ర‌వారం 2,624 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481 చేరగా.. మ‌ర‌ణాల సంఖ్య 1,89,544.  క‌రోనా యాక్టివ్‌ కేసులు 25 లక్షల‌కు పైగానే ఉన్నాయి. మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 14.93శాతానికి పెరిగింది. శుక్ర‌వారం ఒక్కరోజే 2,19,838 మంది కొవిడ్ నుంచి కోలుకోవడం కాస్త సానుకూల పరిణామం. మొత్తంగా కోటీ 38లక్షల మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 83.92 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13,83,79,832 కోట్ల టీకా డోసుల పంపిణీ జరిగింది.    క‌రోనా కేసుల్లో ఇప్ప‌టికీ మ‌హారాష్ట్ర‌దే మొద‌టి స్థానం. శుక్ర‌వారం 66,836 మంది వైరస్ బారినపడ్డారు. మ‌హారాష్ట్ర‌లో మొత్తం కేసుల సంఖ్య 41.61లక్షలు దాటేసింది. యాక్టివ్‌ కేసులు ఏడు లక్షలకు చేరువయ్యాయి. కరోనా కోర‌ల్లో చిక్కుకున్న మహారాష్ట్రలో తాజాగా 773 మంది ప్రాణాలు కోల్పోయారు.  దేశరాజధాని దిల్లీలో కరోనా వైరస్ ప్రాణాంతకంగా విస్తరిస్తోంది. కొద్ది రోజులుగా 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల రికార్డు స్థాయిలో ఒక్కరోజే 28,395 మందికి వైరస్‌ సోకింది. తాజాగా 24,331 మంది కరోనా బారిన పడగా.. 348 మరణాలు సంభవించాయి. సుమారు 92వేల మంది కొవిడ్‌తో బాధపడుతున్నాయి. ఇది కూడా దిల్లీకి రికార్డు నంబరే కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, మెడికల్ ఆక్సిజన్ కొర‌త ఢిల్లీని వేధిస్తోంది. ఆక్సిజ‌న్ అంద‌క ప‌లు ఆసుప‌త్రుల్లో ప‌దుల సంఖ్య‌లో క‌రోనా రోగులు ప్రాణాలు విడుస్తుండ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఢిల్లీ ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ కోసం కేంద్రాన్ని ప‌దే ప‌దే కోరుతున్నా.. అటునుంచి స‌రైన స‌హ‌కారం అంద‌టం లేదంటూ విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  అటు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనూ కొవిడ్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. తెలంగాణ‌లో శుక్ర‌వారం 7వేల‌కు పైగా క‌రోనా కేసులు వ‌చ్చాయి. 33మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 58,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఎమ్మెల్యే రోజాకు కేసీఆర్ ఫోన్ 

చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఎమ్యెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిపై కెసిఆర్ ఆరా తీశారు. నెల రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె సర్జరీలు చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చెన్నైలోని తన నివాసంలో రోజా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు సిఎం కెసిఆర్.  ఎమ్యెల్యే రోజా త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. రోజా కుటుంబ సభ్యుల యోగక్షేమలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. సిఎం కెసిఆర్ ఫోన్ చేయడంపై ఎమ్యెల్యే రోజా ఆనందం వ్యక్తి చేశారు.  ఇటీవలే సీఎం కేసీఆర్‌ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం కెసిఆర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. సీఎం కేసీఆర్‌కు కరోనా సోకిన తర్వాత మంత్రి కేటీఆర్, ఎంపి సంతోష్ కుమార్ కు కరోనా సోకింది. దీంతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని రోజా ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కరోనా నుంచి బయటపడాలనికి దేవుడిని ప్రార్ధిస్తున్నానని రోజా తెలిపారు. కేసీఆర్ కుటుంబంతో రోజాకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లిన కేసీఆర్.. నగరిలోని రోజా ఇంటికి వెళ్లారు. అక్కడ అల్పాహారం తీసుకున్నారు. 

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్? మే తొలి వారంలో ప్రకటన? 

