ఆరోగ్య మంత్రి ఎన్నికల ర్యాలీ.. జనాలకు ఇచ్చే సందేశం ఏంటీ?
posted on Apr 27, 2021 @ 12:20PM
దేశంలో కరోనా మహమ్మారి మరణ మదృంగం మోగిస్తోంది. రోజురోజుకు కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలోనూ కరోనా పంజా విసురుతోంది. సోమవారం ఏకంగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 52 మంది చనిపోయారు. ఇప్పటికే బెడ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. గాలిలో కూడా వైరస్ విస్తరిస్తుందని, జనాలెవరు ఇండ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా జనాలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాని మంత్రిగారు చెప్పేదొకటి, చేసేది ఒకటిలా ఉంది.
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారు మంత్రి ఈటల రాజేందర్. సోమవారం నగరంలోని పలు డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాస్కు లేకుండానే ప్రసంగించారు. ప్రచార రథంపై ఈటల పక్కన నిల్చున్న నేతలు కూడా మాస్క్ పెట్టుకోలేదు. దీంతో ఈటల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా కల్లోల సమయంలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించడమేంటనీ ప్రశ్నిస్తున్నారు. వందలాది మందితో ర్యాలీలు తీస్తూ.. మాస్క్ లేకుండా ప్రసంగిస్తూ.. ఈటల జనాలకు ఏం సందేశం ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా అయితే జనాలకు కొవిడ్ రూల్స్ ఎలా పాటిస్తారని నిలదీస్తున్నారు.
మంత్రి ఈటల ఎన్నికల ప్రచారానికి రావడమే కాదు.. ప్రచారానికి ‘టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై.. విజయవంతం చేయాలి’ అని ఆదివారం రాత్రి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. కరోనా కల్లోల సమయంలో ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలంటూ మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన ప్రకటనపై డాక్టర్లు, హెల్త్ ఎక్స్ పర్ట్స్ మండిపడుతున్నారు. కరోనాతో జనాలు చస్తుంటే, స్వయంగా హెల్త్ మినిస్టరే ర్యాలీలు చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై డాక్టర్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జనాలు చస్తుంటే.. ఇదేం పనంటూ ఫైరవుతున్నారు.
హెల్త్ మినిస్టరే ఇలా జనాలను పోగు చేస్తుంటే, ప్రజలను కాపాడేదెవరు.. ఇక ప్రజలకు ఆ దేవుడే దిక్కు’ అని డాక్టర్ విజయేందర్ పోస్ట్ చేశారు. ‘ప్రభుత్వ దవాఖాన్లలో హాస్పిటల్స్ లో క్యాథల్యాబ్ లేక జనాలు చస్తున్నారు. హెల్త్ మినిస్టర్ ఏదో కష్టపడుతున్నాడనే ఉద్దేశంతో.. వీటన్నింటిపై మేం కంప్లయింట్స్ చేయకుండా సర్దుకుపోతున్నాం. కానీ, ఇప్పుడు ఆయనే ఇలా జనాలను గ్యాదర్ చేస్తుంటే చాలా బాధగా ఉంది’ అని డాక్టర్ నాగార్జున అన్నారు. ‘వాస్తవ పరిస్థితులు ఏంటో జనాలకు తెలియకపోవచ్చు. కానీ, మంత్రులు.. లీడర్లకు తెల్వదా’ అని ప్రశ్నించారు. ‘మంత్రి పిలుపుతో ప్రచారానికి వెయ్యి మంది వస్తారనుకుంటే, అందులో కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ రెండు కుటుంబాల బాధ్యత ఎవరు తీసుకుంటారు”అని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా పేషెంట్లను కాపాడేందుకు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కష్టపడుతుంటే.. వైరస్ ను నియంత్రించాల్సిన నాయకులు ఇలా మీటింగ్ లు పెట్టడం దారుణమంటున్నారు వైద్యులు. రాజకీయ నాయకులు ర్యాలీలు, ప్రచారాలతో ఓ వైపు వైరస్ వ్యాప్తికి కారణమవుతూ.. మరోవైపు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడుడుతున్నారు. ఇలాంటి మైండ్ లెస్ రాజకీయాలపై నిరసన వ్యక్తం చేయాలన్నారు.