పరీక్షలా.. ప్రాణాలా.. ఏటి? జగన్‌రెడ్డి వింటున్నావా?
posted on Apr 27, 2021 @ 12:45PM
ఏపీలో రోజూ వేలల్లో కరోనా కేసులు. పదుల సంఖ్యలో మృతులు. హాస్పిటల్స్‌లో బెడ్స్ కరువు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత. టెస్టుల ఫలితాలు ఆలస్యం. సెకండ్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌ను సునామీలా చుట్టేస్తోంది. నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అత్యవసరం ఉంటేనే ప్రజలు బయటకి రావాలని అంతా హెచ్చరిస్తున్నారు. కరోనా కల్లోలం ఈ రేంజ్‌లో ఉంటే.. ఇప్పుడు ఏమంత అత్యవసరం వచ్చిందని ఆంధ్రప్రదేశ్‌లో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కనీసం సీఎం జగన్ అయినా.. ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటారో మరి.
మేలో కొవిడ్ విజృంభణ తారాస్థాయికి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. జూన్‌లోనూ అది కొనసాగనుంది. జూన్ మొదటి వారంలోనే ఎగ్జామ్స్ అంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి స్పష్టం చేసేశారు. తగ్గేదే లే.. అంటూ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించేశారు. పరీక్షల రద్దు కోసం నారా లోకేశ్ ప్రతిరోజూ ప్రభుత్వంతో ఓ మోస్తారు యుద్ధమే చేస్తున్నా.. జగమొండి జగన్ మాత్రం పది, ఇంటర్ పరీక్షల రద్దుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఈ సమయంలో పరీక్షల నిర్వహణ.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమేననే విషయం ముఖ్యమంత్రికి తలకెక్కడం లేదు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, సామాన్యులతో పాటు సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న కీలకమైన వ్యక్తులు సైతం తప్పుబడుతున్నారు. ప్రస్తుత కొవిడ్ ఎమర్జెన్సీ పీరియడ్‌లో కొన్ని రాష్ట్రాలు స్కూల్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలనుకోవడం తనను షాక్‌కు గురి చేస్తోందంటూ మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఇలాంటి చర్యలు కరోనా పాండమిక్‌కు మరింత ఆజ్యం పోస్తాయని ఆయన అన్నారు. అయితే, ఎక్కడా ఏపీ పేరు ప్రస్తావించకున్నా.. పీవీ రమేశ్ చేసిన ట్వీట్ ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించే అంటున్నారు అంతా.
పీవీ రమేశ్, రిటైర్డ్ ఐఏఎస్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి. 35 ఏళ్ల పాటు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో పీవీ రమేష్ ప్రజా సేవ చేశారు. రిటైర్మెంట్ తర్వాత సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారు. అయితే, కొద్ది నెలలకే పీవీ రమేష్ తన పదవి రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
గతంలో ఏపీ ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ప్రస్తుత జగన్ సర్కారులోనూ నిన్న మొన్నటి వరకూ కీలకంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా సీఎంవోలో ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరుగా, కీలకమైన విద్య, వైద్యం వంటి శాఖల బాధ్యతలు చూశారు. గతేడాది కరోనా సమయంలో ప్రభుత్వం తరఫున సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయనే.. ఇప్పుడు కరోనా కాలంలో పరీక్షలు నిర్వహించడాన్ని తప్పుబడుతూ పరోక్షంగా ఏపీ సర్కారును కార్నర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన ప్రస్తుతం సీఎంవోలో ఉండి ఉంటే.. బహుషా ఈ నిర్ణయాన్ని తప్పకుండా వ్యతిరేకించి ఉండేవారు. పీవీ రమేశ్ ముక్కుసూటి వ్యవహారం, నిబంధనలకు కట్టుబడి పని చేసే పనితీరు నచ్చకే.. సీఎం జగన్‌రెడ్డి ఆయన ప్రాధాన్యత తగ్గించారు. పదవి వదిలి వెళ్లిపోయేలా చేశారని అంటారు.
పరోక్షంగా జగన్ ప్రభుత్వంపై పీవీ రమేశ్ కాంట్రవర్సీ ట్వీట్స్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన చేసిన పలు ట్వీట్స్ జగన్‌రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గతంలో విప్లవ రచయిత వరవరరావు అన్న మాటలను ఉటంకిస్తూ పీవీ రమేష్ ట్వీట్ చేయగా తీవ్ర చర్చనీయాంశమైంది.
“నేరమే అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే.. ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడు నేరస్తుడే!- వరవరరావు” అన్న కోట్‌ను పీవీ రమేష్ ట్వీట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఆ ట్వీట్ పెట్టారని బాగా ట్రోలింగ్ నడిచింది.