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తప్పదా? మే తొలివారంలో లాక్ డౌని విధించబోతున్నారా? అంటే దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత, కేంద్ర సర్కార్ నిర్ణయాలతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితి రావొచ్చంటున్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని, ‘చివరి అస్త్రం’గా మాత్రమే లాక్‌డౌన్ ఉండాలని ఇటీవలే ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో చివరి అస్త్రాన్ని ప్రయోగించే చాన్సే ఎక్కువగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో జరుపుతున్న సంప్రదింపులు.. ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే, జూన్ నెలలకు సంబంధించి ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించింది. పేద ప్రజలకు ఉచితంగా 5 కేజీల ఆహార ధాన్యాలు అందించబోతున్నారు.  పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దీనిని అందించబోతున్నారు.  ఈ పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూరుతుంది.  అయితే గతంలో లాక్ డౌన్ సమయంలో పేదలకు ఉచిత రేషన్ పంపిణి చేసిన విధంగానే ఇప్పుడు కూడా ఉచిత రేషన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుండటంతో మే నుంచి అంటే ఎన్నికల రిజల్ట్స్ తరువాత దేశంలో .. ఏ క్షణమైనా లాక్ డౌన్ విధిస్తారని అనుమానాలు కలుగుతున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్ళు నిండిన అందరికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు.  అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి వ్యాక్సిన్ అందించడానికి చాలా సమయం పడుతుంది.  ఇప్పటికే పరిస్థితులు భయానకంగా ఉన్నాయి.  ఇలానే ఉంటె మరిన్ని విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి మొదలు మాజీ ప్రధానులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, మంత్రిత్వశాఖల ఉన్నత కార్యదర్శులు కరోనా బారిన పడడం, కొద్దిమంది మృతిచెందడం, దేశవ్యాప్తంగా తీవ్రంగా ఆక్సిజన్ కొరత ఏర్పడడం, అనేక వందల శ్మశానాల్లో 24 గంటలూ శవాలు కాలుతూనే ఉండడం, ఆస్పత్రుల్లో బెడ్‌ల కొరత, రెమిడెసివిర్ ఇంజక్షన్లకు షార్టేజీ, ఐసీయూ బెడ్లన్నీ ఫుల్ కావడం, కరోనా టెస్టింగ్ మొదలు ఆస్పత్రిలో అడ్మిషన్, శ్మశానంలో అంత్యక్రియల వరకు ప్రతిదానికీ వెయిటింగ్.. ఇలాంటి అనేక అంశాలు భారత్‌లో వైరస్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి.మిచిగాన్ విశ్వవిద్యాలయం ఎపిడమాలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ ఈ నెల చివరికల్లా రోజూ ఐదు లక్షల కొత్త కేసులు, మూడు వేల కరోనా మృతుల సంఖ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలాంటివే ఇప్పుడు లాక్‌డౌన్ నిర్ణయానికి కారణమవుతున్నాయని అంటున్నారు . బహుశా అందుకే ముందుగానే రెండు నెలలకు రేషన్ ప్రకటించి లాక్ డౌన్ విధించే అవకాశం ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.    ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా కోసం ఆర్మీని రంగంలోకి దించారు. కంటోన్మెంట్ ఆసుపత్రులను సాధారణ ప్రజల చికిత్స కోసం అనుమతించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, ఆక్సిజన్, వెంటిలేటర్లు సహా అనేక అంశాలపై వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశారు. దేశంలో ‘ఎమర్జెనీ తరహా’ పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. మే 2వ తేదీ తర్వాత ఎప్పుడైనా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ పరిస్థితులు విషమిస్తే ఈ లోపే అలాంటి నిర్ణయాన్ని ఎంపిక చేసిన రాష్ట్రాలు, నగరాల్లో తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతాయని, దినకూలీపై ఆధారపడి బతికేవారి జీవనోపాధి దెబ్బతింటుంటుందని, ఆకలి చావులు పెరుగుతాయనే సందేహాలున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నివారణకు మరో మార్గం లేదని కేంద్రం భావిస్తున్నట్టు తెలిసింది.  గతేడాది లాక్‌డౌన్ నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకున్నందున పేదలు, సామాన్యులు పడిన ఇబ్బందులు ఈసారి పురావృతం కాకూడదన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే ఒక్కొక్కటిగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఐదు కిలోల బియ్యం, గోధుమల పంపిణీ అందులో భాగమని కేంద్ర ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకున్నాయి. 

తీన్మార్ మల్లన్నపై కేసు! 

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని సీతాఫల్ మండి ప్రాంతంలో మారుతి సేవా సమితి పేరుతో జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్న లక్ష్మీకాంత శర్మ  ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న  పై కేసు నమోదు చేశారు. దాదాపు వారం క్రితం తనకు ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న, రూ. 30 లక్షలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారని, తాను ఇవ్వకపోవడంతో మరుసటి రోజు నుంచి తన చానెల్ లో అవాస్తవ కథనాలను ప్రసారం చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమకు 22న లిఖిత పూర్వక ఫిర్యాదు అందిందని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. తీన్మార్ మల్లన్న చాలా కాలంతా తన యూట్యూ్బ ఛానెల్ లో కేసీఆర్ ను, టీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ గతంలోనూ అతనిపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ-వరంగల్- ఖమ్మం స్థానం నుంచి పోటీ చేసిన మల్లన్న.. అధికార పార్టీకి చుక్కలు చూపించారు. టీజేఎస్ అధినేత కొదండరామ్,  కాంగ్రెస్, బీజేపీ కంటే ముందు నిలిచి.. టీఆర్ఎస్ అభ్యర్థికి పల్లాకు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల కూడా కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ ను ఫాంహోజ్ కు పంపించడమే తన లక్ష్యమని చెప్పారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ నేతల డైరెక్షన్ లోనే లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు చేశారని, అందులో భాగంగానే కేసు నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి. 

కరోనా కల్లోలం.. భారత్ కు పాక్ సాయం! 

కరోనా మహమ్మారి విలయ తాండవంతో దేశంలో ప్రస్తుతం దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనాతో మరణాలు భారీగా సంభవిస్తున్నాయి. రోగులతో హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. సకాలంలో ఆక్సిజన్ అందక కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండియాలో కోవిడ్-19 విజృంభిస్తున్న నేపధ్యంలో.. ఇండియాకు సహాయం చేసేందుకు పాకిస్తాన్‌లోని ఈదీ అనే సామాజిక సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఈ విషయమై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ కూడా రాసింది. ఇండియాలో కోవిడ్ మహమ్మారి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, దీన్ని సహృదయంతో అర్థం చేసుకుని సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, తమకు అనుమతి ఇస్తే ఇండియాకు వచ్చి సహాయక చర్యలు ప్రారంభిస్తామని గురువారం మోదీకి రాసిన లేఖలో ఫైసల్ ఈదీ పేరుతో వచ్చిన లేఖలో రాసుకొచ్చారు. ‘‘ఇండియాకు సహాయం చేయడానికి ఈదీ ఫౌండేషన్ వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంది. మీరు అనుమతి ఇస్తే మా పూర్తి మద్దతు ఇస్తాం. మేం చేస్తున్న సహయానికి మీ నుంచి ఎలాంటి సహాయం తిరిగి కోరడం లేదు. ఇండియాలోని ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని మా బృందం భావిస్తోంది. ఆహారం, ఇంధనం, ఇతర అవసరాలు అన్నీ మా సంస్థే చూసుకుంటుంది. మా బృందంలో ఆరోగ్య అత్యవసర సిబ్బంది, డ్రైవర్లు, ఇతర సిబ్బంది, వారికి సహాయకులు ఉన్నారు. మీ ఆదేశాలనుసారం దేశంలో ఎలాంటి క్లిష్ట పరిస్థుతులు ఉన్న ప్రదేశాల్లో అయినా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా విజ్ణప్తిని మన్నించి మాకు అనుమతిని ఇస్తారని ఆశిస్తున్నాం’’ అని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈదీ ఫౌండేషన్ పాకిస్తాన్‌కు చెందిన సామాజిక సంక్షేమ సంస్థ. దీనిని అబ్దుల్ సత్తార్ ఈదీ అనే వ్యక్తి 1951లో స్థాపించారు. తన మరణం వరకూ ఆయనే ఆ సంస్థకు అధిపతిగా ఉన్నారు. ఆయన భార్య విల్‌క్విస్ నర్సు. పిల్లలను దత్తత తీసుకునుని పర్యవేక్షిస్తుంటారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఉంది. ఈ సంస్థ పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా 24 గంటలు అత్యవసర సేవలనను అందిస్తోంది. పునరావాస కేంద్రాలు, ఉచిత వైద్యశాలలు, వైద్య సహాయం, డ్రగ్ రీహాబిటేషన్ సర్వీసులు, జాతీయ, అంతర్జాతీయ అత్యవసర సేవలను ఈ సంస్థ నుంచి అందిస్తున్నారు.

ప్రభుత్వ పంతంతో ప్రాణాలకు పరీక్ష.. ఏపీ స్కూళ్లలో కరోనా పంజా.. 

దేశమంతా ఒకదారి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోదారి అన్నట్లుగా పరిస్థితి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు రాష్ట్రాలన్ని అల్లాడిపోతున్నాయి. కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువున్న రాష్ట్రాలన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. పరీక్షలను రద్దు చేశాయి. కేంద్రం కూడా సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసింది. జేఈఈ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది. ఏపీకి పక్కనే ఉన్న తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోనూ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు. సెకండియర్ పరీక్షను వాయిదా వేశారు. కాని జగన్ రెడ్డి సర్కార్ మాత్రం ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై పంతానికి పోతోంది. ఓవైపు ఏపీలో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నా.. ప‌రీక్ష‌ల ర‌ద్దుపై నిర్ణ‌యానికి వెన‌కాడుతోంది. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో పలు స్కూళ్లలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 12 మంది ప్రభుత్వ టీచర్లకు కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయింది. కందుకూరు బాయ్స్  హైస్కూల్‎లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‎గా పనిచేస్తున్న సీహెచ్ దేవిక ఇటీవల కరోనాతో మృతి చెందింది.సెకండ్ వేవ్‎లో ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలోనే కరోనాతో ముగ్గురు ఉపాధ్యాయులు ప్రాణాలు విడిచారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పదవ తరగతి చదువుతున్న 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పర్చూర్ మండలం చెరుకూరులో హైస్కూల్ లో అత్యధికంగా ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ప‌రీక్ష‌ల పేరుతో విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతోందంటూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా స‌ర్కారు ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వ స‌బ్ క‌మిటీ స‌మావేశ‌మైనా.. ఎగ్జామ్స్ ర‌ద్దుపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంపై త‌ల్లిదండ్రులు మండిప‌డుతున్నారు.

కరోనా రోగులతో మాట్లాడిన మంత్రి 

కరోనాతో దేశం అల్లాడిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ మహ్మమారి పంజా విసురుతోంది. తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కేసులు , మరణాలు సంభవిస్తున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా వైరస్ విజృంభిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కరోనా రోగులు పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బాధితులకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు.  తన సొంత నియోజకవర్గం పాలకుర్తి పరిధిలోని  పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లు, సీఐ లు, ఎస్సైలు,  డీఎంఅండ్ హెచ్ఓ, డాక్టర్లను టెలీకాన్ఫరెన్సులోకి తీసుకుని మంత్రి వారితో మాట్లాడారు. కొందరు కరోనా రోగులతోనూ మంత్రి మాట్లాడారు. వారి యోగ క్షేమాలను, అందుతున్న వైద్యాన్ని, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లి తెలుసుకున్నారు.  కొంచెం ధైర్యంగా ఉందాం. మీకు అన్ని విధాలుగా అండగా నేను ఉంటాను. మరీ ఇబ్బందులు అనిపిస్తే, నాకు గానీ, నా వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయండి. అంటూ రోగులకు భరోసా ఇచ్చారు దయాకర్ రావు, ఒకవైపు కరోనా బాధితుల స్థితిగతులను తెలుసుకుంటూనే, మరోవైపు ప్రజాప్రతినిధులు తిండికి ఇబ్బంది ఉన్నవాళ్లకు సపోర్ట్ చెయాలని సూచించారు. ఒకవైపు బాధితులకు  భరోసాని, ధైర్యాన్నినింపుతూ మరోవైపు ప్రజాప్రతినిధులు వారి అదుకోవాలని చెపుతూ వారితో  మంత్రి మాట్లాడారు.