ఆ తర్వాత పంజాబ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ చేసిన ఓ ట్వీట్ను రీ ట్వీట్ చేసి.. మళ్లీ సంచలనంగా నిలిచారు. 1961 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కేబీఎస్ సిద్ధూ ఓ ట్వీట్ పెట్టారు. అందులో దేశంలో ఐఏఎస్ అనేది రాజకీయ నేతలు, వ్యాపారస్తులను మెప్పించే కస్టమర్ సర్వీస్ గా మారిపోయిందని వాపోయారు. ఆ.. రీ ట్వీట్‌తో మళ్లీ అగ్గి రాజుకుంది. సీఎం జగన్ సీఎంవోలో తనను ఏరికోరి తెచ్చిపెట్టుకున్న ఏడాదికే బాధ్యతల నుంచి తప్పించిన సందర్భంలో పీవీ రమేశ్ చేసిన ఆ రీ ట్వీట్ కలకలం రేపింది. ఆ ట్వీట్ చూస్తే.. జగన్ ఆయన్ను కస్టమర్ సర్వీసులా వాడుకుని వదిలేశారనే అర్దం వచ్చేలా ఉండటం అప్పట్లో ఏపీలో చర్చణీయాంశమైంది.
ఇటా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ చేసిన పలు ట్వీట్లు పరోక్షంగా జగన్ సర్కారును తూట్లు పొడుస్తున్నాయి. పీవీ రమేష్కు ప్రభుత్వ వర్గాల్లో సమర్ధుడిగా మంచి పేరుంది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా బాధ్యతలు నిర్వర్తించిన క్లీన్ రికార్డు ఆయనది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో సహజంగానే జగన్ సర్కార్ గతేడాది ఆయన్ను సీఎంవో బాధ్యతల్లోకి తీసుకుంది. చెప్పిన మాట వినకపోవడమో ఏమో కానీ.. ఏడాది తిరగ్గానే ఆయన బాధ్యతల్లో కోతపెట్టారు. పీవీ రమేష్‌ను పొమ్మనక పొగ బెట్టారు. సమర్థుడైన అధికారిని సీఎంవో నుంచి వెళ్లగొట్టడం వెనుక.. రకరకాల ప్రచారం జరిగింది. జగన్ తీసుకునే అసంబద్ధ నిర్ణయాలను రమేశ్ అంగీకరించే వారు కాదని.. పలు అంశాల్లో ఆయన ముఖ్యమంత్రి తీరును తప్పుబట్టారంటూ.. ఏవేవో వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అంతా సర్దుమనిగింది. అప్పుడప్పుడూ ఇలా ట్వీట్లతో ప్రభుత్వాన్ని పరోక్షంగా గిల్లుతూ.. జగన్‌రెడ్డి తీరును ట్విట్టర్‌లో ఎండగడుతూ.. పీవీ రమేశ్ తన ఆక్రోషాన్ని వెళ్లగక్కుతుంటారు. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించడం ఏంటంటూ.. మరోసారి ఆయన చేసిన ట్వీట్ కలకలంగా మారింది.
ఒక్క పీవీ రమేశ్ అనే కాదు.. పది, ఇంటర్ పరీక్షలపై జనమంతా మండిపడుతున్నారు. 50 మందితో ఫంక్షన్లు చేసుకోవడానికే అనుమతి ఇవ్వని ప్రభుత్వం.. వేలు, లక్షల్లో ఉండే విద్యార్థులతో పరీక్షలు ఎలా నిర్వహించాలని అనుకుంటుందో అస్సలు అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని ఓవైపు నిపుణులు చెబుతుంటే.. ఒకే రూమ్‌లో అంత మంది స్టూడెంట్స్‌ను కూర్చొబెట్టి ఎగ్జామ్స్ ఎలా జరుపుతారని అడుగుతున్నారు? కేంద్ర స్థాయి బోర్డులైన సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సైతం పది పరీక్షలు రద్దు చేయగా.. అనేక రాష్ట్రాలు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయగా.. ఒక్క ఏపీలో మాత్రం ఎందుకంత మొండితనం అని ప్రశ్నిస్తున్నారు. పరీక్షలకు తమ పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు బెదిరిపోతున్నారు. ఇవి పది పరీక్షలు కాదని.. తమ పిల్లల ప్రాణాలకు పరీక్ష అని వాపోతున్నారు. పరీక్షలు వద్దంటూ పేరెంట్స్, స్టూడెంట్సే అడుగుతుంటే.. ఇక ప్రభుత్వానికి ఇబ్బంది ఏముంది? ప్రజల కోసమేగా పాలకులు ఉండేది? మరి, పరీక్షలపై ఎందుకంత పంతం? బహుశా.. ఇప్పుడు వెనక్కి తగ్గితే ఆ క్రెడిట్ టీడీపీకి వెళ్తుందనే అక్కసు కావచ్చు. ఎగ్జామ్స్‌పై నిత్యం ప్రశ్నిస్తున్న నారా లోకేశ్‌కు మైలేజ్ వస్తుందనే భయం కాబోలు.. ఇలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం లక్షలాది విద్యార్థుల ప్రాణాలను పణంగా పెడతారా జగన్‌రెడ్డి గారు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏటి. వినబడుతోందా....