కేజ్రీవాల్ కు ప్రధాని మోడీ క్లాస్ 

కొవిడ్ విజృంభణ, ఆక్సిజన్ కొరత, వైరస్ కట్టడి చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశం హాట్ హాట్ గా సాగింది. వర్చువల్ గా సాగిన ఈ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  కేంద్రాన్ని టార్గెట్ చేశారు. కరోనా పరిస్థితులపై ప్రధాని సమక్షంలో తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రస్థాయిలో ఉందని, ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర విషాదం తప్పదని అన్నారు. తాము ఈ పరిస్థితులను ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రుల సమావేశంలో కేజ్రీవాల్ తీరుపై ప్రధాని మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగంగా అసహనం ప్రదర్శించారంటూ కేజ్రీవాల్ కు క్లాస్ పీకారు. కేజ్రీవాల్ వైఖరి ఆక్షేపణీయం అని, ప్రోటోకాల్ కు విరుద్ధమని మోడీ స్పష్టం చేశారు. సమావేశ సంప్రదాయం ఇది కాదని స్పష్టం చేశారు. దీనిపై కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. తన మాటల పట్ల చింతిస్తున్నానని, భవిష్యత్ లో ఇలా జరగకుండా చూస్తానని ప్రధానికి హామీ ఇచ్చారు.  ప్రధాని సమావేశంలోనూ ఆక్సిజన్ అంశమే  ప్రధానంగా మారింది. కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉందని... పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినీ తనను క్షమించాలని కోరారు. దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ధరకు అందజేయాలని డిమాండ్ చేశారు.

ఏపీలో ఉచితంగా వ్యాక్సిన్.. నైట్ కర్ఫ్యూ

ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌. 18 ఏళ్లు దాటిన వారంద‌రికీ ఉచిత వ్యాక్సిన్. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అర్హులంద‌రికీ మే 1 నుంచి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామ‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. మంత్రులు, అధికారుల‌తో జ‌రిపిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  18 నుంచి 45 ఏళ్ల మ‌ధ్య ఉన్న ప్ర‌జ‌లు ఏపీలో 2 కోట్ల 4 ల‌క్ష‌ల మంది ఉన్నారు. వారంద‌రికీ ఉచిత వ్యాక్సిన్ కోసం 1,600 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌నుంది ప్ర‌భుత్వం.  మ‌రోవైపు, భార‌త్ బ‌యోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, హెటిరో డ్ర‌గ్స్ ఎండీ పార్థ‌సార‌థిల‌తో ఫోన్‌లో మాట్లాడారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌. ఏపీకి మ‌రిన్ని వ్యాక్సిన్ డోసులు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్ష‌న్లు స‌ర‌ఫ‌రా కూడా పెంచాల‌ని వారికి విజ్ఞ‌ప్తి చేశారు సీఎం జ‌గ‌న్‌. మరోవైపు కరోనా పంజా ధాటికి అతలాకుతలం అవుతున్న ఏపీ వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో శనివారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించారు.  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. రాత్రి కర్ఫ్యూ సందర్భంగా కఠిన నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరింతగా కరోనా వ్యాప్తి చెందకుండా వ్యాక్సినేషన్ ను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. 

ఏపీలో పెన్షన్ దారులపై పిడుగు! కోత పెట్టేందుకు కొత్త రూల్స్ 

సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందున్నాం.. ఇదీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా మంత్రులు ఎప్పుడు చెప్పే మాట. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ మరోలా ఉంది. పేదలకు అందిస్తున్న పెన్షన్లలో కోత పెట్టేందుకు రంగం సిద్దం చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. లక్షలాది మంది లబ్దిదారులను ఏరివేయడమే లక్ష్యంగా కొత్త రూల్స్ తీసుకువచ్చింది. జగన్ సర్కార్ తాజాగా పెట్టబోతున్న నిబంధనలతో లక్షలాది మంది పెన్షన్లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  పెన్షన్ లబ్ధిదారుల విషయంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బోగస్ లబ్దిదారులు ఎక్కువ ఉన్నాయనే సాకుతో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వైఎస్‌ఆర్‌ పింఛను కానుకలో భాగంగా కులవృత్తులు, మెడికల్‌ విభాగాల అర్హుల్ని గుర్తించేందుకు కొత్త నిబంధనలు పొందుపర్చింది. పెన్షన్ పొందాలంటే తప్పనిసరిగా దరఖాస్తుదారులు వారి కులవృత్తియే జీవనాధారం చేసుకొని ఉండాలన్నది కొత్త రూల్. మెడికల్‌, ఒంటరి పెన్షన్ల విషయంలోనూ ఇక, కఠినమైన రూల్స్ పాటించబోతోంది. వీటికి అవసరమైన పత్రాలను ఎక్సైజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.  దరఖాస్తు ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సంక్షేమ కార్యదర్శులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారులకు అందజేస్తారు. లబ్ధిదారుల వృత్తికి జియోట్యాగింగ్‌ చేసి వారి లాగిన్లు ద్వారా తిరిగి శాఖాధికారుల పరిశీలనకు పంపించాలి. అక్కడ అనుమతి లభించిన దరఖాస్తులకే ఎంపీడీవో, పురపాలిక అధికారులు మంజూరుకు సిఫార్సు చేస్తారు. ఈ ప్రక్రియను 21 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఏపీలో 61.28 లక్షల మంది వివిధ ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులుగా ఉన్నారు. అయితే జగన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన కొత్త రూల్ తో లక్షలాది మందికి గండమే. ఎందుకంటే ఇప్పుడు కులవృత్తులు ఎక్కడా సాగడం లేదు. అన్నింటా యంత్రాలు రావడంతో చేతివృత్తులు ఎప్పుడో మూలకు పడ్డాయి. దీంతో ప్రస్తుతం కులవృత్తుల విభాగంలో పెన్షన్లు తీసుకుంటున్న వారందరికి గండమే. కోత పెట్టడమే లక్ష్యంగా మెడికల్‌, ఒంటరి పెన్షన్ల విషయంలోనూ ఇక, కఠినమైన రూల్స్ పాటించబోతోందని తెలుస్తోంది. జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై పెన్షన్ లబ్దిదారుల నుంచి వ్యతిరేకత వస్తోంది.   

ఇదేమి రాజ్యం? కేసుల కుతంత్రం.. అరెస్టుల అరాచ‌కం..

ఆప‌రేష‌న్ టీడీపీ. టార్గెట్ చంద్ర‌బాబు. జ‌గ‌న్‌రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఇదే ల‌క్ష్యం. ప్ర‌తిప‌క్ష తెలుగుదేశాన్ని క‌ట్ట‌డి చేయ‌డ‌మే ఉద్దేశ్యం. కేసులు, అరెస్టులు. ఇవే వైసీపీ ఆయుధాలు. పోలీసులే వారి భ‌టులు. చంద్ర‌బాబు క్యాంప్ ఆఫీసును అక్ర‌మ నిర్మాణ‌మంటూ కూల్చేయ‌డంతో మొద‌లు.. ఈ రెండేళ్ల‌లో అలాంటి కక్ష్య సాధింపు చ‌ర్య‌లు అనేకం. చంద్ర‌బాబుతో స‌హా వ‌రుస‌బెట్టి నేత‌ల‌పై కేసులు పెడుతున్నారు. నోరున్న నేత‌లే వారి మెయిన్ టార్గెట్‌. చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కొల్లు ర‌వీంద్ర‌, చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, జేసీ బ్ర‌ద‌ర్స్‌, ప‌రిటాల శ్రీరామ్‌, క‌ళా వెంక‌ట్రావ్‌, నారాయ‌ణ‌, తాజాగా ధూళిపాళ్ల న‌రేంద్ర‌. ఇలా టీడీపీ బ‌డాబ‌డా నేత‌లంద‌రిపై కేసులు.. అందులో కొంద‌రి అరెస్టులు.  భ‌య‌పెట్ట‌డ‌మే వారి విధానం. నోరు మూయించ‌డ‌మే వారికి ప్ర‌ధానం. అధికార పార్టీ ఆగ‌డాల‌ను ప్ర‌శ్నించొద్దు. వారి అడ్డ‌గోలు చేష్ట‌ల‌ను నిల‌దీయొద్దు. ప్ర‌భుత్వ త‌ప్పుడు విధానాల‌ను త‌ప్పుబ‌ట్టొద్దు. ఒక‌వేళ అలా చేస్తే.. ఇలా కేసులు, అరెస్టుల‌తో బెంబేలెత్తిస్తున్నారు. పాల‌కులు త‌ల‌చుకుంటే కేసుల‌కు కొద‌వేముంటుంది అన్న‌ట్టు.. జిల్లాల వారీగా టీడీపీ స్ట్రాంగ్ లీడ‌ర్ల‌ను సెలెక్ట్ చేసుకొని వారిపైకి పోలీసుల‌ను వ‌దులుతున్నారు పాల‌కులు. అచ్చెన్నాయుడు. టీడీపీలో ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌. తెలుగుదేశంలో అంద‌రికంటే పెద్ద నోరు. అందుకే, చంద్ర‌బాబు త‌ర్వాత ప్ర‌ధానంగా టార్గెట్ చేసింది అచ్చెన్న‌నే. ఈఎస్ఐ కేసును త‌వ్వి.. దాన్ని అప్ప‌టి మంత్రి అచ్చెన్నాయుడు మెడ‌కు త‌గిలించి.. కేసు బిగించి.. అరెస్ట్ చేశారు. ఆ స‌మ‌యంలో అచ్చెన్న‌కు ఆప‌రేష‌న్ అయినా.. క‌నీస మాన‌వ‌త్వం కూడా చూపించ‌కుండా జైల్లో వేశారు. ఆ త‌ర్వాత ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డం.. క‌రోనా సోక‌డం.. ఇలా ఆయ‌న్ను బాగా ఇబ్బంది పెట్టారు. ఎంతైనా అచ్చెన్న క‌దా.. ఇలాంటి కేసుల‌కు, అరెస్టుల‌కు బెదిరే ర‌కం కాదాయ‌న‌. అందుకే టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా.. ఇప్ప‌టికీ వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాటానికి ఏమాత్రం వెన‌కాడ‌టం లేదు అచ్చెన్నాయుడు.  ఇక.. జ‌గ‌న్‌రెడ్డిని పేరు పెట్టి తిడుతూ.. ఆయ‌న్ని ఏమాత్రం కేర్ చేయ‌ని జేసీ బ్ర‌ద‌ర్స్‌పైనా ఇలాంటి పోలీస్ యాక్ష‌న్‌నే ప్ర‌యోగిస్తోంది ప్ర‌భుత్వం. జీసీ సోద‌రుల‌కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా ఉన్న ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌ను దెబ్బ తీసే ప్ర‌య‌త్నం చేస్తోంది. అక్ర‌మ రిజిస్ట్రేష‌న్లంటూ జేసీ ట్రావెల్స్‌కు చెందిన‌ వంద‌లాది బ‌స్సుల‌ను సీజ్ చేశారు. వారిని ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేశారు. అయినా.. తొడ‌గొట్టి మ‌రీ.. తాడిప‌త్రిలో పోటీ చేసి గెలిచి.. మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి సొంతం చేసుకొని జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చారు ప్ర‌భాక‌ర్‌రెడ్డి. జేసీ బ్ర‌ద‌ర్సా.. మ‌జాకా... ఇక‌, దేవినేని ఉమా. ప్రెస్‌మీట్ల‌తో సీఎం జ‌గ‌న్‌ను ఏకిపారేసే పోటుగాడు. నిత్యం మాట‌ల పోట్ల‌తో జ‌గ‌న్ స‌ర్కారును తూట్లు పొడుస్తుంటాడు. అందుకే, ఆయ‌నపైనా పోలీస్ కేసు న‌మోదైంది. మీడియా స‌మావేశంలో జ‌గ‌న్ ప్ర‌సంగ మార్ఫింగ్ వీడియో ప్ర‌ద‌ర్శించారంటూ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులైతే మ‌రీ చోద్యం. ఉమా నెల్లూరులో ఉండ‌గా.. విజ‌య‌వాడ‌లోని ఆయ‌న ఇంటికి నోటీసులు అంటించి.. రెండు గంట‌ల్లో క‌ర్నూలు సీఐడీ ఆఫీసుకు రావాలంటూ ఆదేశించారు. రెండంటే రెండు గంట‌ల్లో అన్ని జిల్లాలు దాటి ఆయ‌న ఎలా వ‌స్తారో ఖాకీల‌కే తెలియాలి. అందుకే, హైకోర్టు సైతం పోలీసుల తీరును త‌ప్పుబ‌ట్టింది. దేవినేని ఉమాకు కాస్త ఊర‌ట క‌ల్పించింది. జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని మార్చారంటూ ఉమాపై కేసులు పెడితే.. ఇక ప్ర‌తీరోజూ సాక్షి మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై లెక్క‌లేన‌న్ని కేసులు పెట్టాల్సి ఉంటుంద‌ని గుర్తు చేస్తున్నారు. తాజాగా, ధూళిపాళ్ల న‌రేంద్ర‌ను అరెస్ట్ చేసి మ‌రోసారి టీడీపీకి పోలీస్ యాక్ష‌న్ రుచి చూపించింది. సంగం డెయిరీలో అక్ర‌మాలంటూ తెల్ల‌వారుజామున వంద‌లాది మంది ధూళిపాళ్ల‌ ఇంటిని చుట్టుముట్టి ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. అసైన్డ్ భూముల కేసులో చంద్ర‌బాబు, మంత్రి నారాయ‌ణ‌ల‌పై పెట్టిన కేసు వెనుకున్న కుట్ర‌ను ఇటీవ‌ల న‌రేంద్ర బ‌హిర్గ‌తం చేశారు. ఎవ‌రి ఫిర్యాదు మేర‌కైతే కేసు పెట్టామ‌ని పోలీసులు చెప్పారో.. ఆ ఫిర్యాదుదారులే త‌మ‌కేమీ సంబంధం లేద‌ని చెప్పే వీడియోను ధూళిపాళ్ల బ‌య‌ట‌పెట్ట‌డంతో ఆయ‌న‌పై పాల‌కులు క‌సి పెంచుకున్నారు. సంగం డెయిరీ సాకుతో.. ఏసీబీ కేసుతో.. న‌రేంద్ర నోరు నొక్కేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కేసులు. అమ‌రావ‌తి ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటూ టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు, మాజీ మంత్రి నారాయ‌ణ‌ల‌కు నోటీసులు ఇవ్వ‌డం.. మ‌చిలీప‌ట్నం మ‌ర్డ‌ర్ కేసులో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ని అరెస్ట్ చేయ‌డం.. చింత‌మ‌నేనికి కేసుల ఉచ్చు బిగించ‌డం.. ప‌రిటాల శ్రీరాంపై చీటికీమాటికి కేసులు పెట్ట‌డం.. క‌ళా వెంక‌ట్రావును కేసులంటూ బెదిరించ‌డం.. ఇలా టీడీపీలో ఓ స్థాయి ఉన్న నేత‌లందరినీ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు టార్గెట్ చేస్తోంద‌ని త‌మ్ముళ్లు మండిప‌డుతున్నారు. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబును ప్ర‌జ‌ల‌తో క‌ల‌వ‌నీయ‌కుండా విశాఖ‌, రేణుగుంట‌ విమానాశ్ర‌యాల్లో అడ్డుకోవ‌డం, బ‌ల‌వంతంగా వెన‌క్కి పంపడం లాంటి చ‌ర్య‌ల‌తో టీడీపీ శ్రేణుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేసే ప్ర‌య‌త్నం చేసింది. తాజాగా.. క‌రోనా క‌ల్లోల స‌మ‌యంలోనూ ధూళిపాళ్ల న‌రేంద్ర ఇంటిపై పోలీసులు పెద్ద సంఖ్య‌లో రైడ్ చేసి ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. రాష్ట్ర అభివృద్ధిని, క‌రోనా క‌ట్ట‌డిని ప‌క్క‌న‌పెట్టి.. కేవ‌లం టీడీపీపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌పైనే ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా ఫోక‌స్ పెడుతోందంటూ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. పాల‌కులు తీరు మాత్రం మార్చుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వం.. పోలీసుల సాయంతో.. కేసులు, అరెస్టుల‌తో ఇంత‌గా టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్నా.. ఎక్క‌డా తెలుగు త‌మ్ముళ్లు మాత్రం అద‌ర‌డం లేదు.. బెద‌ర‌డం లేదు.. అదీ తెలుగుదేశం నాయ‌కుల క‌మిట్‌మెంట్ అండ్ క‌రేజ్‌.

విమానంలో కరోనా రోగి తరలింపు! సోను సూద్ కు సెల్యూట్ 

ఎవరికి ఏ కష్టమెచ్చినా నేనున్నాంటూ అండగా నిలబడుతున్న రియల్ హీరో సోనూసూద్ మరోసారి తమ సేవానీరతి చాటుకున్నారు. కోవిడ్ భారీన పడి క్వారంటైన్ లో ఉన్నా .. పేదలకు ఆపద్భాందవుడిగా నిలుస్తున్నారు. తాజాగా  తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ -19 రోగిని ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు సోను సూద్.  కరోనా సోకడంతో భారతి అనే అమ్మాయి దాదాపు 85-90% ఊపిరితిత్తులను కోల్పోయింది, సోను ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు.  ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు, ఇది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అతను తెలుసుకున్నాడు, దీనిలో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు.  ఈ ECMO చికిత్స కోసం మొత్తం సెటప్ హైదరాబాద్ నుండి 6 మంది వైద్యులతో ఒక రోజు ముందుగానే రావాలి.  ఇందుకోసం ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు.  హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో భారతికి ఉత్తమమైన చికిత్సను పొందగలిగారు. భారతీకి సాయంపై సోను సూద్ మాట్లాడుతూ “అవకాశాలు 20% మాత్రమే అని వైద్యులు. ఆమె 25 ఏళ్ల యువతి,   అందుకే మేము ఈ అవకాశాన్ని తీసుకున్నాము, వెంటనే ఎయిర్ అబులెన్సు బుక్ చేసాము. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో  చికిత్స బాగా జరుగుతోంది, ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుంది. ” అని అన్నారు. కొవిడ్ సమయంలో  ఒకరిని విమానంలో చికిత్సకు తీసుకురావడం ఇదే మొదటి సందర్భం.  భారతి తండ్రి రిటైర్డ్ రైల్వే అధికారి. సోనుసూద్ సేవానీరతికి నెటిజన్లంతా సెల్యూట్ చేస్తున్నారు. హాట్సాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు.   

మోడీ ఎర్రకోట నుంచి.. కేసీఆర్ హుస్సేన్ సాగర్ లోకి దూకాలట! 

కరోనా మహమ్మారి నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాప్తిపై నిపుణులు సూచనలు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు.ప్రైవేట్ మెడికల్ కాలేజీలను, హాస్పటల్స్‌ను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, కరోనా వైద్యం అందించాలని రేవంత్ కోరారు.  కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడం మీద మోడీ దృష్టి పెడితే...  ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద కేసీఆర్ దృష్టి నిలిపారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  కరోనా విషయంలో హైకోర్టు తిట్లకు సీఎం కేసీఆర్ హుస్సేన్ సాగర్లో దూకాలని, సుప్రీం తిట్టిన తిట్లకు ఎర్రకోట మీద నుంచి దూకాలని సెటైర్లు వేశారు. ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి గౌరవం కాపాడుకోవాలని సూచించారు. ఆయన శాఖలోని అధికారులే ఆయన్ను గౌరవించడం లేదని రేవంత్ ఆరోపించారు.  హెటేరో డ్రగ్స్ యజమానులు మందులను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని రేవంత్  మండిపడ్డారు.హెటెరో డ్రగ్స్ యజమానులు, మంత్రి కేటీఆర్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామ్యం ఉందని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌ను దాయాది పాక్‌లో ఉచితంగా వేశారని, భారత్‌లో కూడా అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్‌ను వేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తు చట్టం కింద వ్యాక్సిన్, ఆక్సిజన్‌ను తయారు చేసే కంపెనీలను కేంద్రం స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రధాని మోడీ నిర్లక్ష్యం వల్లే వ్యాక్సిన్, ఆక్సిజన్ దేశంలో అందుబాటులో లేకుండా పోయాయని విమర్శించారు. భారత్‌లోనే వ్యాక్సిన్ తయా

భూముల అమ్మకాలకు బ్రేక్! జగన్ సర్కార్ కు షాక్ 

జగన్ రెడ్డి సర్కార్ కు హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. ప్రభుత్వ భూముల అమ్మకాలకు ఏపీ హైకోర్టు బ్రేకులు వేసింది. విశాఖలో భూముల అమ్మకాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. మహానగరంలో ఐదు చోట్ల భూములు అమ్మడానికి ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారించింది. గతంలో బిల్డ్ ఏపీ పేరున ఇలానే అమ్మకాలుకు ప్రయత్నించగా కోర్టు స్టే ఇచిందని పిటిషనర్ విన్నవించగా.. అవే ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికి కూడా వర్తిస్తాయని తెలిపింది. టెండరు ఖరారుపై  న్యాయ‌స్థాన తీర్పునకు లోబడే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.   విశాఖ నగరంలో ఐదు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌ భూముల అమ్మకానికి గతంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. అయినా జగన్ సర్కార్ ముందుకే వెళ్లింది. దీంతో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. విశాఖలో భూముల అమ్మకంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

సైన్యం స్వాధీనంలోకి ఆక్సిజన్ ప్లాంట్లు!  

కరోనా పంజాతో దేశం అల్లాడిపోతోంది. హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కళ్ల ముందే శ్వాస ఆడక రోగులు విలవిలలాడుతున్నా వైద్యులు ఏమి చేయలేక కన్నీళ్లు కార్చుతున్నారు. ఆక్సిజన్ కోసం కేంద్రంపై రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల మధ్య ట్యాంకర్ల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. ఆక్సిజన్ సరఫరాలో కేంద్రం తమపై వివక్ష చూపుతుందని కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.  ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి వర్చువల్ సమావేశంలోనూ ఆక్సిజన్ కొరతే ప్రధాన అంశమైంది. కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉందని... పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. పరిస్థితులు చేయిదాటిపోతే, మహా విషాదం తప్పదని అన్నారు. ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి, రోగి కొనఊపిరితో ఉన్నప్పుడు... ఆ పరిస్థితి గురించి తాను ఎవరితో మాట్లాడాలని సూటిగా ప్రశ్నించారు.   కొన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ రవాణా వాహనాలను ఆపేస్తున్నాయని... ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాలతో మాట్లాడాలని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా నిద్ర పట్టడం లేదని అన్నారు. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినీ తనను క్షమించాలని కోరారు. దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ధరకు అందజేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చడంతో కొవిడ్‌ నియంత్ర‌ణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై వివ‌రాలు తెల‌పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, రోగుల‌కు అవ‌స‌ర‌మైన ఔష‌ధాలు, వ్యాక్సినేష‌న్ పంపిణీ వంటి అంశాల‌పై విచార‌ణ ప్రారంభించింది. ఆసుప‌త్రుల్లో రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నార‌ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అన్నారు. ఔష‌ధాలు, వ్యాక్సినేషన్ కు అనుసరిస్తున్న విధానంతో పాటు లాక్డౌన్ ఆంక్ష‌ల‌పై ఆయ‌న ఆరా తీశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు. ఈ కేసులో సీనియర్ న్యాయవాది హరీశ్‌ సాల్వే అమికస్ క్యూరీగా తప్పుకున్నారు. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతి నిచ్చింది. 

బ్యాంకులకు హాఫ్ డే.. క‌రోనా ఎఫెక్ట్‌...

క‌రోనా పంజా బ్యాంకుల‌పై తీవ్రంగా ఉంది. నిత్యం ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధాలు ఉండే ఉద్యోగం కావ‌డంతో.. బ్యాంక్ సిబ్బంది భారీగా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఒక్క ఎస్‌బీఐ బ్యాంకులోనే 600ల‌కుపైగా ఉద్యోగుల‌కు క‌రోనా సోక‌డంతో బ్యాంక్ ఎంప్లాయిస్ హ‌డ‌లిపోతున్నారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఖాతాదారుల రక్షణ దృష్ట్యా బ్యాంకుల పని వేళలను కుదిస్తూ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ-ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి బ్యాంకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. వచ్చేనెల 15 వరకు.. లేదా, ఎస్‌ఎల్‌బీసీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పని వేళలు అమలవుతాయి. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగం ఇతర నిర్ణయాలు తీసుకుంటే అవే అమలవుతాయని కమిటీ స్పష్టం చేసింది.  అవకాశం, అవసరాన్ని బట్టి తమ శాఖలను తక్కువ మంది సిబ్బందితో నడిపేందుకు లేదా వారికి ఇంటినుంచే పని చేసేందుకు అనుమతి ఇవ్వడంపై నిర్ణయాధికారాన్ని బ్యాంకులకే ఇచ్చింది. కరెన్సీ చెస్ట్‌లు, ఏటీఎంలలో నగదు జమచేసే వెండర్లు, ఏటీఎం బ్యాక్‌ ఆఫీసులు, క్లియరింగ్‌- బ్యాంకు ట్రెజరీ- ఫారెక్స్‌ బ్యాక్‌ కార్యాలయాలు, ‘స్విఫ్ట్‌’ సెంటర్లతో పాటు ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల అధీకృత సెంటర్లు ఎప్పట్లాగానే పని చేస్తాయని తెలిపింది.  బ్యాంకింగ్‌ రంగ అధికారులు, ఉద్యోగులందరికీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్‌ఎల్‌బీసీ కోరింది. అధికారులు, ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు కూడా కరోనా టీకాలు వేయించేలా చూడాలని స‌ర్కారును కోరుతున్నారు.